Sweets: తీపి పదార్థాలు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా...
అన్ని రుచుల్లో తీపికే ఎక్కువ మంది దాసోహమంటారు. షడ్రుచుల్లో మళీమళ్లీ తినాలనే కోరికను పెంచే రుచి కూడా తీపే.
తీపి పదార్థాలు తింటే ఎంత రుచిగా ఉంటాయో, అంతగా వాటికి మనల్ని బానిసల్ని చేస్తాయి. మిగతా రుచులతో పోలిస్తే తీపికే అందరినీ తనకు దాసోహం చేసుకునే శక్తి ఎక్కువ. మీరే గమనించండి ఒక్క స్వీటుతో ఎవరూ ఆపేయరు, వరుసపెట్టి మూడు నాలుగు లాగించేస్తారు. కానీ తీపి ఎంత ఎక్కువగా తింటే శరీరానికి అంత నష్టం. దానికి బానిసగా మారితే... కోరి అనారోగ్యాలు తెచ్చుకున్నట్టే. అలా అని తీపి పూర్తిగా తినకపోయినా నష్టమే. శరీరానికి చక్కెర కూడా అవసరమే. కానీ మోతాదుకు మించి తింటే అనర్థాలు తప్పవు. అధికంగా తీపి పదార్థాలు తినడం వల్ల ఏమవుతుందో ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.
తీపి పదార్థాలంటే చక్కెరతో చేసిన స్వీట్లు, ఐస్ క్రీములు, పాయసాలు... ఇలా తియ్యగా ఉండే అన్ని ఆహారాలు వస్తాయి.
1. చాలా మంది ఐస్ క్రీమ్ రాత్రి పూట తింటుంటారు. దీని వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ఒత్తిడి హార్మోన్ పై ప్రభావం చూపిస్తుంది. సరిగా నిద్రపట్టదు.
2. అధికంగా చక్కెరతో చేసిన ఆహారం తినడం వల్ల పొట్ట నొప్పి కలుగుతుంది. అధిక చక్కెరలు త్వరగా జీర్ణం కాక ఇబ్బంది ఏర్పడుతుంది. పొట్టలో గ్యాస్ ఉత్పత్తి అయి నొప్పి పెరుగుతుంది.
3. దంతాల ఆరోగ్యానికి తీపి పదార్థాలు మంచివి కాదు. రాత్రి పూట తీపి పదార్థాలు తినకపోతే మంచిది. ఒకవేళ తినాల్సి వస్తే పడుకోబోయే ముందు బ్రష్ చేసుకుని నిద్రపోవాలి. లేకుండే దంతక్షయం కలుగుతుంది. ఫలితంగా దంతాలు పుచ్చిపోయి, వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
4. అధిక చక్కెరలు శరీరంలో చేరితే కొవ్వు రూపంలోకి మారతాయి. దానివల్ల బరువు పెరుగుతారు.
5. చర్మ ఆరోగ్యాన్ని కూడా చక్కెర దెబ్బతీస్తుంది. చర్మానికి బిగువును అందించే కొల్లాజెన్ నాణ్యతను తగ్గిస్తుంది. దీనివల్ల త్వరగా ఏజింగ్ మొదలైనట్టు కనిపిస్తుంది. చర్మం మీద ముడతలు, గీతలు, మచ్చలు త్వరగా వస్తాయి.
6. పరగడుపున ఖాళీ కడుపుతో తీపి పదార్థాలను తినకూడదు. ఇలా చేయడం వల్ల రోజంతా నీరసంగా గడుస్తుంది. ఏ పని మీద ఆసక్తి కలుగదు. ఒంట్లో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది.
7. భోజనం చేసిన వెంటనే చాలా మందికి స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. అన్నంలో కూడా చక్కెర ఉంటుంది. ఆ వెంటనే స్వీటు తినడం వల్ల రక్తంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో చక్కెర విడుదలవుతుంది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.