Hair Care Tips: వర్షాకాలంలో చుండ్రు వేధిస్తుందా? ఈ టిప్స్ పాటించారంటే సులభంగా తగ్గిపోతుంది
చర్మ సంరక్షణ ఎంత ముఖ్యమో జుట్టుకి పట్ల కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే వర్షాకాలంలో జుట్టు నాశనం అయిపోతుంది.
వానాకాలంలో జుట్టు సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తాయి. వాటిలో ఒకటి చుండ్రు. దీని వల్ల చికాకుగా అనిపిస్తుంది. తల దురద పెట్టడం వల్ల నలుగురిలో ఉన్నప్పుడు చేతులు ఇక తల మీదే ఉంటాయి. తేమ వాతావరణంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి బయట పడేందుకు ఈ చిట్కాలు చక్కగా ఉపయోగపడతాయి.
వెంట్రుకలు శుభ్రంగా ఉంచాలి: జుట్టు నుంచి వచ్చే అదనపు నూనె, ధూళి, దుమ్ము తొలగించుకోవడానికి తేలికపాటి షాంపూతో జుట్టుని క్రమం తప్పకుండా కడగాలి. సహజ నూనెలు తొలగించే షాంపూ ఉపయోగించకూడదు. ఇది సమస్యని మరింత తీవ్రతరం చేస్తుంది.
యాంటీ డాండ్రఫ్ షాంపూ: చుండ్రుని వదిలించుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించి షాంపూలు వినియోగించాలి. అవి తరచుగా జింక్ పైరిథియాన్, కెటోకానజోల్, సెలీనియం సల్ఫేట్ వంటి పదార్థాలని కలిగి ఉంటాయి. ఈఫి ప్లేకింగ్, దురదని తగ్గించడంలో సహాయపడతాయి.
స్కాల్ఫ్ మసాజ్: షాంపూతో తలస్నానం చేయడానికి ముందు స్కాల్ఫ్ ని చేతి వేలికొనలతో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చుండ్రు ప్రభావాన్ని తగ్గించడంలో సాయం చేస్తుంది.
వేడి నీళ్ళు వద్దు: జుట్టుని శుభ్రం చేసుకునే సమయంలో వేడి నీటికి బదులుగా గోరు వెచ్చని లేదంటే చల్లని నీటిని ఉపయోగించాలి. వేడి నీరు తల మీద తేమని తొలగిస్తుంది. పొడిగా మారి పొరలు పొరలుగా పొట్టు ఊడిపోతుంది. అందుకే తప్పనిసరిగా గోరు వెచ్చని నీరు వాడాలి.
పరిశుభ్రత ముఖ్యం: మురికి, నూనె పేరుకుపోకుండా హెయిర్ బ్రష్, దువ్వెనలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. జుట్టుకు ఉపయోగించే ఉపకరణాలు శుభ్రంగా లేకపోతే అందులోని దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా తలలోకి చేరి చుండ్రు సమస్యని మరింత తీవ్రతరం చేస్తుంది. శుభ్రం లేనివి ఉపయోగించడం వల్ల చుండ్రు వ్యాప్తి అధికమవుతుంది.
స్కాల్ఫ్ గీకవద్దు: చుండ్రు ఉంటే దురదగా అనిపిస్తుంది. దీంతో ప్రతిసారీ గోళ్ళు వేసి స్కాల్ఫ్ గీకుతారు. ఇది చుండ్రుని మరింత తీవ్రమయ్యేలా చేస్తుంది. ఫ్లేక్ ని సున్నితంగా తొలగించడానికి మృదువుగా ఉండే బ్రిస్టల్ బ్రష్ ని ఉపయోగించాలి.
ఒత్తిడి అదుపులో: ఒత్తిడి చుండ్రుని పెంచుతుంది. అందుకే ముందుగా దాన్ని అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి. యోగా మంచిది. ఒత్తిడిని ఎదుర్కొనే పద్ధతుల మీద దృష్టి సారించాలి.
సహజ నివారణలు: కొన్ని సహజ నివారణలు చుండ్రుని తగ్గించడంలో సహాయపడతాయి. నిమ్మరసం, కొబ్బరి నూనె మిశ్రమాన్ని షాంపూ చేయడానికి ముందు తలకు బాగా పట్టించాలి. క్యారియర్ ఆయిల్ తో కరిగించిన టీ ట్రీ ఆయిల్ యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవి చుండ్రుని ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన ఆహారం: విటమిన్లు, ఖనిజాలతో కూడిన సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన జుట్టుకి దోహద పడుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు వంటి ఆహారాలు భోజనంలో చేర్చుకోవాలి.
ఇంటి చిట్కాలు ప్రయత్నించినప్పటికీ చుండ్రు సమస్య అదుపులోకి రాకపోతే చర్మ సంబంధిత నిపుణుల్ని సంప్రదించడం మేలు. వారి సూచనల మేరకు తగిన చికిత్స అందిస్తారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: వర్షాకాలంలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలివే - ఇలా చేస్తేనే మీరు సేఫ్!