Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!
చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మాత్రాలను మింగేస్తున్నారా? ఒళ్లు వేడిగా ఉందని ‘పారాసెటమాల్’ మాత్రలను తీసుకుంటున్నారా? అయితే, మీరు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
కొద్దిగా జ్వరం వచ్చినా, నొప్పులు వచ్చినా.. డాక్టర్‌ను సంప్రదించకుండా ఉపశమనం కోసం పారాసెటమాల్ తీసుకోవడం సాధారణమే. అయితే, ఎంత మోతాదులో పారాసెటమాల్ తీసుకోవాలనే అవగాహన ఎవరిలోనూ లేదు. మీకు వచ్చే జ్వరం తీవ్రతకు, మీరు తీసుకునే పారాసెటమాల్ మాత్ర మోతాదుకు అస్సలు సంబంధమే ఉండదు. మరికొందరైతే.. చిన్న నొప్పికి కూడా ఈ ఔషదాన్ని తీసుకోవడాన్ని అలవాటుగా చేసుకున్నారు. చివరికి చిన్నారులకు జ్వరం వచ్చినా.. పారాసెటమాల్‌నే మందుగా ఇస్తున్నాం. అయితే, ఇది మంచి మందే. కానీ, మొతాదు మించనంత వరకే. అదేపనిగా పారాసెటమాల్, దాని అనుబంధ మాత్రలను తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకుంటే.. స్లో పాయిజ్‌ను శరీరంలోకి ఎక్కించుకుంటున్నట్లేనని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
ఎసిటమైనోఫెన్ యమ డేంజర్: మనలో చాలా మంది తలనొప్పి, పంటి నొప్పి లేదా జ్వరం కోసం పారాసెటమాల్ తీసుకుంటారు. వైద్యుడి సూచన లేకుండా దీన్ని వాడితే ప్రాణాలను హరించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇది కాలేయాన్ని దెబ్బతీయొచ్చు. పారాసెటమాల్‌లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ‘ఎసిటమైనోఫెన్’ (Acetaminophen) కూడా ఒకటి. అమెరికాలో దీన్ని ‘అత్యంత ప్రమాదకరమైన ఓవర్-ది-కౌంటర్ డ్రగ్’ అని వైద్య నిపుణులు పేర్కొన్నారు. దీన్ని ఎక్కువగా తలనొప్పి, రుతుక్రమం, పంటి నొప్పి, నడుం నొప్పి, ఆస్టియో ఆర్థరైటిస్(కీళ్ల నొప్పులు), జ్వరం, జలుబుకు ఎక్కువగా వాడుతుంటారు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండే ఔషదం.
టాక్సిక్ హెపటైటిస్ అంటే?: చికాగోలోని లయోలా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జాన్ బ్రెమ్స్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ.. ‘టైలెనాల్’ అనే పెయిన్‌కిల్లర్ కాలేయ వైఫల్యానికి కారణమవుతాయిని తెలిపారు. ఇది కూడా పారాసెటమాల్‌లో ఒక రకం. అయితే, అన్ని పారాసెటమాల్ మందులతో పోల్చితే ‘టైలెనాల్’ చాలా ప్రత్యేకం. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకొనే రోగులు ‘టైలెనాల్’ తీసుకుంటే విషంగా మారుతుందన్నారు. అది నేరుగా కాలేయాన్ని దెబ్బతిస్తుందని చెప్పారు. ‘‘మేం ఏడాదిలో ముగ్గురు నుంచి నలుగురికి కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నాం. కొందరు మార్పిడి జరగక ముందే ప్రాణాలు కోల్పోతున్నారు. కాలేయ మార్పిడి వరకు ముదిరే వ్యాధిని ‘టాక్సిక్ హెపటైటిస్’ అని పిలుస్తారు. ఈ సమస్య ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం తీసుకొనే మందులు, రసాయనాలు, ఆల్కహాల్ ప్రతికూల చర్యల వల్ల కాలేయం వాపుకు గురవుతుంది’’ అని తెలిపారు.
Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
మోతాదు మించితే ప్రాణాలకే ప్రమాదం: యూకేకు చెందిన ఓ వైద్య నిపుణుడు మాట్లాడుతూ.. వారి దేశంలో సాధారణంగా తీసుకొనే మందుల్లో పారాసెటమాల్ ఒకటని తెలిపారు. వైద్యులు సిఫార్సు చేసే మోతాదు ప్రకారం ఈ పారాసెటమల్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటేనే ముప్పు అని తెలిపారు. అన్ని ఔషదాల తరహాలోనే పారాసెటమాల్‌ను ఇష్టానుసారంగా తీసుకోకుండా.. వైద్యులు సూచించే మొతాదులో మాత్రమే తీసుకోవాలన్నారు. మన శరీరం ఒక పరిధి వరకు మాత్రమే పారాసెటమాల్‌ను గ్రహించగలదని, ఆ పరిధి దాటితే నేరుగా లివర్‌పై ప్రభావం చూపుతుందన్నారు. చూశారుగా, ఇకపై మీరు పారాసెటమాల్ మాత్రను వేసుకొనే ముందు ఒకసారి ఆలోచించండి. మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యకు.. ఎంత మోతాదులో ఔషదం తీసుకోవాలనేది కేవలం డాక్టర్లకు మాత్రమే తెలుస్తుంది.
Also Read: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి
గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు, కథనాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. ఇందులోని సూచనలు వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఈ కథనంలోని అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.