Dead Woman Alive: శవపేటిక నుంచి శబ్దం, తెరిచి చూస్తే శవం లేచి కూర్చొంది, సంతోషించే లోపే మళ్లీ విషాదం
కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయిన మహిళను శవపేటికలో పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. కొద్ది క్షణాల్లో ఆమెను పూడ్చిపెడతారనగా.. శవ పేటిక నుంచి శబ్దం వచ్చింది. తెరిచి చూస్తే షాక్!
మీరు హర్రర్ సినిమాలు చూసే ఉంటారు. స్మశానంలో శవాల చేతులు భూమి నుంచి పైకి వస్తుంటాయి. శవ పేటికల్లో శవాలు లేచి కూర్చుంటాయి. ఒకటేమిటి.. ఇంకా అందులో అలాంటివి చాలానే ఉంటాయి. అయితే, ఇప్పుడు మీరు చదవబోయే ఘటన అంత భయానకంగా ఉండదు గానీ.. దాన్ని ప్రత్యక్షం చూసినవారికి మాత్రం గుండె జారినట్లై ఉంటుంది. ఎందుకంటే.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహిళ అంత్యక్రియల్లో ఒక్కసారే ఊపిరి పీల్చుకుంది. అప్పటికే ఆమెను శవ పెట్టికలో పెట్టేసి మూసేశారు. మరికొన్ని సెకన్లలో పూడ్చి పెడతారనగా.. శవ పేటిక నుంచి శబ్దం వచ్చింది. లోపలి నుంచి ఆమె చేసిన చప్పుడు అది. దీంతో ఆమె బంధువులు శవపేటికను తెరిచి చూసి ఆశ్చర్యపోయారు. చనిపోయిందని భావించిన ఆమె బతికే ఉంది. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.
ఈ ఘటన పెరులోని లంబాయెక్‌లో చోటుచేసుకుంది. రోసా ఇసాబెల్ సెస్పెడెస్ కల్లాకా అనే మహిళ తన బావ, అతడి ముగ్గురు పిల్లలతో కలిసి కారులో బయటకు వెళ్లింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వారి కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రోసా బావ చనిపోయాడు. ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. రోసాకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. రోసా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించారు.
రోసాను శవ పేటికలో పెట్టి మూసివేశారు. శవ పేటికను గోతిలో కప్పెట్టేందుకు కుటుంబికులు భుజాలపై పెట్టుకున్నారు. ఆ సమయంలో రోసా అపస్మారక స్థితి నుంచి బయటకొచ్చింది. శవపేటిక లోపలి నుంచి ‘‘నేను బతికే ఉన్నాను’’ అని అరిచింది. శవ పేటికను బాదుతూ శబ్దం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు శవపేటికను కిందకు దించి తెరిచి చూశారు. వెంటనే రోసా అందులో నుంచి లేచి కూర్చొని ‘‘నేను బతికే ఉన్నాను’’ అని చెప్పింది.
శ్మశాన వాటిక నిర్వాహకుడు మాట్లాడుతూ.. ‘‘శవపేటిక తెరవగానే ఆమె కళ్లు తెరిచి చూసింది. ఆమెకు బాగా చెమటులు పట్టేసి కంగారుగా ఉంది. వెంటనే నేను నా ఆఫీసుకు వెళ్లి పోలీసులకు సమాచారం అందించాను’’ అని తెలిపాడు. రోసా కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను శవపేటిక నుంచి బయటకు తీయకుండానే అంబులెన్స్ ఎక్కించారు. వైద్యులు ఆమెకు వెంటనే కృత్రిమ శ్వాసను అందించారు. కానీ, అప్పటికే ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. బ్యాడ్ లక్ ఏమిటంటే అలా బతికిన కొన్ని గంటల తర్వాత ఆమె చనిపోయింది.
Also Read: అతడి అంగాన్ని చేతికి కుట్టేసిన వైద్యులు, కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
ప్రమాదం తర్వాత ఆమె అపస్మారక స్థితికి చేరుకుని ఉండవచ్చని, వైద్యులు అన్ని పరీక్షలు చేయకుండా ఆమె చనిపోయిందని చెప్పేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందించి ఉంటే ఆమెకు బతికి ఉండేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. బతికిందని సంతోషపడేలోపే ఆమె మళ్లీ కన్నుమూయడాన్ని ఆమెకు కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు.
Also Read: క్రీడాకారుల మలంతో ప్రత్యేక మాత్రలు - వీటిని ఏ వ్యాధికి వాడతారో తెలుసా?