కోడిముందా? గుడ్డు ముందా? ఇదిగో జవాబు దొరికేసింది - తాజా పరిశోధనలో తేలింది ఇదే!
కోడి ముందా? గుడ్డు ముందా? అని అడిగితే మీరు ఏం చెబుతారు? తప్పకుండా నీళ్లు నములుతారు కదూ. ఇప్పటివరకు చేసిన పరిశోధనల ప్రకారం.. చిన్న క్లారిటీ దొరికింది. అదేంటో చూడండి.
కోడి ముందా? గుడ్డు ముందా? ఇది ఎన్నటికీ తెగని యుగాల నాటి ప్రశ్న. ఎంతో అనుభవజ్ఞులైన పండితులకు సైతం అంతుదొరకనిది. దీన్ని సైంటిఫిక్ గా తేల్చేందుకు కంకణం కట్టుకున్న అధ్యయనకారులు మొత్తానికి ఒక విషయాన్నైతే తెలుసుకున్నారు. ఇంతకీ అదేంటో తెలుసుకోవాలని మీకూ ఆసక్తిగా ఉందా? అయితే చూసేయండి.
51 శిలాజ జాతులు, 29 జీవ జాతుల విశ్లేషణ తర్వాత ఓవిపారస్.. అంటే గుడ్లు పెట్టేవి, విపరస్ అంటే.. పిల్లలకు జన్మనిచ్చేవిగా వర్గీకరించారు. ఓవిపారస్ జాతులు బలమైన లేదా మృదువైన పెంకులతో కూడిన గుడ్లు పెడతాయి. విపరస్ జాతుల జీవులు చిన్న పిల్లలకు జన్మనిస్తాయి. ఈ కొత్త పరిశోధన వివరాలు నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్ లో ప్రచురించారు.
విపరస్ జీవుల్లో అంతరించిపోయిన క్లాడ్ లో అండాశయాలు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు ఇప్పటివరకు దొరికిన ఆధారాలను బట్టి ఎక్స్ టెండెడ్ ఎంబ్రియో రిటెన్షన్ (EER) అనేది మొదట్లో రిప్రొడక్టివ్ మోడ్ గా ఉన్నట్టు సూచనగా అధ్యయనకారులు అభిప్రాయపడతున్నారు. EER అనేది చాలాకాలం పాటు పిండాలను కలిగి ఉండడానికి నిదర్శనం. కాలం అనుకూలించినపుడు వాటికి జన్మనిచ్చేందుకు వీలుగా ఈ ఏర్పాటు ఉండి ఉంటుందని అంటున్నారు.
అమ్నియేట్స్ ఏర్పడడానికి ముందు కొన్ని జాతుల వర్టిబ్రేట్స్ ఎంబ్రయోనిక్స్ గా అభివృద్ధి చెందాయని అవే మొదటి టాట్రోపోడ్స్ గా ఉభయ చరాలుగా ఏర్పడ్డాయని వివరణ ఇస్తున్నారు. కప్పలు, సాలమండల వంటి ఆధునిక ఉభయచరాల మాదిరిగానే ఆహారం కోసం, సంతానోత్పత్తి కోసం నీటిలోనో లేదా నీటికి దగ్గరలోనో ఉండాల్సి వచ్చింది.
320 మిలియన్ సంవత్సరాలకు ముందే అమ్నియేట్లు ముందుగా కనిపించాయి. వాటర్ ప్రూఫ్ చర్మం, ఇతర అవయవాలు అభివృద్ధి చేసుకుని నీటికి దూరంగా మనుగడ సాగించగలిగాయి. అయినప్పటికీ అమ్నియాటిక్ ఎగ్ అనేదే వీటి మనుగడకు కీలకం. అమ్నియాటిక్ ఎగ్ అంటే ఉమ్మనీరు కలిగిఉండే గుడ్డు అని అర్థం. ఈ ఉమ్మనీరు ఒక ప్రైవేట్ పాండ్ లా ఉపయోగపడతుంది. వేడిగా ఉండే నీటి బయటి వాతావరణంలో తట్టుకోవడానికి వీలుగా ఈ ఏర్పాటు జీవులలో అభివృద్ధి చెందింది.
కొన్ని రకాల బల్లులు, పాములు వాటికి అనువైన పునరుత్పత్తి విధానాలను అనుసరిస్తాయి. వీటిలో ఓవిపారిటీ, వివిపారిటీ రెండు కనిపిస్తాయి. శీలాజాలు పరిశీలించినపుడు పిల్లలకు జన్మనివ్వడం, గుడ్డుపెట్టడం రెండింటి మధ్య పరివర్తన కనిపిస్తుంది.
EER అనేది బల్లులు, పాములలో సాధారణం. పిల్లలను పెట్టవచ్చు లేదా గుడ్డులో కణంగాను దాచి ఉండి వివిధ దశలలో అభివృద్ధి చేసి విడుదల చేయవచ్చు. వాతావరణం అనుకూలంగా ఉన్నపుడు కొత్త తరాన్ని పుట్టిస్తాయనేది మాత్రం నిశ్చితమైన విషయమని ఈ అధ్యయనాన్నినడిపిన డాక్టర్ జోసెఫ్ కీటింగ్ చెప్పారు.
ఇంకా పూర్తిగా రుజువులు చూపలేము కానీ కొత్త జీవానికి లోకంలోకి వచ్చే ముందు తల్లిదండ్రుల సంరక్షణా చాలా ముఖ్యమని మాత్రం చెప్పగలము అని పరిశోధనా బృందం వెల్లడి చేస్తుంది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారాన్ని బట్టి కోడే ముందు పుట్టిందని అనుకోవాలని అంటున్నారు. దీనిపై మరింత లోతుగా అన్వేషించి.. స్పష్టమైన జవాబును త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. అప్పటి వరకు మనం.. కోడే ముందని చెప్పేసుకుందాం. ఏమంటారు?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.