Cyber Truck in Amalapuram: అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ - గోదావరి జిల్లాల వాళ్లతో మామూలుగా ఉండదు మరి !
Amalapuram: అమలాపురం అల్లుడు ఆదిత్యరామ్ సైబర్ ట్రక్‌తో సందడి చేశారు. ఆయన కారును చూసేందుకు జనం ఎగబడ్డారు.

Aditya Ram made splash with his cyber truck in Amalapuram: సంక్రాంతి పండుగ వేళ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో సరికొత్త సందడి నెలకొంది. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, అమలాపురం అల్లుడు గా సుపరిచితులైన ఆదిత్య రామ్ తన అత్తగారింటికి ఈసారి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెస్లా సైబర్ ట్రక్ (Tesla Cybertruck) లో వచ్చారు. దీంతో స్థానికులు ఆ కారును చూసేందుకు భారీగా తరలివచ్చారు. గతేడాది రోల్స్ రాయిస్ కారులో వచ్చి సందడి చేసిన ఆయన, ఈ ఏడాది అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ ట్రక్కుతో రావడం పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.
చెన్నై కేంద్రంగా పనిచేసే ఆదిత్య రామ్ గ్రూప్ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఆదిత్య రామ్, రియల్ ఎస్టేట్, సినిమా నిర్మాణ రంగాల్లో దిగ్గజంగా పేరుపొందారు. తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురంలో పుట్టిన ఆయన, అతి సామాన్య కుటుంబం నుంచి స్వయంకృషితో బిలియనీర్‌గా ఎదిగారు. ఆయనకు కార్లంటే ప్రాణం. చెన్నైలోని ఆదిత్య రామ్ ప్యాలెస్ లో ఆయన వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్, మేబ్యాక్, పోర్షే, జగ్వార్ వంటి ప్రపంచ స్థాయి విలాసవంతమైన కార్ల సేకరణ ఉంది. కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా, తన అభిరుచులను ఉన్నతంగా చాటుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.
టెస్లా సైబర్ ట్రక్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన , దృఢమైన వాహనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని బాడీ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారై బుల్లెట్ ప్రూఫ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారును విదేశాల నుంచి నేరుగా ఇండియాకు దిగుమతి చేసుకోవడం అంత సులభం కాదు. అమెరికాలో దీని ధర వేరియంట్‌ను బట్టి సుమారుగా 80 వేల నుంచి ఒక లక్ష డాలర్ల వరకు అంటే సుమారు 65 లక్షల నుంచి 85 లక్షలు ఉంటుంది. అయితే, దీనిని ఇండియాకు తీసుకురావాలంటే 100% నుంచి 110% వరకు దిగుమతి సుంకం , జీఎస్టీ , ఇతర పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ కారు ఇండియాలో రోడ్డెక్కాలంటే సుమారు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.
ప్రతి ఏటా సంక్రాంతికి తన మూలాలను మర్చిపోకుండా అమలాపురం వచ్చి, ఇలాంటి వినూత్న వాహనాలతో సందడి చేయడం ఆదిత్య రామ్‌కు ఒక ఆనవాయితీగా మారింది. పండుగ సరదాతో పాటు ప్రపంచ స్థాయి టెక్నాలజీని తన సొంత ఊరి ప్రజలకు పరిచయం చేయాలనే ఆయన ఉత్సాహాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా, తన అభిరుచులతో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఆదిత్య రామ్, కోనసీమ సంక్రాంతికి ఈసారి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.





















