Duchenne Muscular Dystrophy : ఆ రుగ్మత వస్తే 20 సంవత్సరాలకు మించి బతకరు.. తోబుట్టువులకు వచ్చే అవకాశం 99 శాతముందట.. చికిత్స, నివారణ చర్యలు ఇవే
Muscular Dystrophy : అవసరాల శ్రీనివాస్.. ఇది సమాజానికి తెలియాల్సిన అవసరముందంటూ ఓ అరుదైన రుగ్మత గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యుక్తవయసు రాకముందే ప్రాణాలు హరించే ఆ వ్యాధి ఏంటంటే..
Life Expectancy of Duchenne Muscular Dystrophy : నటుడు, డైరక్టర్ అవసరాల శ్రీనివాస్ తన సోషల్ మీడియా వేదికగా ఓ రుగ్మత గురించి అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఆ రుగ్మత పేరే డచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ(Duchenne Muscular Dystrophy-DMD). బాలురను ప్రభావితం చేసే అరుదైన కండరాల రుగ్మత ఇది. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు మొదట్లో బాగానే నార్మల్‌గా ఉంటారు. కానీ రోజులు గడిచే కొద్ది వారి జీవనశైలిలో మార్పులు వస్తాయి. అప్పటివరకు గేమ్స్ ఆడుకుంటూ చలాకీగా ఉండే వ్యక్తులు సడెన్‌గా డల్ అయిపోతారట. ఇంతకీ ఈ రుగ్మత లక్షణాలు ఏంటి? చికిత్స ఉందా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అవసరాల శ్రీనివాస్ పోస్ట్‌లో ఏముందంటే..
''రామ్, ఆదిత్య ఇద్దరూ డచెన్ మస్కులర్ డిస్ట్రోఫీతో ఇబ్బంది పడుతున్నారు. ఇది అబ్బాయిలను ప్రభావితం చేసే అరుదైన కండరాల రుగ్మత. వీరిద్దరూ మొదట్లో బాగానే ఉన్నారు. రోజులు గడిచే కొద్ది పెద్దవాడు డల్ అవుతూ వచ్చాడు. అతనిని వైద్యులు దగ్గరికి తీసుకెళ్తే ఈ విషయం తెలిసింది. ఈ రుగ్మత ఒక పిల్లవాడికి అతని తోబుట్టువులకు కూడా ఇది వచ్చే అవకాశం 99 శాతం ఉంది. అలా రెండో వాడు కూడా ఈ రుగ్మత బారిన పడ్డారు.
ఈ రుగ్మతకు చికిత్స అందుబాటులో లేదు. పిల్లలు చనిపోవడాన్ని తల్లిదండ్రులు చూడాల్సి వస్తుంది. రోగనిర్ధారణ జరిగిన సంవత్సరం లేదా రెండు సంవత్సరాలలోపు వారు మంచానికి పరిమితమవుతారు. యుక్తవయసు దాటలేరు. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాలని వారి తల్లిదండ్రులు కోరడంతో ఈ పోస్ట్ చేస్తున్నానంటూ'' రాసుకొచ్చారు. మరి ఈ వ్యాధికి నిజంగానే చికిత్స లేదా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఎలా నివారించవచ్చు వంటివి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
[fb]
రుగ్మతకు కారణమిదే..
డచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది జన్యుపరమైన రుగ్మత. DMD అనేది కండరాల బలహీనతకు తీవ్రమైన రూపం. ప్రపంచవ్యాప్తంగా జన్మించే 5000 మంది అబ్బాయిలలో ఒకరిని ఇది ప్రభావితం చేస్తుంది. ఇది డిస్ట్రోఫిన్ జన్యువులోని ఉత్పరివర్తన వల్ల సంభవిస్తుంది. కండరాల పనితీరుకు అవసరమైన ప్రోటీన్ లేకపోవడానికి దారితీస్తుంది.
లక్షణాలు ఇవే
ఈ రుగ్మత సోకినవారి కండరాల్లో బలహీనత ఏర్పడుతుంది. ముందుగా కాళ్లు, పొత్తికడుపులో ఇది మొదలవుతుంది. సరిగ్గా నిలబడలేరు. నడవడానికి ఇబ్బంది పడతారు. పడిపోతుంటారు. కండరాల తిమ్మిరి దృఢత్వం కోల్పోవడం, శ్వాసకోశ సమస్యలు, గుండె సమస్యలు దీని లక్షణాలే.
నిర్ధారణ, చికిత్స
డీఎన్ఏ పరీక్ష చేస్తారు. కండరాల బయాప్సీ, ఎలక్ట్రోమియోగ్రఫీ, MRI లేదా CT స్కాన్ల ద్వారా దీనిని నిర్ధారిస్తారు. కండరాల క్షీణతను తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్స్ ఇస్తారు. చలనం, బలాన్ని కాపాడుకోవడానికి ఫిజియో, శారీరక చికిత్స అందిస్తారు. రోజువారీ జీవన కార్యకలాపాలకు ఆక్యుపేషనల్ థెరపీ, శ్వాసకోశ సంరక్షణకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ థెరపీ, కార్డియాక్ కేర్ మందులు, ఆర్థోపెడిక్ చికిత్సలు, పోషకాహార మద్ధతునిస్తారు.
యుక్తవయసు దాటలేరు..
ఎన్ని చికిత్సలు చేసినా.. వారి ప్రాణాలను కాపాడగలిగే చికిత్స ఇప్పటికీ అందుబాటులో లేదు. అందుకే ఈ రుగ్మత వచ్చిన వారు 20 ఏళ్లు మించి బతకరు. ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే 30 ఏళ్లు ఉంటారు కానీ మంచం మీదనే ఉండాల్సి వస్తాది. ఆయుర్దాయం అంతకు మించి ఉండదు.
నివారణ చర్యలు
ఈ రుగ్మతకు చికిత్స లేదు కానీ దీనిని నివారించే స్కోప్ ఉంది. గర్భం దాల్చిన 3వ నెలలో ప్రీ నేటల్ టెస్ట్ ఉంటుంది. దాని ధర మూడువేలు ఉండొచ్చు. ఈ టెస్ట్ ద్వారా పిండానికి DMD ఉన్నట్లు గుర్తిస్తే.. అప్పుడే ప్రెగ్నెన్సీని తీయించుకోవచ్చు. కాబట్టి ఈ విషయంపై అవగాహన కలిగి ఉండి.. ప్రతి మహిళ తమ ప్రెగ్నెన్సీ సమయంలో ఈ టెస్ట్ చేయించుకుంటే దీనిని ముందుగానే నివారించగలుగుతాము.
Also Read : ఇండియాకు వచ్చేసిన Mpox.. అశ్రద్ధగా ఉంటే వైరస్ వ్యాప్తి తప్పదు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే