Calcium: పాలలో కన్నా వీటిలోనే కాల్షియం ఎక్కువ, రోజూ తింటే మేలు
పాలు తాగడం ఇష్టం లేనివారికి కాల్షియం కావాలంటే ఈ ఆహారపదార్థాలను తింటే సరిపోతుంది.
శరీరానికి అవసరమైన పోషకాలలో కాల్షియం ముఖ్యమైనది. ఎముకలు దృఢంగా ఉండాలంటే పాలు తాగాలని పోషకాహార నిపుణులు చెబుతూనే ఉంటారు. పాలు చాలా ఆరోగ్యకరమైన డ్రింక్. అయితే కొంతమందికి పాల వాసన పడదు. ఆ వాసనకు వాంతులొచ్చేలా ఫీలవుతారు. అలాంటి వారిలో కాల్షియం లోపం తలెత్తకుండా ఉండాలంటే కాల్షియం అధికంగా ఉండే ఇతర ఆహారాలను రోజూ తినాలి.
టోఫు
సూపర్ మార్కెట్లలో ఇది దొరుకుతుంది. కేవలం 200 గ్రాముల టోఫు తింటే 700 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. టోఫు, పనీర్ లాగే ఉంటుంది. రుచి, రూపం అన్నీ పనీర్ లాగే ఉంటాయి. పనీర్‌ను వండుకున్నట్టే టోఫును వండుకోవచ్చు. కూరగా వండుకోవచ్చు, లేదా సలాడ్లో కలుపుకుని తినవచ్చు.
బాదం పప్పులు
బాదం పప్పులు పచ్చిగా తిన్నా, నీటిలో నానబెట్టుకుని తిన్నా మంచిదే. గుప్పెడు బాదం పప్పులు రోజూ తిన్నా చాలు, శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. బాదం పాలుగా, బాదం పొడిగా మార్చుకుని లడ్డూలు, ఖీర్, డిజర్ట్ లలో తిన్నా కాల్షియం అందుతుంది.
పెరుగు
పాలు నచ్చకపోతే కప్పు పెరుగు తినడం లాభం ఉంటుంది. ఒక కప్పు పెరుగు తింటే 300 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది. ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ సమయంలో, మధ్యాహ్నం భోజనం సమయంలో పెరుగును తినేందుకు ప్రయత్నించాలి. రాత్రిపూట దూరం పెట్టడం ఉత్తమం. పెరుగలో తాజా పండ్లు వేసుకుని తింటే చాలా మంచిది.
నువ్వులు గింజలు
నాలుగు స్పూన్ల నువ్వులు రోజూ తింటే దాదాపు 350 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది. కూరల్లో నువ్వులను కలిపి వండేసుకోవాలి. లేదా సలాడ్లపై చల్లుకుని తినాలి. వేయించిన నువ్వులను తిన్నా మంచి ఫలితం ఉంటుంది.
కొమ్ముశెనగలు
రెండు కప్పుల కొమ్ముశెనగలలో 420 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. వీటితో వేపుడు, కూర కూడా వండుకోవచ్చు. రకరకాల వంటకాలు వండుకోవచ్చు. వీటిని తింటే ఇనుము కూడా శరీరానికి పుష్కలంగా అందుతుంది.
చియా సీడ్స్
సూపర్ మార్కెట్లలో చియా సీడ్స్ దొరుకుతాయి. నాలుగు టేబుల్ స్పూన్ల చియా గింజలు తింటే 350 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. చియా విత్తనాలను ఒక గ్లాసు నీటిలో కలిపి గంట పాటు నానబెట్టి ఆ తరువాత ఆ నీటిని తాగేయాలి. చియా సీడ్స్‌తో చియా గింజలతో స్మూతీలను తయారుచేసుకోవచ్చు.
రాగి పిండి
రాగి పిండితో చేసే వంటకాలు రోజూ తింటే కాల్షియం పుష్కలంగా అందుతుంది. వందగ్రాముల రాగి పిండిలో 345 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. వారానికి కనీసం నాలుగు సార్లు రాగి పిండిని ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. వాటితో రాగి జావ, అట్టు, లడ్డూలు చేసుకుని తినవచ్చు.
Also read: ఏప్రిల్‌లో పుట్టినవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇలా