Unhealthy Habits: భోజనం చేసిన వెంటనే ఇలా చేస్తున్నారా? జాగ్రత్త, ప్రాణాంతక వ్యాధులకు దారితీయొచ్చు!
ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోతే అవి ఒక్కోసారి ప్రాణాల మీదకు తేస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
మంచి ఆహారపు అలవాట్లు ఎప్పుడూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారం అనేక ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ చాలా మంది ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉంటాయి. ఎక్కువగా లేదంటే తక్కువగా తినడం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోకపోవడం, తగినంత పోషకాహారం తీసుకోకుండా ఉండటం, ఉప్పు, చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల అసమతుల్యత ఏర్పడుతుంది. బ్రేక్ ఫాస్ట్ కి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అలాగే మధ్యాహ్న భోజనం కూడా రోజులో అతి ముఖ్యమైనది. బరువు తగ్గాలని లేదా భోజనాన్ని సమతుల్యం చేసుకోవాలని చూసే వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి.
బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయకూడదు
చాలా మంది అల్పాహారం మానేసి మధ్యాహ్నం హెవీగా లంచ్ లాగించేస్తారు. కానీ బ్రేక్ ఫాస్ట్ రోజంతా శరీరం యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. పోషకాహారం అందించడంలో సహాయపడుతుంది. ఉదయం భోజనం చేయకపోవడం అనారోగ్యానికి దారి తీస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం భోజనం స్కిప్ చేస్తే జీవక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.
భోజనం చేసిన వెంటనే డెస్క్ కి వచ్చేస్తున్నారా?
ఆఫీసులో భోజనం చేసిన వెంటనే డెస్క్ కి వచ్చేసి సీటులో కూర్చుని పనిలో మునిగిపోతారు. కానీ తిన్న వెంటనే కూర్చోవడం మంచిది కాదు. ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ప్రోటీన్లు విచ్చిన్నమై జీర్ణక్రియ వేగంగా, మెరుగ్గా పని చేయాలంటే కాసేపు నడక ఆరోగ్యానికి మంచిది.
నీరు తాగాలి
మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేయడం కోసం పుష్కలంగా నీరు తాగాలి. చాలా కార్యాలయాల్లో ఎయిర్ కండిషన్ చేయడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడిపోతారు. దీని వల్ల చర్మం పొడిబారిపోతుంది. చర్మ సమస్యలకు దారి తీస్తుంది.
చిరుతిండి
వేయించిన, మసాలా, జంక్ ఫుడ్ కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతాయి. అజీర్ణం, గుండెల్లో మంట, అనేక ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. జీర్ణ సమస్యలు నివారించాలంటే తేలికపాటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన తక్కువ కొవ్వుతో నిండిన స్నాక్స్ తినడం మంచిది. అవి ఇంట్లో చేసినవి అయితే మరీ మంచిది.
టీ, కాఫీలు వద్దు
ఆఫీసు పనివేళలో కాఫీ, టీ ఎక్కువగా తీసుకుంటారు. దీని వల్ల అసిడిటీ ఏర్పడుతుంది. ఈ రెండింటిలో కెఫీన్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు కలిగిస్తుంది.
అన్ హెల్తీ ఫుడ్
చెడు ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తక్షణ ప్రభావాన్ని చూపవు. కానీ అవి దీర్ఘకలిక్, సూక్ష్మమైన వ్యాధులకు కారణం అవుతాయి. ఇవి ప్రాణాంతకంగా కూడా మారతాయి. వాటిని తగ్గించడం కష్టమవ్వచ్చు.
క్యాన్సర్
చక్కెర ఆహారాలు, పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల కొలోరెక్టల్ క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని పెంచుతుంది. మెనింగియోమో, థైరాయిడ్, అన్నవాహిక క్యాన్సర్, మూత్రపిండాలు, గర్భాశయం, అండాశయాలు కాలేయం, పిత్తాశయం, క్లోమం, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఊబకాయం
సక్రమంగా తినకపోవడం, అల్పాహారం, అతిగా ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం, బరువు పెరగడం వంటి అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది.
గుండె సమస్యలు
సోడియంతో కూడిన ఆహారం రక్తపోటుని పెంచి గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. హార్వర్డ్ హెల్త్ ప్రకారం ఒక వ్యక్తి రోజుకి 2,300 ఎంజీ కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.