బాస్‌తో భద్రం గురూ - డయాబెటిస్, గుండె సమస్యలకు వారే కారణమట! ఎలాగంటే..
టాక్సిక్ వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు నాయకత్వానికి పనికి రారని, వారి వల్ల సిబ్బంది కూడా ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. మరి మీ బాసులో ఇలాంటి లక్షణాలున్నాయా?
చాలా మంది బాస్ శాడిజం గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇలా టాక్సిక్ గా ఉండటానికి కారణం వారిలో నాయకత్వ లక్షణాల లోపమే అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ టాక్సిసిటి తమతో పనిచేసే వారి ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపుతోందని కొత్త అధ్యయనాలు రుజువులు చూపుతున్నాయి. పని ప్రదేశాల్లో బాసులు కలిగించే నిరంతర ఒత్తిడి వల్ల గుండె సమస్యలు, డయాబెటిస్, ఆస్తమా, ఆంక్జైటీ, ప్రిమెచ్యూర్ ఏజింగ్ నుంచి క్యాన్సర్ వరకు అనేక రకాల జబ్బులకు పరోక్షకారనం అవుతోందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఐదింట మూడు వంతుల మంది ఉద్యోగులు తమ ఉద్యోగంలో పైఅధికారుల వైఖరి వల్ల ఒత్తిడికి లోనవుతున్నారని, ఇది వారి ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని చూపుతోందని వెల్ బీయింగ్ ఎక్స్పర్ట్ సిమోన్ ఎల్.డోలన్ పేర్కొన్నారు. ఆయన తన పుస్తకం De-Stress At Work - Understanding and Combatting Chronic Stress2లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో టాక్సిక్ లీడర్స్ ప్రభావం ఎంత వినాశకరమో వివరించారు.
మా బాస్ టాక్సిక్?
ప్రొఫెసర్ డోలన్ కొన్ని లక్షణాలను ప్రస్తావించి ఇలాంటి లక్షణాలు కలిగిన నాయకులు వారి బృందానికి ఎలా హానికరమో వివరించారు.
- టీమ్ సక్సెస్ ఫుల్ గా కనిపిస్తే ఈర్ష్య పడేవాడు.
- ఎప్పుడూ పోటీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఎదుటి వారిని శతృవులుగా చూస్తూ నిరంతరం ఆందోళనలో ఉండేవాడు.
- తరచుగా ఇతరుల పనికి సంబంధించిన క్రెడిట్ తానే తీసుకోవాలని అనుకుంటాడు.
- అస్తమానం తనని ఇతరులతో పోల్చి చూసుకునే వాడు.
- తాజాగా వచ్చిన ఫలితాలు మాత్రమే వారి విలువను పెంచుతాయని నమ్ముతాడు.
- ఈగోను తృప్తి పరచుకునేందుకు, తెలిసి లేదా తెలియకుండానే అధికార దుర్వినియోగం చేస్తాడు.
- బ్యాడ్ బాసులు తన టీమ్ మెంబర్స్ ను మాత్రమే కాదు.. తమని తాము బాధించుకోవడానికి కూడా వెనుకాడరు.
అత్యధిక అధికారం కలిగిన స్టీరియోటైప్ బాసులు చాలా హానికరమని ప్రొఫెసర్ డోలన్ పేర్కొన్నారు. జీవితంలో వారు ఎదుర్కొన్న పరిస్థితులు, వారి గత అనుభవాలు వారిని టాక్సిక్‌గా మార్చి ఉండొచ్చు. వారి టాక్సిసిటి వెనుక రకరకాల కారకాలు ఉంటాయి.
ప్రొఫెసర్ డోలన్ చెప్పిన దాన్ని బట్టి వారిలో ఆత్మవిశ్వాసం తగినంత లేకపోవడం వల్ల వారి విలువను ఇతరులకు చూపించాలనే తాపత్రయం వీరిని మరింత టాక్సిక్ గా మారుస్తుందట. అధికారంలో ఉన్న వారు ఒత్తిడిని ఎంత బాగా మేనేజ్ చెయ్యగలుగుతారనే దాని మీదే పని చేసే చోట వాతావరణం ఆరోగ్యకరంగా ఉండేదాని మీద ఆధారపడి ఉంటుంది.
మన జీవితం మన అదుపులో ఉందన్న భావన ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అలాంటి పరిస్థితి లేనపుడు ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు వివరణ ఇస్తున్నారు. ఇది పూర్తిగా ఎమోషనల్ ఇంటలిజెన్స్ కు సంబంధించిన విషయం. ఇలాంటి పరిస్థితిలో నిరంతర ఒత్తిడి అనారోగ్యాలకు కారణమై ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి.
మొదట్లో కొంత మందిలో తగినంత ఆత్మవిశ్వాసం లేకపోయినా అంతర్గత అవగాహనా స్థాయిని మార్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. తద్వారా బాసులు కూడా తమ సొంత బలహీనతలు, బలాలను అంచనా వేసుకుని వాస్తవికంగా ఉండడం, ప్రతి క్షణం నేర్చుకునేందుకు సిద్ధగం ఉండాలని తెలుసుకుంటారు. కాన్ఫిడెన్స్ కు ఓవర్ కాన్ఫిడెన్స్ కు మధ్య ఉండే తేడాను బాస్ లు గుర్తించాలని ప్రొఫెసర్ డోలన్ అంటారు.
గొప్ప నాయకుడిగా ఎదగాలంటే కేవలం ఆత్మవిశ్వాసం ఉంటే సరిపోదు గౌరవప్రదంగా, సపోర్టివ్ గా, అందరి ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఉండాలని ప్రొఫెసర్ సలహా ఇస్తున్నారు. మరి, మీ బాసులు ఎలా ఉంటారు? ఒక వేళ పై లక్షణాల్లో ఒక్క లక్షణం కలిసినా.. వారు మీ కెరీర్‌కు హానికరమే.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.