(Source: ECI/ABP News/ABP Majha)
Weight Loss: నోరూరించే ఈ జ్యూస్‌లు బరువు కూడా తగ్గిస్తాయ్!
జ్యూస్‌లు తాగితే బరువు పెరుగుతారనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ జ్యూస్‌లు తాగారంటే మాత్రం బరువు తగ్గుతారు.
ఎక్కువ సేపు కూర్చుని పని చెయ్యడం వల్ల చాలా మంది అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారు. శరీరంలో వచ్చిన భారీ మార్పులు తగ్గించుకునేందుకు నోరు కట్టేసుకుంటున్నారు. కఠినమైన ఆహార నియమాలు పాటించలేక సగంలోనే బరువు తగ్గాలనే లక్ష్యం పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా సింపుల్ గా కూడా బరువు తగ్గొచ్చు. ఈ పండ్లు, కూరగాయల జ్యూస్ తీసుకుంటే మీకు తీపి తినాలన్నా కోరిక తీరుతుంది. బరువు తగ్గుతారు. ఈ జ్యూస్ ల్లో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల శరీరం డిటాక్స్ ఫై చేస్తుంది. ఆకలిగా అనిపించినప్పుడు వాటిని తీసుకుంటే పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. రుచికరంగా కూడా ఉంటాయి.
ఆరెంజ్ జ్యూస్
రోగనిరోధక శక్తి పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఫైబర్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి ఇది మంచి ఎంపిక. నారింజలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. తియ్యటి రుచితో బాగుంటుంది.
క్యారెట్ జ్యూస్
పోషక విలువల పరంగా అనేక ప్రయోజనాలు అందించే కూరగాయ క్యారెట్. విటమిన్ ఏ, సి, కె, ఫైబర్, పొటాషియం, ఫోలేట్ తో పాటు అనేక ఖనిజాలు అందిస్తుంది. క్యారెట్ జ్యూస్ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలని కూడా తగ్గిస్తుంది.
పుచ్చకాయ రసం
పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. దీన్ని తీసుకుంటే కడుపులో తేలికగా ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. సహజమైన తీపి రుచి కలిగి ఉండటం వల్ల తాగేందుకు కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన పుచ్చకాయ జ్యూస్ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే బరువు కూడా అదుపులో ఉంటుంది.
సొరకాయ రసం
నీటి శాతం ఎక్కువగా ఉండే సొరకాయ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సొరకాయ హృద్రోగులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీవక్రియ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. అయితే చేదు రుచిగా ఉండే సొరకాయ మాత్రం తీసుకోకూడదు. చేదుగా ఉన్న సొరకాయలో విషపూరిత సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉండి. సొరకాయ రసం రుచిగా ఉండేందుకు అందులో దోసకాయ, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు.
క్రాన్బెరీ జ్యూస్
ఎంతో రుచి కలిగిన క్రాన్బెర్రీ పండ్లతో చేసే ఈ జ్యూస్ లో ప్రోయాంతో సైనిడిన్స్ నిండి ఉన్నాయి. ఇది యూరనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లని నివారించడంలో సహాయపడుతుంది. పిరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరి, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ జ్యూస్ తీసుకుంటే చక్కగా పని చేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.