పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలకు కారణం పెద్దలేనట - ఫోన్ స్క్రీన్స్‌తో ప్రాణహాని
విపరీతమైన స్క్రీన్ వినయోగం మాత్రం పిల్లల జీవితాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి.
మీ పిల్లలు మారం చేస్తున్నారనో, అన్నం తినడం లేదనో.. ఇంటి పనులకు ఆటంకం కలిగిస్తున్నారనో.. ఫోన్లు చేతికి ఇస్తున్నారా? లేదా టీవీ, ల్యాప్‌టాప్‌లలో కార్టూన్స్ తదితర వీడియోలు చూపిస్తున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. లేకపోతే.. మీ పిల్లల భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
అత్యంత వేగంగా కమ్యునికేషన్, టెక్నాలజి రంగంలో వస్తున్న మార్పులతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇప్పుడు మొబైళ్లు (స్క్రీన్స్) వినియోగిస్తున్న వారే. రోజురోజుకు స్క్రీన్ల వినియోగం చాలా విప్లవాత్మకంగా పెరిగిపోతోంది. అయితే ఇది ఎంత విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తుందో.. అంతే నష్టాన్ని కూడా కలిగిస్తుంది. విపరీతంగా స్క్రీన్ ను ఉపయోగించడం వల్ల మానసిక, శారీరక అనారోగ్యాలకు గురవ్వుతారని నిపుణులు చెబుతున్నారు.
ఈ శతాబ్దపు అత్యంత ప్రభావశీల ఆవిష్కరణగా ఫోన్ గురించి చెప్పుకోవచ్చు. లాండ్ లైన్ నుంచి నేటి స్మార్ట్ ఫోన్ వరకు ఎన్నోమార్పులు చేసుకొని ఇప్పుడు అరచేతిలో పట్టే బుల్లపెట్టెలా ఫోన్ మారిపోయింది. దాని తర్వాతి స్థానం ఇంటర్నెట్ అనే చెప్పుకోవాలి. ఫోను, ఇంటర్నెట్ వేర్వేరు కావేమో అనేంతగా పెనవేసుకున్న రెండు టెక్నాలజీల సమ్మేళనం.. ఇప్పుడు దునియాను ఏలేస్తోంది. ప్రతి చిన్న విషయానికి అందరం ఇంటర్నెట్ మీదే ఆధారపడుతున్నాం. ఈ కాలంలో పిల్లలు ఏదో ఒకరకంగా స్క్రీన్ వినియోగిస్తూనే ఉన్నారు. చదువు నుంచి వినోదం వరకు అన్నీ స్క్రీన్ ద్వారానే కావడం మూలాన స్క్రీన్ వినియోగం ఈ రెండు మూడేళ్లలో చాలా పెరిగిపోయింది. ఇది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఎప్పుడూ ఎరగని ఒక ఒత్తిడిని నేటి బాల్యం ఎదుర్కొంటోంది. వారిని స్క్రీన్ కు పూర్తిగా దూరం పెట్టడం నేటి కాలంలో సాధ్యం కాకపోవచ్చు.
డిప్రెషన్, స్ట్రెస్, ఆత్మహత్య ఆలోచనలను ప్రేరేపిస్తున్న ‘స్క్రీన్స్’
ఈ మధ్య కాలంలో ఎక్కువ సమయం పాటు స్క్రీన్స్ వినియోగించే పిల్లలకు ఆత్మహత్యా ఆలోచనలు పెరుగుతున్నాయని ఒక అధ్యయనం చెబుతోంది. తొమ్మిది నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు స్క్రీన్ మీద గడిపిన ప్రతి అదనపు గంట సమయం భవిష్యత్తులో వారి మానసిక స్థితిని, జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుందట.
యూఎస్ లో నిర్వహించిన బ్రెయిన్ డెవలప్మెంట్ కి సంబంధించిన దీర్ఘ కాలిక అధ్యయనం వివరాలు ఇటీవల వెల్లడించారు. దీనికి నేతృత్వం వహించిన డాక్టర్ జాసన్ నాగట సోషలైజింగ్ యాక్టివిటీ అండ్ స్లీప్ గురించి వివరించారు.
స్క్రీన్ ఎక్కువ కాలం పాటు వాడే పిల్లలు సోషల్ ఐసోలేషన్, సైబర్ బుల్లియింగ్, నిద్ర సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారట. ఇది వారి మానసిక ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావాన్ని చూపుతుందని ఆయన తెలిపారు. తరచుగా పిల్లలతో స్క్రీన్ వినియోగం, స్క్రీన్ టైమింగ్, రోల్ మోడల్ స్క్రీన్ గురించి మాట్లాడుతూ ఉండడం అవసరం. కేవలం ఫోన్ లేదా లాప్ టాప్, ఇతర స్క్రీన్ల మీద నుంచి వారి దృష్టి మళ్లించాలి. అవుట్ డోర్, ఇన్డోర్ గేమ్స్ వంటివి అలవాటు చెయ్యాలి. స్క్రీన్ కాకుండా ఇతర వ్యాపకాల గురించి తరచుగా మాట్లాడటం, గార్డెనింగ్, బయట కాసేపు వాకింగ్, లేదా జాగింగ్ వంటివి అలవాటు చెయ్యాలి. యోగా, మెడిటేషన్ కూడా వారి స్క్రీన్ స్మార్ట్ నెస్ పెంచడంలో దోహదం చెయ్యవచ్చు. పిల్లలు ఎక్కువ సమయం పాటు స్క్రీన్ మీద మాత్రమే సమయం గడపకుండా జాగ్రత్త పడడం తల్లిదండ్రుల బాధ్యతగా గుర్తించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Also Read: పెరుగు ఎప్పుడు తినాలో, ఎలా తినాలో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.