Mosquito Bite: ఆడదోమలు మాత్రమే ఎందుకు కుడతాయి? రక్తం లేకుండా అవి బతకలేవా?
వానాకాలంలో మనుషుల కన్నా ఇంట్లో అధికంగా కనిపించేవి దోమలే.
దోమలు కేవలం రక్తం తాగి మాత్రమే బతకగలవు, వాటి ఆహారం రక్తమే అనుకుంటారంతా... నిజానికి ఇది అబద్ధం. వాటి పొట్ట నింపుకోవడం కోసం అవి రక్తం తాగవు. వాటి శారీరక అవసరాల కోసం మాత్రమే కుడతాయి. అందులోనూ మనుషులను కుట్టేవన్నీ ఆడదోమలేనట. ఆకలి తీర్చుకోవడం కోసమే మన రక్తాన్ని ఆడదోమలు తాగితే, మరి మగ దోమల పరిస్థితేంటి? నిజానికి మన రక్తం తాగకుండా కూడా అవి జీవించగలవు. దోమల ఆహారాలు అనేకం ఉన్నాయి. రక్తం వాటి ఆహారమే కాదు.
కుట్టేవన్నీ ఆడదోమలేనా?
శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం మనల్ని కుట్టేవన్నీ ఆడదోమలే. వాటికే మన రక్తంతో అవసరం ఉంది. పునరుత్పత్తి చేయాలంటే వాటికి మనుషుల రక్తం కావాలి. ఆడదోమల్లో అండాల ఫలదీకరణకు, గుడ్డు పెట్టేందుకు రక్తం అవసరం. అందుకే ఆడదోమలు మన రక్తాన్ని పీల్చుకుంటాయి. అయితే ఓ అంచనా ప్రకారం కార్బన్ డయైక్సైడ్ ఆడదోమల్ని బాగా ఆకర్షిస్తుంది. అందుకే ఏ శరీరం నుంచి అధికంగా కార్బన్ డైయాక్సైడ్ విడుదలవుతుందో వారినే కుడుతుందని అంటారు. అలాగని ఈ విషయాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు. కొన్ని రకాల వాసనలు వాటిని ఆకర్షిస్తాయని, ఆ వాసనలు అధికంగా వచ్చే వ్యక్తిన అవి కుడతాయని చెబుతారు.
ఆ ఆడదోమ కథ ఇదే...
ఏడిస్ ఈజిప్టీ దోమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదే డెంగీ, చికెన్ గున్యా, జికా, ఎల్లో ఫీవర్, బోదకాలు, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాపించేలా చేసేది. ఈ దోమల తలపై యాంటెన్నాలాంటివి ఉంటుంది. అది వాసనలను గ్రహిస్తుంది. ఏ మనిషి దగ్గర అయితే లాక్టిక్ యాసిడ్ వాసన అధికంగా వస్తుందో వారినే వెళ్లి కుడుతుందట ఏడిస్ ఈజిప్టి ఆడదోమ. ఆ వాసనను మనం గ్రహించలేం. వాటికే తెలుస్తుంది.
అందుకే ఇలా...
శరీరానికి పౌడర్లు, నూనెలు, క్రీములు లాంటివి రాసుకుంటే మీ వైపు కూడా రావు దోమలు. కారణం శరీరం నుంచి వచ్చే నిజమైన వాసనలను ఈ క్రీములు అడ్డుకుంటాయి. దోమల యాంటెన్నాలు వాటిని గ్రహించలేవు. అందుకే దోమలను దూరంగా ఉంచేందుకు శరీరానికి కొట్టుకునే స్ప్రేలు, క్రీములు మార్కెట్లోకి వచ్చాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.