TV Watching: గంటల కొద్దీ టీవీ చూస్తున్నారా? గుండె పోటు వచ్చే అవకాశం పెరుగుతుంది, చెబుతున్న హార్వర్డ్ వైద్యుడు
కదలకుండా ఒకే చోట కూర్చేని చేసే పని భవిష్యత్తులో స్ట్రోక్ రావడానికి కారణం కావచ్చు.
గంటల కొద్దీ టీవీ చూడడం, డెస్కుల్లో కదలకుండా గంటలుగంటలు కూర్చుని పనిచేయడం ఈ రెండూ భవిష్యత్తులో భయంకరమైన రోగాల బారిన పడే అవకాశం ఉంది. వీటివల్ల ఎప్పుడైనా గుండె పోటు వచ్చే ఛాన్స్ ఎక్కువే. ఇది చెబుతోంది మేం కాదు, ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు. వారిచ్చిన నివేదిక ప్రకారం గంటల కొద్దీ శరీరాన్ని కదల్చకుండా ఉంచడం వల్ల సిరలలో గడ్డలు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. కార్డియాక్ అరెస్టు, గుండె పోటు వంటివి కూడా సంభవించే అవకాశం ఉంది.
టీవీ చూసినప్పుడే...
ఓ సర్వే ప్రకారం టీవీ చూసినప్పుడే అధిక శాతం మంది కదలడానికి ఇష్టపడరు. స్నాక్స్ వంటివి కూడా పక్కనే పెట్టుకుని తింటూ ఉంటారు. కనీసం సినిమా రెండు నుంచి మూడున్నర గంటలు ఉంటుంది. ఆ సమయమంతా కదలకుండా కూర్చుంటారు.సినిమా తరువాత సినిమా చూసే అలవాటున్నవారు కూడా అధికమే. వారందరిలో రక్తంలో గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఆఫీసుల్లో పనిచేస్తున్న వారు కూడా గంటకోసారైనా లేచి ఇటూ అటూ తిరగాలి. వారు కూడా గంటల కొద్దీ కూర్చుని పనిచేస్తారు. వారి చేతులు తప్ప, మిగతా శరీరంలో పెద్దగా కదలికలు ఉండవు. అదే టీవీ చూస్తున్నప్పుడైతే శరీరం మొత్తం అచేతనంగా ఉంటుంది. ఇలా కొన్ని గంటల పాటూ శరీరానికి వ్యాయామం లేకుండా ఉంటే అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయి. దాదాపు 1,31,000 మందిపై పరిశోధనలు చేశారు. వీరంతా కూడడా 40 ఏళ్లు వయసు మించిన వారే. వీరిని రెండు గ్రూపులుగా విడదీశారు. రెండున్నర గంటలు కదలకుండా టీవీ చూసేవారిని ఒక గ్రూపుగా, నాలుగ్గంటలకు మించి టీవీ చూసే వారిని రెండో గ్రూపుగా విడదీశారు.దాదాపు అయిదేళ్లు లేదా అయిదేళ్లకు మించి ఇలా టీవీ చూస్తున్నవారిని కూడా విడదీశారు. వారిని పరిక్షించారు. రెండున్నర గంటలు మాత్రమే చూసే వారితో పోలిస్తే నాలుగ్గంటలకు మించి టీవీ చూసిన వారిలో ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం 1.35 రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది.
సమస్యలు ఇవే...
గంటల కొద్దీ కదలకపోవడం వల్ల పల్మనరీ ఎంబోలిజం, డీప్ వీన్ థ్రాంబోసిస్ అనే ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పల్మనరీ ఎంబోలిజం సమస్యలో ఊపిరితిత్తుల్లో గడ్డలు ఏర్పడతాయి.డీప్ వీన్ థ్రాంబోసిస్ వల్ల సిరల్లో రక్తం గడ్డకడుతుంది. ఇది ఎక్కువగా కాళ్లలోని రక్తనాళాల్లో జరుగుతుంది. దీనివల్ల గుండెకు రక్తప్రసరణ సవ్యంగా కాక, గుండె పోటు వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది.
టీవీ తగ్గించాల్సిందే...
నాలుగ్గంటలు కదలకుండా టీవీ చూసి, ఆ తరువాత ఓ గంట సేపు నడిచేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని చెబుతున్నారు హార్వర్డ్ వైద్యులు. టీవీ చూసే సమయాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
Also read: ఈ మూడు ఆహారాలు వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి, హెచ్చరిస్తున్న అధ్యయనాలు