Ukraine: జీవరసాయన ఆయుధాలు అంటే ఏమిటి? పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? మనుషులను సైలెంట్‌గా ఎలా చంపుతాయి?
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంలో జీవ రసాయన ఆయుధాలను వాడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. అసలేంటివి?
ప్రపంచ దేశాలు కన్నెర్రచేస్తున్నా వెనక్కితగ్గకుండా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది పుతిన్ సేన. అయితే రష్యా సేన జీవరసాయన ఆయుధాలను వాడుతోందనే వాదన ఉంది. అసలేంటి జీవరసాయన ఆయుధాలు? వీటిని ఎందుకు వాడకూడదు? వీటి వల్ల పర్యావరణానికి కలిగే నష్టమేంటి? ఈ విషయాలు తెలుసుకుందాం.
ఏంటీ ఆయుధాలు?
జీవరసాయన ఆయుధాలు... వీటినే బయో వెపన్స్ అని కూడా అంటారు. బాంబులు,క్షిపణులు వేయగానే పెద్ద శబ్దంతో పేలి అక్కడంతా ధ్వంసం చేస్తాయి. మనిషి శరీరాన్ని కూడా ఛిద్రం చేస్తాయి. ఇదంతా కేవలం సెకన్లలో జరిగిపోతుంది. కానీ జీవరసాయన ఆయుధాలు అలా కాదు. వీటిని శరీరఅవయవాలను పనిచేయకుండా చేసి, ప్రాణాలు తీసే విషవాయువులు,ద్రవాలతో చేస్తారు. అందుకే వీటిని జీవాయుధాలు అంటారు. వాటి తయారీలో ఎలాంటి ప్రమాదకర పదార్థాలను వాడుతారో చూడండి.
ఫాస్జీన్... జీవాయుధాల్లో వాడే ఓ రసాయనం. ఇది మనుషుల ఊపిరితిత్తులపై నేరుగా దాడి చేస్తుంది. శ్వాసకోశ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల్లో స్రావాలు నిండిపోతాయి. ఊపిరాడకుండా అయిపోతుంది. చివరికి ప్రాణం పోతుంది.
మస్టర్డ్ గ్యాస్... ఈ వాయువు గాలిలో కలిసిందంటే చర్మం కాలిపోతుంది. చూపు పోతుంది. చర్మంపై పొక్కుల్లాంటివి వస్తాయి. రకరకాల చర్మ సమస్యలు, ఆరోగ్యసమస్యలు దాడి చేస్తాయి.
నెర్వ్ ఏజెంట్స్... అన్నింటికన్నా ఇవి ప్రమాదకరమైనవి. ఇవి నాడులపై దాడి చేస్తాయి. ఫలితంగా పక్షవాతం వచ్చి అవయవాలన్నీ ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయి. చివరికి మరణమే.
రైసిన్ టాక్సిన్లు... ఇవి కాస్త తక్కువ ప్రమాదకరమైనవి. కానీ ఆరోగ్యాన్ని మాత్రం దెబ్బతీస్తాయి.
సైనైడ్... దీన్ని చాలా ఏళ్ల క్రితమే యుద్ధాల్లో వాడారు. ఇది గుండె పోటు, పక్షవాతం వచ్చి చనిపోయేలా చేస్తుంది.
బాంబుల తయారీలోనే ఈ రసాయన,విష పదార్థాలను కూడా కలిపి ప్రయోగించవచ్చు. లేదా విమానాల్లోంచి చల్లవచ్చు.
ఎందుకు వాడకూడదు?
జీవరసాయన ఆయుధాల వల్ల సామాన్య ప్రజలు అధికంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అనేక మంది దీర్ఘకాలిక వ్యాధులతో జీవితాంతం బాధపడాల్సి వస్తోంది. మొదటిప్రపంచ యుద్ధం సమయంలో ఇలాగే జీవాయుధాలను వాడారు వాటి వల్ల 90 వేల మందికి పైగా సైనికులు మరణించారు. ఎంతోమంది చాలా ఏళ్ల పాటూ ఆరోగ్యసమస్యలతో కొట్టుమిట్టాడి మరణించారు. భవిష్యత్ తరవాల వారు కూడా రకరకాల జబ్బులతో జన్మించారు. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే క్యాన్సర్, గుండె జబ్బులతో, వివిధ లోపాలతో పుట్టారు.దీంతో ప్రమాదకరమైన జీవాయుధాలను వాడకూడదని చాలా దేశాలు ఎప్పుడో భావించాయి. 1997లో రసాయన ఆయుధాల నిషేధంపై రష్యాతో సహా చాలా దేశాలు సంతకాలు చేశాయి.
పర్యావరణంపై ఎలాంటి ప్రభావం?
ప్రమాదకరమైన విషకారకాలు గాలిని, భూమిని విచ్ఛిన్నం చేస్తాయి. దీనివల్ల మొక్కల పెరుగుదల నెమ్మదిస్తుంది. జీవాయుధాలు వాడిన చోట చెట్లు నల్లగా మారిపోతాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. గాలిలో ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గిపోతుంది. ఆ ప్రదేశంలో చాలా ఏళ్ల పాటూ మళ్లీ సాధారణ వాతావరణం నెలకొనదు. అందుకే జీవరసాయన ఆయుధాలు చాలా ప్రమాదకరం.
Also read: మగవారికి ఈ అయిదు అలవాట్లు ఉంటే ఆ పవర్ తగ్గిపోతుంది, వదిలించుకుంటే మేలు
Also read: రోజూ రెడ్ వైన్ తాగితే డయాబెటిస్ ముప్పును తగ్గించుకోవచ్చు, అందంగానూ మారొచ్చు