Weird: బాయ్ ఫ్రెండ్ కు అందంగా కనిపించాలనుకుంది... చివరకు ఆసుపత్రి పాలైంది
మనం వేసుకునే దుస్తులు కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అందుకు ఈ అమ్మాయే ఉదాహరణ.
ఓ అమ్మాయి తొలిసారి తన బాయ్ ఫ్రెండ్ ను కలిసేందుకు ఉత్సాహంగా వెళ్లింది హైవెస్ట్ జీన్స్ షార్ట్, టీ షర్ట్ తో ట్రెండీగా తయారైంది. షార్ట్ అనగానే మోకాళ్ల దాకా ఉంటుందనుకోకండి. కేవలం తొడల పైభాగం వరకే వేసుకుంది. అది కూడా చాలా బిగుతుగా ఉండేది ధరించింది. ఎనిమిది గంటలు బాయ్ ఫ్రెండ్ తో సినిమాలు, షికార్లు ఎంజాయ్ చేసింది. ఆ ఎనిమిది గంటల్లో చాలా సార్లు ఆమెకు ఆ పొట్టి నిక్కరు ఇబ్బందిగా అనిపించింది. అయినా బాయ్ ఫ్రెండ్ తో మొదటిసారి బయటికి వెళ్లింది కాబట్టి... ఆ ఇబ్బందిని పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజుల తరువాత కేవలం ఆ పొట్టి నిక్కరు వల్ల ఆమె ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరి అత్యవసరచికిత్స అందుకోవాల్సి వచ్చింది. ఆ టైట్ నిక్కర్ ప్రాణాల మీదకు తెచ్చింది. అసలేం జరిగింది?
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉంటోంది సామ్. ఆమెకు కొత్తగా బాయ్ ఫ్రెండ్ దొరికాడు. అతనితో కలిసి అవుటింగ్ కు వెళ్లి వచ్చింది. మరుసటి రోజు ఆమెకు పిరుదుల భాగంలో మంటగా, నొప్పిగా అనిపించ సాగింది. ఆ నొప్పి పెరుగుతూ వచ్చింది. తడిమి చూస్తే పెద్ద వాపులా కనిపించింది. ఆ ప్రదేశంలో కత్తితో పొడిచినంత నొప్పి. భరించలేక వైద్యుడిని సంప్రదించింది. ఆయన కొన్ని యాంటీబయోటిక్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఆ రాత్రికే సామ్ వణుకు, నడవలేనంత నీరసం, ఊపిరి సరిగా అందకపోవడం వంటి సమస్యలతో ఐసీయూలో చేరింది. వైద్యులు ‘సెప్సిస్’ గా తేల్చారు. ఆ వాపు వచ్చిన ప్రాంతంలో కణితిని తొలగించారు. అదృష్టవశాత్తు సామ్ బతికింది. ఇంకా ఆలస్యమైతే ఆమె ప్రధాన అవయవాలన్నీ పనిచేయడం ఒక్కొక్కటిగా ఆగిపోయేవని చెప్పారు వైద్యులు. దీనికంతటికీ కారణం ‘ఒంటిని బిగుతుగా పట్టేసేలా వేసుకున్న ఓ పొట్టి షార్ట్’. అందుకే తనకు జరిగిన దాన్ని అందరికీ సోషల్ మీడియాలో వైరల్ చేసింది సామ్. ‘కేవలం ఒక అబ్బాయికి అందంగా కనిపించాలనుకున్నందుకు నేను మూల్యం చెల్లించుకున్నాను’ అని చెప్పింది.
పొట్టి షార్ట్ వేసుకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందా?
బిగుతైన పొట్టిషార్ట్ వల్ల శరీరానికి గాలి తగిలే మార్గం మూసుకుపోతుంది. ఆ దుస్తుల రాపిడి చర్మంపై ఎక్కువగా ఉంటుంది. దీనికి అక్కడ ఎర్రగా మారి, ఇన్ ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సామ్ కు అలాగే జరిగింది. టైట్ నిక్కరు వల్ల శరీరంపై రాపిడి ఎక్కువైంది, ఆప్రదేశానికి గాలి కూడా తగలలేదు. ఎనిమిది గంటలు అలానే ఉండడంతో అది ఇన్ ఫెక్షన్ గా మారిపోయింది. ఆ ఇన్ ఫెక్షన్ అధికస్థాయిలో ఉండడంతో ‘సెప్సిస్’ గా మారింది. సెప్సిస్ చాలా ప్రమాదకరమైన పరిస్థితి. శరీరంలో ఇన్ ఫెక్షన్ల కారణంగా సెప్సిస్ అనే స్థితి ఏర్పడుతుంది. దీని వల్ల శరీరంలోని అవయవాలు పనిచేయడం ఆగే ప్రమాదం ఉంది. సెప్సిస్ పరిస్థితి ఏర్పడిందని తెలిసిన గంటల్లోనే చికిత్స అందించాలి. లేకుంటే ప్రాణాంతకంగా మారిపోతుంది.
ఒంటిని పట్టేసే బిగుతైన దుస్తులను వాడొద్దని చెబుతున్నారు వైద్యనిపుణులు. కాస్త వదులుగా, శరీరానికి గాలి తగిలేలా వేసుకోవడం చాలా ముఖ్యం.
Also read: ప్యాకెట్ పాలను మరగబెట్టాల్సిన అవసరం ఉందా? నేరుగా తాగొచ్చా?
Also read: ఈ ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తింటున్నారా? ప్రమాదం తప్పదు
Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం