ఈ కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచే పవర్ ఫుల్ డికాషన్ ఇదే, ఇలా తయారు చేయండి
ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు రోగనిరోధక శక్తి చాలా అవసరం. అందుకోసం ఇంట్లో దొరికే వాటితోనే చక్కగా ఈ డికాషన్ పెట్టుకుని తాగొచ్చు.
కరోనా మహమ్మారి మరోసారి విజృంభించేందుకు సిధ్దమైంది. కొత్త వేరియంట్ తో విరుచుకుపడుతూ ప్రపంచ దేశాలని గడగడలాడిస్తోంది. దాన్ని ఎదుర్కోవాలంటే బలమైన రోగనిరోధక శక్తి అవసరం. ఇదే కాదు, కాలానుగుణ మార్పుల వల్ల వచ్చే వ్యాధులు జలుబు, దగ్గుని ఎదుర్కోవాలి. ఒక్కోసారి అది ఊపిరితిత్తులకి వ్యాపించి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత వరకు రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఊపిరితిత్తుల ఆరోగ్యం, శరీరంలోని పేరుకుపోయేటువంటి కఫం, శ్లేష్మం పోగొట్టుకునేందుకు ఇంట్లో సింపుల్ గా తయారు చేసుకునే ఈ మిశ్రమం తాగారంటే ఎంతో ప్రయోజనాలు అందిస్తుంది. అందుకోసం పోషకాహార నిపుణులు ఉల్లిపాయ, పసుపు, నల్లమిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మిశ్రమాన్ని సూచిస్తున్నారు.
ఈ డికాషన్ కి కావలసిన పదార్థాలు
తరిగిన ఉల్లిపాయ- 1 టేబుల్ స్పూన్
బెల్లం- 1 టేబుల్ స్పూన్
పసుపు- ¼ టీస్పూన్
నల్ల మిరియాల పొడి చిటికెడు
కొద్దిగా నీళ్ళు తీసుకుని వాటిలో ఈ మిశ్రమాలు అన్నీ వేసుకుని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
ఇదే కాదు నిమ్మరసం, తేనె, దాల్చిన చెక్క, అల్లం లేదా పిప్పరమెంట్(పుదీనా) వేసుకుని కూడా టీ పెట్టుకుని తాగొచ్చు. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శ్వాసకోశ మార్గాల్లోని స్రావాలని తొలగించడానికి సహాయపడుతుంది. ఈ నివారణాలు జలుబు లేదా ఫ్లూ వల్ల వచ్చే కఫంతో కూడిన దగ్గుని తగ్గించగలవు.
ఈ డికాషన్ వల్ల ప్రయోజనాలు
☀ ఉల్లిపాయ రసం శక్తివంతమైన నివారణగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయతో చేసే డికాషన్ లో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది కఫాన్ని అదుపులో ఉంచి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక శ్లేష్మ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఇక బెల్లం కఫాన్ని తొలగించి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
☀ పసుపులోని కర్కుమిన్ శ్లేష్మ ఉత్పత్తిని ప్రేరేపించే ఇన్ఫెక్షన్ తో పోరాడటానికి సహాయపడుతుంది. నల్ల మిరియాలు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. సులభంగా శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది.
☀ ఈ పానీయం గొంతు చికాకుల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇది యాంటీ ఆక్సిడెంట్లని కలిగి ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గిస్తుంది.
☀ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం కోసం తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి ప్రారంభ దశలోనే ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్ డికాషన్లు తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.