Food:ఈ ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తింటున్నారా? ప్రమాదం తప్పదు
తాజా ఆహారమే ఆరోగ్యానికి పునాది. కానీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నది ఎంత మంది?
చాలా మంది ఉదయానే అన్నం, కూర, రసం.. ఇలా అన్నీ వండేసుకుంటారు. అది కూడా రాత్రి వరకు సరిపడా. వాటినే తినేముందు వేడి చేసుకుని తింటుంటారు. అలాగే ముందు రోజు మిగిలినవి మరుసటి రోజు స్టవ్ మీద మళ్లీ వేడి చేసుకుని తింటుంటారు. అలాగే కర్రీ పాయింట్ల వాళ్లు కూడా మధ్యాహ్నం మిగిలిన కూరలను, రాత్రికి మళ్లీ కొత్తగా వండి వడ్డించేస్తుంటారు. కొన్ని ఆహారా పదార్థాలను మళ్లీ వేడి చేసి తిన్నా పెద్ద ప్రమాదం ఉండదు కానీ, కొన్ని రకాల పదార్థాలను మాత్రం ఇలా మళ్లీ వేడి చేసి లేదా వండి తినడం వల్ల ఆరోగ్యసమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
కోడిగుడ్లు
ఒకసారి కోడి గుడ్డును ఉడికించాక లేదా కూరగా వండాక అలా తినేయాలి. అంతేకానీ చల్లగా అయ్యింది కదా అని స్టవ్ మీద పెట్టి మళ్లీ వండకూడదు. దీని వల్ల కోడిగుడ్డులో ఉండే ప్రోటీన్లు ఒక్కోసారి హానికరంగా మారచ్చు. కడుపునొప్పి కూడా రావచ్చు. కనుక ఒకసారి కోడి గుడ్లతో ఏదో ఒకటి వండాక అలా తినేయడమే మంచిది.
బంగాళాదుంపలు
ప్రతి ఇంట్లో కచ్చితంగా కనిపించే కూర ఇది. పిల్లలకు కూడా చాలా ఇష్టం. దీన్ని ఫ్రిజ్ లో దాచి, మళ్లీ బాగా వేడి చేసి పిల్లలకు పెట్టే తల్లులకు ఇదే హెచ్చరిక... అలా చేయకండి. దీని వల్ల హానికరమైన సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి.
చికెన్
చికెన్ లోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల చికెన్ కారం తక్కువైందనో, మసాలా తగ్గిందనో వండిన కూరనే మళ్లీ మళ్లీ వేడి చేయకండి. ప్రోటీన్లు ప్రమాదకరంగా మారతాయి.
పాలకూర
పోషకాల పాలకూర తాజాగా వండిన వెంటనే తింటే ఎంతో మేలు. అదే ఫ్రిజ్ లో దాచుకుని, దాన్ని మళ్లీ వేడి చేసుకుని తింటే మాత్రం మంచిది కాదు. ఇందులో ఐరన్, నైట్రేట్, ఇతర పోషకాలు నశించిపోతాయి.
టీ
టీని ఫ్లాస్కులో పోసుకుని వేడిగా ఉన్నప్పుడు తాగితే మంచిదే. టీ చల్లారి పోయాక మళ్లీ దాన్ని వేడి చేసి తాగడం మాత్రం మంచిది కాదు. టీ బాగా చల్లారాక అందులో సూక్ష్మజీవులు పుట్టే అవకాశం ఉంది.
అన్నం
ఓసారి అన్నం వండాక మళ్లీ మళ్లీ దాన్ని వేడి చేసి తినడం మంచి పద్దతి కాదు. నిజానికి అలా తినడం వల్ల శరీరానికి అందే పోషకాలు కూడా సున్నా.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ప్యాకెట్ పాలను మరగబెట్టాల్సిన అవసరం ఉందా? నేరుగా తాగొచ్చా?
Also read: సెప్సిస్ గురించి విన్నారా? పైకి కనిపించకుండా ప్రాణాలు తీసేస్తుంది...
Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం