Winter Health Care : చలికాలంలో సన్షైన్ విటమిన్ చాలా అవసరమట.. ఎందుకంటే..
Sunshine Vitamin : శరీరానికి విటమిన్స్ చాలా అవసరం. ముఖ్యంగా చలికాలంలో శరీరానికి సన్షైన్ విటమిన్ అవసరం ఎంతో ఉంది అంటున్నారు నిపుణులు. దీనిని ఎలా పొందాలి. దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటి?
Vitamin D Benefits : మన శరీరం బాగా పనిచేయడానికి విటమిన్లు, పోషకాలు చాలా అవసరం. వీటిలో చాలా వరకు మనం తీసుకునే ఆహారాలు నుంచి, పానీయాల నుంచి దొరుకుతాయి. అయితే ఫుడ్, పానీయాల నుంచి కాకుండా.. సూర్యరశ్మి నుంచి మనం విటమిన్ డిని పొందుతాము. అందుకే దానిని 'సన్షైన్ విటమిన్' అంటారు. విటమిన్ డితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది శరీరానికి చాలా అవసరం అయితే.. చలికాలంలో దీనిని పొందడం కాస్త కష్టమనే చెప్పాలి. ఎందుకంటే సూర్యరశ్మి నుంచే శరీరానికి విటమిన్ డి అందుతుంది.
సూర్యరశ్మి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఉదయపు ఎండ నేరుగా చర్మంపై ప్రసరించినప్పుడు.. అది మీ ఎముకలు, మానసిక స్థితి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ డి అనే విటమిన్ను శరీరం గ్రహిస్తుంది. విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే విటమిన్. ఈ విటమిన్ తగినంతగా పొందడం శరీరానికి చాలా అవసరం. అయితే చలికాలంలో దీనిని పొందడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో డే సమయం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరానికి విటమిన్ డి చాలా తక్కువగా దొరుకుతుంది.
విటమిన్ డి శరీరంలో చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. కాబట్టి రోజూ మీరు దీనిని మీ శరీరానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు రోజూ కుదరకపోతే.. విటమిన్ డి కోసం మీరు ప్రతి రెండు రోజులకు పదిహేను నిమిషాలు ఎండలో ఉంటే చాలు. విటమిన్ డి విటమిన్గా కంటే.. మీ శరీరంలో ఓ హర్మోన్లాగా పని చేస్తుందని ఓ పరిశోధనలో తేలింది. బరువు నిర్వహణలో, జీవక్రియ, అవయవాల పనితీరులో విటమిన్ డి గురించి పాత్ర చాలా ప్రత్యేకమైనది.
విటమిన్ డి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
విటమిన్ డి వల్ల మీ శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దంతాలు, ఎముకలను బలంగా ఉంచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో, సరైన బరువును కలిగి ఉండడంలో మీకు సహాయం చేస్తుంది. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ నివారణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇవేకాకుండా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చిత్తవైకల్యం, అభిజ్ఞా క్షీణత నివారణలో విటమిన్ డి చేసే సహాయం అంతా ఇంతా కాదు. కొన్నిరకాల క్యాన్సర్లను నివారిస్తుంది. కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది.
విటమిన్ డి లోపం వల్ల కలిగే నష్టాలు
విటమిన్ డి మీ శరీరంలో లేనప్పుడు మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది పిల్లల్లో వేరుగా ఉంటుంది. పిల్లల్లో విటమిన్ డి తక్కువగా ఉంటే వారి ఎదుగుదల తగ్గుతుంది. కుంటుపడటం, ఎముకలు పెళుసుగా మారతాయి. పెద్దవారిలో విటమిన్ డి లోపం కనుక్కోవడం కాస్త కష్టమే. అయితే పెద్దవారిలో విటమిన్ డి తక్కువగా ఉంటే.. అలసట, కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ డి లోపం తీవ్రంగా మారితే లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఎముకలు బలహీనంగా మారుతాయి.
సూర్యకాంతి నుంచే కాకుండా..
సూర్యకాంతితో పాటు.. మీరు తృణధాన్యాలు, పాలు, చేపలు, గుడ్లు ద్వారా విటమిన్ డి పొందవచ్చు. లేదంటే మీరు విటమిన్ డి సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. అయితే వీటిని తీసుకునేముందు కచ్చితంగా వెద్యుడిని సంప్రదించండి.
Also Read : మీ స్కిన్ టోన్ డార్క్ అవుతోందా? ఈ ఇంటి చిట్కాలతో టాన్ రిమూవ్ చేసేయొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.