Obesity: అధిక బరువుతో బాధపడుతున్నవారు థైరాయిడ్ క్యాన్సర్ బారిన సులువుగా పడతారా?
అధిక బరువు ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణంగా మారుతుంది.
గత పదేళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం బారిన పడిన వారి సంఖ్య అధికంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 40 శాతం మంది పెద్దలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. వీరంతా కూడా హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, జీవక్రియ రుగ్మతల బారిన పడుతున్న వారే. అలాగే ఊబకాయం వల్ల క్యాన్సర్ అభివృద్ధి కూడా త్వరగా జరుగుతుంది. వివిధ రకాల క్యాన్సర్లతో ఊబకాయం అధిక బరువుకు సంబంధం ఉన్నట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అధిక బరువు బారిన పడిన వారు థైరాయిడ్ సంబంధిత క్యాన్సర్ ను పొందే అవకాశం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఊబకాయం, థైరాయిడ్ సంబంధిత క్యాన్సర్ మధ్య సంబంధాన్ని తెలుసుకునే ముందు థైరాయిడ్ పనితీరుపై అధిక బరువు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఊబకాయం అనేది థైరాయిడ్ గ్రంధి ఉత్పత్తి చేసే హార్మోన్లతో పాటు, శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇతర హార్మోన్ల సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది. థైరాయిడ్ గ్రంధి జీవక్రియ ఎదుగుదల, అభివృద్ధి వంటిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంధి థైరాక్సిన్ (T4), ట్రయోడో థైరానిన్ (T3) వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరం వినియోగించే శక్తి వ్యయాన్ని నియంత్రిస్తుంది. అలాగే సెల్యులర్ ప్రక్రియలను కూడా ప్రభావితం చేస్తుంది.
అయితే ఊబకాయం బారిన పడినవారు శరీరంలోని ఇన్సులిన్, ఈస్ట్రోజన్, లెఫ్టిన్ వంటి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతింటుంది. ఇది థైరాయిడ్ క్యాన్సర్ అభివృద్ధికి దోహదం చేస్తుంది. స్థూలకాయం దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్‌తో సంబంధం కలిగి ఉంటుంది. ఇది క్యాన్సర్ అభివృద్ధికి కారణం అవుతుంది. ఊబకాయంతో సంబంధం ఉన్న ఇన్ఫ్లేమేషన్ శరీరంలో థైరాయిడ్ క్యాన్సర్ కణాల పెరుగుదలని పెంచుతుంది. ఊబకాయం ఇన్సులిన్ నిరోధకతతో కూడా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఊబకాయం ఉన్న వారిలో ఇన్సులిన్‌కు జీవకణాలు సరిగ్గా స్పందించవు. ఇన్సులిన్ నిరోధకత అనేది ఇన్సులిన్ స్థాయిలో పెరిగిపోవడానికి దారితీస్తుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు... ఆ క్యాన్సర్ రకం, దశపై ఆధారపడి ఉంటాయి. కొన్ని రకాల లక్షణాలు మాత్రం సాధారణంగా కనిపిస్తాయి. మెడ ముందు భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉండే ప్రాంతంలో వాపు కనిపిస్తుంది. ఈ వాపు ఎలాంటి నొప్పి లేకుండా ఉండవచ్చు. లేదా కాస్త అసౌకర్యాన్ని కలిగించవచ్చు. గొంతు బొంగురు పోవడం, స్వరంలో మార్పు రావడం, థైరాయిడ్ క్యాన్సర్ లక్షణం, అలాగే మింగడానికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న కొందరు వ్యక్తుల్లో మెడ లేదా గొంతులో నొప్పి కూడా రావచ్చు. క్యాన్సర్ కణాలు సమీపంలోని శోషరస కణుపులకు వ్యాపించే అవకాశం ఉంది.
Also read: వర్షాకాలంలో మైగ్రేన్ తలనొప్పి వేధిస్తోందా? ఈ ఆయుర్వేద మందులను వాడండి