Ayurvedam Remedy: వానాకాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే ఆయుర్వేదం చెబుతున్న ఈ రసాన్ని వండుకోండి
వానాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు ఇట్టే దాడి చేస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయింది. దీంతో మన రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. వాతావరణం చల్లబడుతున్న కొద్ది మన జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. జలుబు, దగ్గు, కొన్ని రకాల అంటూ వ్యాధులు... వర్షాకాలంలో కచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వాతావరణంలో మార్పులు జరుగుతున్నప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేదంలో ఎన్నో రెమెడీలు ఉన్నాయి. వర్షాకాలంలో శరీరాన్ని కాపాడుకోవడం కోసం ‘కధా’ లేదా ‘కారా’ అనే పానీయాన్ని తయారు చేయమని చెబుతోంది ఆయుర్వేదం. దీన్ని తాగితే ఎలాంటి అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు, జలుబు వంటివి రాకుండా ఉంటాయని వివరిస్తోంది. ఈ మిశ్రమం రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తుంది. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. రుచి కూడా అదిరి పోతుంది.
కావాల్సిన పదార్థాలు
నీళ్లు - రెండు కప్పులు
అల్లం - చిన్న ముక్క
లవంగాలు - నాలుగు
నల్ల మిరియాలు - ఐదు
తులసి ఆకులు - ఐదు
తేనే - అర స్పూను
దాల్చిన చెక్క - చిన్న ముక్క
తయారీ ఇలా
స్టవ్ మీద కళాయి పెట్టి నీరు వేయాలి. ఆ నీటిని మరిగించాలి. ఈ లోపు అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు వంటి వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. నీరు మరిగిన తర్వాత ఆ నీటిలో తులసి ఆకులతో పాటు ఈ మిశ్రమాన్ని కూడా వేయాలి. 20 నిమిషాలు పాటు మరిగిస్తే కషాయం రెడీ అయినట్టే. దీన్ని గ్లాసులో వడకట్టి వెచ్చగా అయ్యేంతవరకు ఉంచాలి. అప్పుడు తేనెను కలపాలి. ఆయుర్వేదం చెప్పినా ‘కధా’ పానీయం రెడీ అయినట్టే.
ఈ పానీయంలో యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకే దగ్గు, జలుబుపై ప్రభావంతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే తులసి శరీరంలో శ్లేష్మం ఏర్పడకుండా తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సిద్ధం చేస్తుంది. ఇది క్రిమినాశక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. గొంతు నొప్పి, దురద వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ రసం దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం వంటి వాటికి చికిత్స చేయడమే కాదు, కిడ్నీలో రాళ్ల వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ రసాన్ని ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా తాగితే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
Also read: గేమింగ్ డిజార్డర్ ఉందా? అయితే జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది జాగ్రత్త
Also read: అధిక బరువుతో బాధపడుతున్నవారు థైరాయిడ్ క్యాన్సర్ బారిన సులువుగా పడతారా?