TB Deaths : క్షయవ్యాధి(Tuberculosis) ప్రాణాంతక దశలు, లక్షణాలు, చికిత్స.. నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే
TB Risks : టీబీ(Tuberculosis) ఇప్పటికీ ప్రమాదకరమైన వ్యాధిగానే ఉంది. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ దశలో బతకడం కష్టమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Tuberculosis Stages and Complications : దాదాపు మూడు సంవత్సరాల పాటు COVID-19 ప్రపంచంలో ఏకైక ఇన్ఫెక్షన్ వ్యాధి కారణంగా సంభవించే మరణాలకు ప్రధాన కారణంగా ఉంది. 2020 నుంచి 2023 మధ్య.. ఈ వైరస్ వల్ల దాదాపు 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ 2023లో ఈ భయంకరమైన రికార్డు మళ్లీ క్షయవ్యాధికి వచ్చింది. WHO ప్రకారం.. నేటికీ ప్రతిరోజూ దాదాపు 3,400 మంది క్షయవ్యాధితో మరణిస్తున్నారు. దాదాపు 30,000 మంది కొత్త రోగులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే క్షయవ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేయడం ద్వారా నివారించవచ్చు. పూర్తిగా నయం చేయవచ్చని చెప్తున్నారు నిపుణులు.
క్షయవ్యాధి వ్యాప్తి ఎలా ఉంటుందంటే
క్షయవ్యాధి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా ఉంది. ముఖ్యంగా పేదరికం, పోషకాహార లోపం, పేలవమైన జీవనశైలి వంటి సామాజిక సవాళ్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో క్షయవ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ (Mycobacterium tuberculosis) అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటు వ్యాధి. ఈ వ్యాధి అంత సులభంగా వ్యాపించదు. ఈ బ్యాక్టీరియా సోకిన ప్రతి 100 మందిలో 5 నుంచి 10 మందిలో మాత్రమే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయట. మిగిలినవారికి సైలెంట్గా వ్యాధి అభివృద్ధి చెందుతుంది. అయినప్పటికీ.. ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది ఎప్పుడో ఒకప్పుడు క్షయవ్యాధి బ్యాక్టీరియా బారిన పడ్డారని అంచనా.
Assist360 ప్రకారం.. క్షయవ్యాధి అతిపెద్ద సమస్య. ఇది వివిధ స్థాయిల్లో ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. దీని లక్షణాలు ఇతర ఇన్ఫెక్షన్ల వలె కనిపిస్తాయి. కానీ గుర్తించడానికి సమయం పడుతుంది. చికిత్సకు చాలా కాలం పడుతుంది. దీనిలో 6 నుంచి 9 నెలల వరకు యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. క్షయ వ్యాధిలో మూడు దశలు ఉంటాయి. మరి ఏ దశలో ఈ వ్యాధి ప్రాణాంతకమవుతుందో ఇప్పుడు చూసేద్దాం.
ఎక్స్పోజర్
ఇది ప్రారంభ దశ. క్షయవ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధక వ్యవస్థను చాలా వరకు నిరోధిస్తుంది. కానీ కొన్ని సూక్ష్మ బ్యాక్టీరియా మిగిలిపోతాయి. తరువాత సుప్త సంక్రమణ (లేటెంట్ టీబీ)గా మారవచ్చు.
లేటెంట్ టీబీ
ఈ దశలో క్షయవ్యాధి శరీరంలో ఉంటుంది. కానీ చురుకుగా ఉండదు. లక్షణాలు కనిపించవు. కానీ బ్యాక్టీరియా భవిష్యత్తులో చురుకుగా మారవచ్చు. అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
యాక్టివ్ టీబీ
ఈ దశలో క్షయవ్యాధి క్రిములు శరీరంలో పెరగడం ప్రారంభిస్తాయి. లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ దశ అంటువ్యాధిగా మారుతుంది. దగ్గు లేదా తుమ్ముల ద్వారా గాలిలో వ్యాపించే చిన్న కణాల ద్వారా ఇతరులకు చేరుతుంది. చికిత్స తీసుకోకపోతే.. ఇది తీవ్రమైన సమస్యలకు, మరణానికి కూడా దారి తీస్తుంది.
క్షయవ్యాధి సాధారణ లక్షణాలు
- నిరంతర దగ్గు
- ఛాతీ నొప్పి
- బలహీనత
- అలసట
- బరువు తగ్గడం
- జ్వరం
- రాత్రి చెమటలు
క్షయవ్యాధి శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుందనే దానిపై కూడా లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ఊపిరితిత్తులలో క్షయవ్యాధి సర్వసాధారణం. కానీ ఇది కాలేయం, మెదడు, వెన్నుముక, చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
క్షయవ్యాధికి చికిత్స
క్షయవ్యాధికి ప్రామాణిక చికిత్స 6 నెలల పాటు యాంటీబయాటిక్స్ కోర్సు. చికిత్స తీసుకోకపోతే క్షయవ్యాధితో మరణించే ప్రమాదం దాదాపు 50 శాతం వరకు ఉంటుంది. అయితే సరైన, పూర్తి చికిత్స తీసుకుంటే దాదాపు 85 శాతం మంది రోగులు పూర్తిగా నయం అవుతారు. బ్యాక్టీరియా మందులకు స్పందించకపోతే.. దీనిని డ్రగ్-రెసిస్టెంట్ టీబీ అంటారు. దీని చికిత్స కష్టం. ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ మందులు వాడాలి.
MDR-TB (మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ టీబీ) దాదాపు 11 నుంచి 12 శాతం కేసులలో కనిపిస్తుంది. దాని సక్సెస్ రేటు సాధారణ క్షయవ్యాధి కంటే చాలా తక్కువగా ఉంటుంది. రోగులు చికిత్స మధ్యలో ఆపివేసినప్పుడు లేదా తప్పుగా మందులు వాడినప్పుడు MDR-TB తరచుగా వ్యాపిస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలలో ఇది ఇతరులకు కూడా వ్యాపిస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా గుర్తిస్తే ఎలాంటి ప్రాణహాని ఉండదని చెప్తున్నారు నిపుణులు.






















