World Mosquito Day : ప్రపంచ దోమల దినోత్సవం 2025.. దోమల వల్ల కలిగే ప్రమాదాలు, నివారణ చర్యలు ఇవే
Mosquito Day : దోమల వ్యాప్తి ద్వారా కలిగే ఆరోగ్య ప్రమాదాలను గుర్తిస్తూ.. వాటిపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఏడాది ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వాటిని ఎలా అరికట్టాలో చూసేద్దాం.

World Mosquito Day 2025 : ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఆగస్టు 20వ తేదీన జరుపుతున్నారు. ఈ సమయంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోమల వ్యాప్తి, వాటి ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి ఎన్నో వ్యాధులు దోమల ద్వారానే వస్తాయి. ఈ విషయాన్ని, ముఖ్యంగా మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని బ్రిటీష్ శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ 1897లో గుర్తించారు. దీనివల్ల లక్షలాది ప్రాణాలు కాపాడగలిగారు. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన వరల్డ్ మస్కిటో డే నిర్వహిస్తున్నారు.
ప్రపంచ దోమల దినోత్సవం ప్రాముఖ్యత
గతంలో దోమల వ్యాప్తి, వాటి ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన లేక.. వ్యాప్తిని అరికట్టడం జరగలేదు. మలేరియా వ్యాప్తి పెరిగే కొద్ది మృతులసంఖ్య కూడా పెరిగేది. ఆ సమయంలో దోమల ద్వారే ఈ వ్యాప్తి తగ్గుతుందని గుర్తించి.. దోమలను అరికట్టడంతో సమస్య కంట్రోల్ అయింది. అందుకే ఈ స్పెషల్ డేని కచ్చితంగా నిర్వహించాలంటున్నారు నిపుణులు. దీనివల్ల దోమల వల్ల కలిగే ప్రమాదాల గుర్తించి.. వాటి వ్యాప్తిని ఎలా అరికట్టాలో తెలుసుకోవచ్చని చెప్తున్నారు.
దోమలు ఎంత ప్రమాదమంటే..
దోమ కుడితే దొద్దుర్లు వచ్చేది కామన్. కానీ కొన్ని దోమలు తమతో పాటు మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, జికా వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి. అందుకే వీటిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జంతువులుగా చెప్తారు. ఎందుకుంటే ఇవి చిన్న ప్రాంతంలోకి వెళ్లి కూడా వీటిని ఆరోగ్య సమస్యలను వ్యాపింప చేయగలవు. అందుకే దోమల వ్యాప్తిని అరికట్టడంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
దోమల వ్యాప్తిని అరికట్టే పద్ధతులు..
ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. పూల కుండీల్లో, బకెట్లలో, పాత టైర్లలో నీరు ఎక్కువగా నిల్వ ఉండిపోతుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో దోమలు కుట్టకుండా మస్కిటో నెట్స్, స్క్రీన్స్, కిటికీలకు కూడా నెట్స్ అమర్చుకోవాలి.
తులసి, లెమన్ గ్రాస్, గులాబీ వంటి వాసనలు దోమలను దూరంగా ఉంచుతాయి కాబట్టి వాటిని ఇంటి చుట్లూ ప్లేస్ చేసుకోవాలి. లేదా వాటి ఎసెన్స్ ఆయిల్స్ నీటిలో కలిపి గోడలపై చల్లాలి. సాయంత్రం లైట్ కలర్, పొడుగ్గా చేతులు ఉండే దుస్తులు వేసుకోవాలి. బయటకు వెళ్లేముందు కాళ్లు, చేతులపై రిపెలెంట్స్ అప్లై చేసుకోవాలి.
ఈ చిట్కాలు ఫాలో అవుతూ ఉంటే దోమల వ్యాప్తి.. వాటి ద్వారా వ్యాపించే వ్యాధుల వ్యాప్తి కూడా కంట్రోల్ అవుతుంది. వీలైనంత వరకు ఇంటిని, ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే దోమలు కంట్రోల్ అవుతాయి. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమలు ఎంత ప్రమాదమో, వాటిని ఎలా నివారించవచ్చో.. అందరికీ మీరు కూడా తెలియజేయండి. మీ వంతుగా దోమలను అరికట్టడంలో కృషి చేయండి.






















