Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త
కొన్ని వ్యాధులు చాలా సైలెంట్ గా శరీరంలో చేరి, అంతే సైలెంట్ గా ప్రాణాలకు హాని చేస్తాయి.
పోషకాహారం, మంచి జీవనశైలి... మనిషి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. లేకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు దాడిచేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అవి ఎప్పుడు దాడి చేస్తాయో ఊహించలేం. ఆ వ్యాధులు వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. అందుకే వాటిని ‘సైలెంట్ కిల్లర్స్’ అంటారు. ఎందుకంటే అవి ఏ సమయంలోనైనా తీవ్రంగా మారి, ఆకస్మిక మరణాలకు కారణం కావచ్చు. అలాంటి వ్యాధుల పట్ల అవగాహన చాలా అవసరం. కొన్ని ప్రమాదకరమైన సైలెంట్ కిల్లర్స్ గురించి ఇక్కడ ఇచ్చాం.
1. అధిక రక్తపోటు
హైబీపీ చాలా మందికి ఉన్న సమస్యే కానీ ప్రాణాలు తీసేయగల ప్రమాదకారి. దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీసే అత్యంత హానికరమైన ఆరోగ్యపరిస్థితులలో ఇది ఒకటి. ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 79 సంవత్సరాలలోపు 1.28 బిలియన్ల మందికి హైబీపీ ఉంది. దీన్ని సైలెంట్ కిల్లర్ గా ఎందుకు పరిగణించారంటే ఇది తీవ్రంగా మారినప్పుడు నిర్ధిష్ట లక్షణాలేవీ బయటపడవు. పరిస్థితి తీవ్రంగా మారాకే లక్షణాలు బయటపడతాయి. రక్తపోటు పెరిగితే గుండె, ధమనులపై ప్రభావం పడుతుంది. అంతేకాదు గుండె పోటు, గుండె వైఫల్యం, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీయచ్చు.
ఏం చేయాలి: తరచూ రక్తపోటు చెక్ చేయించుకోవాలి. పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఉప్పును తక్కువగా వాడాలి. ధూమపానం, మద్యపానం అలవాట్లను వదిలేయాలి. వ్యాయామం చేయాలి.
2. కరోనరీ ఆర్టరీ డిసీజ్
ప్రాణాపాయ గుండె జబ్బుల్లో ఇదీ ఒకటి. దీనిలో గుండెకు రక్తం, ఆక్సిజన్ సరఫరా చేసే కరోనరీ ధమనులు కుచించుకుపోతాయి. దీనివల్ల ఛాతీనొప్పి, గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆ నొప్పే కరోనరీ ఆర్టరీ వ్యాధికి మొదటి సంకేతం. కానీ గుండె పోటు తీవ్రంగా వస్తే మాత్రం కష్టమే. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలితోనే కరోనరీ ఆర్టరీ వ్యాధిని రాకుండా అడ్డుకోగలం. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తికి చికిత్స ఎంత త్వరగా అందించినప్పటికీ వారిలో గుండె వైఫల్యం, అరిథ్మియా వంటివి జరగచ్చు.
ఏం చేయాలి: హైబీపీ, అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే రెగ్యులర్ గా చెకప్ లు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. రోజూ కొంతసమయం వ్యాయామం చేయాలి.
3. మధుమేహం
డయాబెటిస్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపించవు. వచ్చాకే లక్షణాలు బయటపడతాయి. అలసటగా అనిపించడం, బరువు తగ్గడం, తరచూ మూత్రవిసర్జనకు పోవడం, విపరీతమైన దాహం ఇలా ఉంటాయి లక్షణాలు. కానీ చాలా మంది వీటిని పట్టించుకోరు. దీంతో డయాబెటిస్ ముదిరాకే బయటపడుతుంది. ఈ వ్యాధి వల్ల గుండె, మూత్రపిండాలు, కంటి చూపు దెబ్బతింటాయి.
ఏం చేయాలి: ఎప్పటికప్పుడు డయాబెటిస్ ఉందేమో చెక్ చేయించుకోవాలి. మంచి ఆహారం తినడం, వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి.
4. ఆస్టియోపొరోసిస్
దీన్నే బోలు ఎముకల వ్యాధి అని పిలుస్తారు. ఈ వ్యాధి వచ్చినప్పటికీ లక్షణాలు త్వరగా బయటపడవు. ఎముకల సాంద్రతపై ప్రభావం చూపిస్తుంది. ఎముకలు గుల్లగా మారిపోతాయి.
ఏం చేయాలి: కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాన్ని రోజూ తినాలి. నడక, జాగింగ్, మెట్లు ఎక్కడం వంటివి రోజూ చేయాలి. బరువులు మోయడం వంటి వ్యాయామాలు చేస్తుండాలి.
5. స్లీప్ అప్నియా
ఇది తీవ్రమైన నిద్ర రుగ్మత. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నవారిలో నిద్రలోనే ఆకస్మిక మరణాలు సంభవించడం, గుండె పోటు రావడం వంటివి జరుగుతాయి. ఈ వ్యాధి ఉన్నవాళ్లు నిద్రలో ఊపిరి తీసినప్పుడు పెద్దగా శబ్ధం వస్తుంది. గురక కూడా పెడతారు. పగలంతా విపరీతమైన అలసట ఫీలవుతారు.
ఏం చేయాలి: ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. బరువు పెరగకూడదు. మంచి ఆహారం తినాలి, ధూమపానం వంటి అలవాట్లను దూరం పెట్టాలి. అలాగే వైద్యుడిని కలిపి స్లీప్ అప్నియా ఉందో లేదో, ఉంటే తీవ్రంగా ఉందా అనే విషయాలు తెలుసుకోవాలి. తదనుగుణంగా చికిత్స తీసుకోవాలి.
6. ఫ్యాటీ లివర్ డిసీజ్
కాలేయానికి వచ్చే వ్యాధి ఇది. ఈ వ్యాధి వచ్చినా కూడా ముదిరిపోయే వరకు ఎలాంటి లక్షణాలను బయటపెట్టదు. ఈ వ్యాధి రెండు రకాలు. ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మద్యపానం వల్ల వచ్చేది ఒకటైతే, రెండోది ఎందుకు వస్తుందో ఇంకా కనిపెట్టలేదు. ఈ వ్యాధి ముదిరితే చాలా ప్రమాదకరంగా మారుతుంది.
ఏం చేయాలి: ఈ వ్యాధికి సంబంధించినంతవరకు ఆహారం చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది. మొక్కల ఆధారిత ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. అనారోగ్యకరమైన కొవ్వులుంటే ఆహారానికి దూరంగా ఉండాలి. బరువు పెరగకూడదు. ముఖ్యంగా మద్యపానానికి దూరంగా ఉండాలి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి
Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Read Also: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం