Brain Eating Amoeba: స్విమ్మింగ్ పూల్‌లో దిగుతున్నారా? జాగ్రత్త, మెదడు తినే అమీబాలు ఉంటాయి
స్విమ్మింగ్ పూల్‌లో కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఎన్నో ఉంటాయి.
![Brain Eating Amoeba: స్విమ్మింగ్ పూల్‌లో దిగుతున్నారా? జాగ్రత్త, మెదడు తినే అమీబాలు ఉంటాయి Getting into the swimming pool? Beware, there are brain-eating amoebas Brain Eating Amoeba: స్విమ్మింగ్ పూల్‌లో దిగుతున్నారా? జాగ్రత్త, మెదడు తినే అమీబాలు ఉంటాయి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/22/a8927ed256e4566c9dd64832c517cc241689990065949248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brain Eating Amoeba: అమెరికాలోని రెండేళ్ల బాలుడు ఏడు రోజులపాటు మెదడు తినే అమీబాతో ఇబ్బంది పడ్డాడు. అది అతడి ప్రాణాలనే తీసింది. ఇలాంటి మెదడు తినే అమీబాలను నేగ్లేరియా ఫౌలేరి అంటారు. ఇది సాధారణంగా కలుషితమైన చెరువులు, మంచినీటి సరస్సులు, నదులు, కలుషితమైన స్విమ్మింగ్ పూల్ వంటి వాటిలో ఉంటాయి. ఈ అమీబాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. కేవలం మైక్రోస్కోప్‌తో మాత్రమే ఇవి కనిపిస్తాయి.
అమీబాలాంటి సూక్ష్మ క్రిములు నీటితో పాటూ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈత కొట్టడం, డైవింగ్ చేయడం వంటి సమయాల్లో ఈ అమీబాలు ముక్కు నుంచి మెదడుకు చేరుతాయి. అక్కడ మెదడు కణజాలాన్ని నాశనం చేస్తాయి. దీనివల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ వస్తుంది. మెదడు తినే అమీబాలను 1965లో కనిపెట్టారు. ఇవి మంచినీటి వనరుల్లోనే ఉంటాయని చెబుతారు. శుద్ధి చేయని, కలుషితమైన నీటిలో ఇవి అధికంగా ఉంటాయి. కాబట్టి కలుషితమైన లేదా శుద్ధి చేయని స్విమ్మింగ్ పూల్స్ ఉంటే వాటిలో దిగకండి. ఇలాంటి అమీబాలు మెదడులో చేరి అరుదైన ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. చివరకు మెదడులోని కణజాలాన్ని తినేస్తాయి.
ఇవి మెదడులో చేరితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి వస్తుంది. మెడ గట్టిగా మారిపోతుంది. ఆకలి వేయదు. మూర్ఛలు వస్తూ పోతుంటాయి. జ్వరం పెరుగుతుంది. వికారంగా అనిపిస్తుంది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, అస్పష్టంగా దృష్టి కనిపించడం, రుచి తెలియకపోవడం కూడా జరగవచ్చు. ఇది ఒకసారి మెదడులో చేరితే ఆ వ్యక్తిని కాపాడుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి సమస్యలకు చికిత్సలు ఎలా చేయాలో ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి స్విమ్మింగ్ పూల్స్ కనిపించగానే దూకేయకండి. ఆ నీటిని ఎన్ని రోజుల నుంచి స్టోర్ చేశారో, ఎప్పుడు మార్చారో వంటి విషయాలు తెలుసుకోండి. లేకుంటే ఇలాంటి అమీబాలు మెదడులో చేరే అవకాశం ఉంది.
మనదేశంలో కూడా ఈ మెదడు తినే అమీబా కారణంగా ఒక టీనేజర్ మరణించాడు. కేరళలో వాగులో ఈతకొట్టిన పదిహేనేళ్ల బాలుడికి ఈ అమీబా సోకింది. అది శరీరంలో చేరిన కాసేపటికి ఆ పిల్లాడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లినా కూడా లాభం లేకపోయింది. అరుదైన మెదడు వ్యాధితో అతను మరణించినట్టు చెప్పారు వైద్యులు. మెదడు తినే అమీబా చాలా ప్రమాకరమైనది. దీని వల్ల మరణించే రేటు 97 శాతం. అంటే ఈ అమీబా సోకాక జీవించే అవకాశం కేవలం 3 శాతమేనన్న మాట.
Also read: వానాకాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే ఆయుర్వేదం చెబుతున్న ఈ రసాన్ని వండుకోండి
Also read: గేమింగ్ డిజార్డర్ ఉందా? అయితే జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది జాగ్రత్త