Frozen Food: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాలు ఇలా మారుతున్నాయా? వాటిని అస్సలు తినొద్దు, వాడొద్దు!
ఫ్రిజ్ లో ఉంచిన పదార్థాలు రంగు, వాసన మారిపోతే వాటిని ఉపయోగించకపోవడం ఉత్తమం. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవడానికి ఫ్రీజర్ చాలా ఉపయోగపడుతుంది. మాంసం, రొట్టె ఇలా ఎలాంటి పదార్థం అయినా ఫ్రీజర్ లో ఘనీభవించేలా చేసుకోవచ్చు. ఫ్రీజర్ ఆహారాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. కానీ, అన్నిసార్లు కాదు. కొన్ని సార్లు అందులో పెట్టిన ఆహారం చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కొన్ని ఆహారాలు డబ్బాల్లో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు ఉంటాయి. మరికొన్ని క్లోజ్ చేసే ప్లాస్టిక్ కవర్స్ ఉంచుకోవచ్చు. కానీ ఇటువంటి బ్యాగ్స్ లో కంటే డబ్బాలో ఉంచుకోవడమే ఉత్తమం.
ప్యాకేజ్ బ్యాగ్ లో నీటి బిందువులు
కూరగాయలు కొన్ని సార్లు ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో నిల్వ ఉంచితే.. వాటి సంచుల్లో నీటి బిందువులు కనిపిస్తాయి. ఒక్కోసారి ఆ నీటి బిందువుల వల్ల కూరగాయలు పూర్తిగా తడిచిపోయినట్లు కనిపిస్తాయి. వాటితో ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఉండదు. కానీ, అవి ఖచ్చితంగా రుచిగా మాత్రం ఉండవు. ఆహారం చాలా తేమని కోల్పోతుంది. ఇది రుచి, ఆకృతి రెండింటి మీద ప్రతికూల ప్రభావాలని చూపిస్తుంది.
పదార్థాల రంగులో మార్పు
ఇది ఎక్కువగా మాంసంకి వర్తిస్తుంది. ఉదాహరణకి మాంసం ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత ఎరుపు రంగుకు బదులుగా కొద్దిగా బూడిద రంగులోకి మారినట్టు కనిపిస్తుంది. అలా ఉంటే దాన్ని ఖచ్చితంగా డస్ట్ బిన్ లోకి వేసేయాల్సిందే. ఎందుకంటే రంగు మారడం అనేది గడువు తేదీ దాటింది అనేందుకు సంకేతం. కూరగాయలు అయినా కూడా వాటి తాజా రంగుని కోల్పోతే.. వాటిని తినకపోవడమే మంచిది.
మాంసం కరిగినట్లుగా ఉండటం
చాలా మంది మార్కెట్లో మాంసం కొనుగోలు చేసి.. ప్యాకింగ్స్ అలాగే ఫ్రిజ్ లో పెట్టుకుంటారు. అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చని అనుకుంటారు. కానీ పింక్ కలర్ లో ఉండే మాంసం ముక్కలు కాస్త మెత్తగా అయిపోయినట్లుగా ఉంటే.. తినకపోవడమే మంచిది. ఫ్రీజర్ ఉష్ణోగ్రత సరిగా లేకపోవడం వల్ల మాంసం కరిగిపోయి, మళ్ళీ ఘనీభవించిందని అర్థం చేసుకోవాలి. అలాంటి దాన్ని వెంటనే పారేయాలి.
వాసన
ఘనీభవించిన ఆహారం కూలింగ్ పోయిన తర్వాత చెడు వాసన వస్తే అది చెడిపోయిందని అర్థం చేసుకోవాలి. రంగు కూడా మారుతుంది. అటువంటి సమయంలో ఏమి ఆలోచించకుండా దాన్ని బయట పడేయడం చాలా ముఖ్యం. అందుకే మాంసం వంటి వాటిని తాజాగా ఉన్నప్పుడే కొనుగోలు చేసుకుని వండుకుని తినాలి. సూపర్ మార్కెట్లో దొరికే మాంసం, చేపల ఉత్పత్తులకి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే మంచిది. అవి చెడిపోకుండా ఉండటం కోసం వాటిని ఘనీభవించేలా చేస్తారు. కానీ వాటిలోని బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: చలికాలంలో కీరదోస తినొచ్చా? ఆయుర్వేదం నిపుణులు ఏం చెప్తున్నారు