Pigeons: పావురాలకు దూరంగా ఉండమని వైద్యులు ఎందుకు చెబుతున్నారు? వాటితో వచ్చే సమస్యలేంటి?
పావురాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ముంబైకి చెందిన ఇద్దరు మహిళలు హఠాత్తుగా ఊపిరి అందక ఇబ్బంది పడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చేరారు. వారిద్దరికీ ‘క్రోనిక్ హైపర్ సెన్సిటివిటీస్ నిమోనైటిస్’ అనే తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి కలిగినట్టు చెప్పారు వైద్యులు. దీని కారణంగా వారికి ఊపిరితిత్తుల మార్పిడి కూడా చేయించాల్సి వచ్చింది. ఈ సమస్యని పర్యావరణ సంబంధితంగా వచ్చిన ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ అని కూడా పిలుస్తారు. ఈ ఇద్దరు మహిళలకు హఠాత్తుగా ఇంతటి ఆరోగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్న అనుమానం వైద్యులకు కలిగింది. ఇద్దరు మహిళలను తమ ఇంటి వాతావరణం గురించి అడిగి తెలుసుకున్నారు. వారిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఆ ఇంటి కిటికీల భాగంలో పావురాలు తరచూ తిరుగుతూ రెట్టలు వేస్తూ ఉంటాయి. పాత ఇంట్లో ఉన్నప్పుడు వీరికి ఎలాంటి సమస్యా లేదు. అక్కడ పావురాలు ఉండేవి కావు. ఎప్పుడైతే కొత్త ఇంటికి మారారో, శ్వాస సమస్యలు మొదలయ్యాయని ఆ ఇద్దరు రోగులలో ఒకరు చెప్పారు. వైద్యులు కూడా పావురం రెట్టలు కారణంగానే వీరికి ఈ తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి వచ్చినట్టు తేల్చారు.
60కి పైగా వ్యాధులు
పావురం రెట్టల కారణంగా 60కి పైగా వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్టు ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఆ రెట్టల్లో హిస్టో ప్లాస్మోసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ క్యాండీ డియాసిస్, క్రిప్టో కోకోసిస్ వంటి బ్యాక్టిరియాల వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేయగలవు. పావురం రెట్టల్లో E.coli అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీని కారణంగా వచ్చే అంటు వ్యాధులు ఎన్నో. అలాగే ఇన్ఫెక్షయస్ ఫ్లూ లాంటి వ్యాధి కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. పావురాల నుండి మానవులకు వ్యాపించే అవకాశం ఎక్కువ ఈ వ్యాధి క్లామిడియా సిట్టాసి అనే బ్యాక్టిరియా వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి నిమోనియాగా మారి ఊపిరితిత్తులను కుచించుకుపోయేలా చేస్తుంది. అందుకే పావురాలు మీ ఇంటి చుట్టూ లేకుండా చూసుకోండి.
మెట్రో నగరాల్లో పావురాలకు మేత వేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది. అది మానుకోమని ఇప్పటికే వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా పావురాలకు మేత వేయడం, పావురాలను పెంచడం, ఇంటి చుట్టూ అవి తిరుగుతూ రెట్టలు వేస్తున్నా పట్టించుకోకపోవడం జరుగుతూనే ఉంది. అది విసర్జించే వ్యర్ధాల వల్ల తీవ్రమైన సమస్యలు వస్తున్నప్పటికీ అవగాహన లేక ఎంతో మంది ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
ఏసీలు వంటివి ఉపయోగించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటికి దగ్గరలోనే పావురాలు నివసించడానికి ఇష్టపడతాయి. అక్కడే వాలుతుంటాయి. ఆ ప్రాంతాల్లో పావురాల రెట్టలు వేయకుండా చూసుకోవాలి. బాల్కనీలు, కిటికీలపై పావురం రెట్టలు ఉంటే వెంటనే శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసేటప్పుడు మాస్కు కచ్చితంగా ధరించండి. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు... పావురాలకు, పావురం రెట్టలకు ఎంత దూరంగా ఉంటే అంత ఎక్కువ కాలం జీవించగలుగుతారు.
Also read: 2400 ఏళ్లనాటి మమ్మీ - మరణించే ముందు ఆ వ్యక్తి ఏం తిన్నాడో కనిపెట్టిన పరిశోధకులు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.