Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!
నిత్యం కడుపులో ఏదో ఒక సమస్య వస్తుందా? ఒకసారి నొప్పిగా, మరోసారి మంటగా కడుపు కల్లోలంగా మారుతోందా? అయితే, ఈ అలవాట్లను మానుకోండి.
ఏం తిన్నా సరే కడుపు కల్లోలంగా మారుతోందా? ఇందుకు మీ కడుపును నిందించకండి. మీకు ఉండే కొన్ని అలవాట్ల వల్లే కడుపులో సమస్యలు వస్తుంటాయి. ఆ అలవాట్లు మీకు చిన్నగానే అనిపించవచ్చు. కానీ, జీర్ణవ్యవస్థపై మాత్రం పెద్ద ప్రభావమే చూపుతాయి. దాని వల్ల ‘ఇన్‌ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్’(IBS)కు గురయ్యే ప్రమాదం ఉంది. IBSతో బాధపడేవారికి రోజంతా నరకమే కనిపిస్తుంది. పొత్తికడుపులో నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం, అతిసారం, గ్యాస్ ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి, మీ కడుపుకు కీడు చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకోండి.
IBS వల్ల కడుపులో నొప్పి, మంట ఏర్పడుతుంది. ఇందుకు కారణాలేమిటో తెలుసుకోండి:
⦿ ఒత్తిడికి గురికావడం: మీరు తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నారా? అయితే, అది కూడా కడుపు మంటకు కారణం అవుతుంది. ఎందుకంటే, ఒత్తిడి పేగు ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. దానివల్ ఐబీఎస్ ఏర్పడి మంటకు కారణం అవుతుంది. కాబట్టి, వీలైనంత వరకు ఒత్తిడిని అదిగమించండి. డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స పొందండి.
⦿ నీరు తక్కువ తాగుతున్నారా?: చాలామంది నీరు ఎక్కువగా తాగే అలవాటు ఉండదు. అలాంటి వారిలో కూడా IBS సమస్యలు ఏర్పడతాయి. పేగులు ఆరోగ్యంగా ఉండాలన్నా, అవి వాటి పని సక్రమంగా నిర్వహించాలన్నా.. రోజూ తగినంత నీరు తాగడం ముఖ్యం. అలా చేయకపోతే ఐబీఎస్‌తో కడుపు మంట ఏర్పడే అవకాశాలున్నాయి.
⦿ ఘాటైన ఆహారాలను లాగిస్తున్నారా?: కొంతమందికి స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. బిర్యానీలు బాగా లాగిస్తుంటారు. అలాగే, మరికొందరు కారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. దాని వల్ల కడుపు అల్లకల్లోలం అవుతుంది. స్పైసీ ఫుడ్ తినేందుకు రుచిగా అనిపించినా, కడుపుకు మాత్రం అది చేదే. అవి తీవ్రమైన మంటను కలిగిస్తాయి. కాబట్టి, అలాంటి ఆహారాన్ని అప్పుడప్పుడే తీసుకోండి. రోజూ అదే ఆహారాన్ని తింటే తీవ్రమైన సమస్యలు వస్తాయి.
⦿ ఆహారానికి తగిన వ్యాయామం లేకపోవడం: ఆహారం తినడమే కాదు, దాన్ని అరిగించుకోవడం కూడా మన కర్తవ్యమే. తిన్న తర్వాత బద్దకంగా కూర్చోకుండా కాసేపు అటూ ఇటూ నడవండి. చురుగ్గా ఉండండి. వీలైనంత వరకు మీరు తినే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూడండి. పోషకాలతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి.
⦿ కూల్ డ్రింక్స్ అతిగా తాగుతున్నారా?: మీకు కడుపులో సమస్యలు ఉన్నప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ లేదా కార్బోనేటెడ్ పానీయాలకు దూరంగా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే, అవి మీ కడుపును మరింత పాడుచేస్తాయి. కార్బోనేటెడ్, చక్కెరతో నిండిన పానీయాలు కడుపు మంటకు దారితీస్తాయి. కాబట్టి, అలాంటి పానీయలకు దూరంగా ఉండండి.
Also Read: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!
⦿ తగిన ఆహార వేళలను పాటించకపోవడం: తగిన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో సమస్యలు ఏర్పడతాయి. వేళకాని వేళలో భోజనం చేయడం. అర్ధరాత్రిళ్లు నిద్రలేచి నోట్లో ఏదో ఒకటి వేసుకుని నిద్రించడం వంటి అలవాట్లు మంచివి కావు. అలాగే రాత్రివేళ గుడ్లు, చికెన్ తదితర మాంసాహారాలను తీసుకోకపోవడమే ఉత్తమం. అవి మీ కడుపుపై మరింత ఒత్తిడిని తెస్తాయి. కాబట్టి, ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉండండి.
Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
గమనిక: కేవలం మీ అవగాహన కోసమే ఈ సమాచారాన్ని అందించాం. ఈ కథనం వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. వివిధ అధ్యయనాలను, నిపుణుల సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించారు. ఇందులోని అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.