Cough Syrup: దగ్గు మందులో ఈ హానికర రసాయనం? ఇది లేని దగ్గు సిరప్ ఎంచుకోండి
దగ్గు మందులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేస్తూనే ఉంది.
గత ఏడాది మనదేశంలో తయారైన ఒక దగ్గు మందు గాంబియా దేశంలో 66 మంది చిన్నారుల మరణాలకు కారణమైందని వార్తలు వచ్చాయి. ఆ దగ్గు సిరప్‌ను హర్యానాలోని ఒక ఫార్మాసిటికల్ కంపెనీ తయారు చేసింది. దాన్ని నిషేధిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అప్పటి నుంచి మన దేశంలో తయారైన దగ్గు, జలుబు సిరప్ లపై అనేక వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మన దేశం కూడా దగ్గు సిరప్ లలో ఫాల్కోడిన్ అనే రసాయనం ఉంటే, ఆ మందును వాడొద్దని హెచ్చరిస్తోంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసిన తర్వాత మన దేశ రెగ్యులేటరీ అథారిటీ ఈ హెచ్చరికను జారీ చేసింది.
ఫాల్కోడిన్ అనేది పొడి దగ్గును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మెదడులో ఉన్న ఒక ప్రాంతంలోని కణ చర్యను అణిచివేయడం ద్వారా పొడి దగ్గును తగ్గిస్తుంది ఫాల్కోడిన్. పొడి దగ్గుకు చికిత్స చేయడానికి ప్రపంచవ్యాప్తంగా విక్రయించే టాబ్లెట్లు, సిరప్‌లలో సాధారణంగా ఉండే పదార్థమే ఇది. అయితే దీనిని అతిగా వాడితే చాలా ప్రమాదకరం. ఆరేళ్ళ వయసు కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు, పెద్ద వారికి మాత్రమే ఈ దీనిని సిఫార్సు చేస్తారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని వాడకాన్ని నిషేధించింది. ఎందుకంటే ఫాల్కోడిన్ వాడడం వల్ల తీవ్రమైన ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అనాఫిలాక్సిస్ ప్రమాదాన్ని 300 రెట్లు పెంచుతుంది. మలబద్ధకం, మగతగా ఉండడం, జీర్ణాశయంతర సమస్యలు, వికారం, వాంతులు, శ్వాసకోశ సమస్యలను కూడా పెంచుతుంది.
ఆరేళ్ల లోపు పిల్లలకు పూర్తిగా ఫాల్కోడిన్ ఉన్న దగ్గు సిరప్‌ను వేయకూడదు. వైద్యుల వద్దకు వెళుతున్నప్పుడు ఆరేళ్లలోపు పిల్లలకు ఫాల్కోడిన్ ఉన్న దగ్గు సిరప్‌లు వద్దని చెప్పండి. ఇప్పటికీ ఈ ఫాల్కోడిన్ కలిగిన మందులు మార్కెట్లో లభిస్తున్నాయి. దీనికి కారణం భారత ప్రభుత్వం ఈ మధ్యనే దీనిపై నిషేధం విధించింది. రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులు వాడకపోవడమే మంచిది. దగ్గు మందును ఇవ్వడం వల్ల పిల్లలు మగతగా నిద్రపోతారు. వారు జలుబు, దగ్గుతో పడుతున్న బాధ చూడలేక చాలా మంది తల్లిదండ్రులు దగ్గు సిరప్ ఇచ్చేస్తారు. నిజానికి ఇంట్లో కరక్కాయ రసం పట్టిస్తే చాలు వారం రోజుల్లో దగ్గు తగ్గిపోతుంది. ఇలాంటి మందులు వాడడం వల్ల కొంతమంది పిల్లల్లో తీవ్ర రియాక్షన్లు వస్తున్నాయి.
Also read: స్విమ్మింగ్ పూల్‌లో దిగుతున్నారా? జాగ్రత్త, మెదడు తినే అమీబాలు ఉంటాయి
Also read: వానాకాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే ఆయుర్వేదం చెబుతున్న ఈ రసాన్ని వండుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.