World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
హైబీపీ ఇప్పుడు అధిక శాతం మందిని వేధిస్తున్న సమస్య.
మే 16న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హైపర్‌టెన్షన్ డేను నిర్వహించుకుంటారు. ప్రపంచంలో అధికరక్తపోటు చాప కింద నీరులా పాకేస్తోంది. కొన్ని కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనదేశంలో కూడా హైబీపీ ప్రధాన సమస్యగా మారింది. మధుమేహం, హైబీపీ జంటగా దాడి చేసి మనిషి ఆరోగ్యాన్ని కుదేలు చేస్తున్నాయి. హైబీపీ రాకుండా జాగ్రత్త పడడం ఎంత ముఖ్యమో కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే స్పందించి వైద్యుడిని కలవడం కూడా అంతే ముఖ్యం. లేకుండా హైబీపీ ప్రాణాంతకంగా మారిపోతుంది.
హైబీపీ అంటే...
హైపర్ టెన్షన్ ను అధికరక్తపోటు అంటారు. ధమనుల్లోని రక్తం అధికవేగంతో ప్రవహిస్తూ ధమని గోడలను ఢీ కొట్టినప్పుడు ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే చాలా నష్టం జరిగే అవకాశం ఎక్కువ. హైపర్ టెన్షన్ సైలెంట్ కిల్లర్ అనే చెప్పుకోవాలి. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్, రక్తనాళాలు చిట్లిపోవడం వంటి నష్టాలు జరుగుతాయి. ఇది దీర్ఘకాలికంగా చాలా ప్రమాదాన్ని పెంచుతుంది. హైబీపీ తీవ్రంగా మారక ముందే ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే ఇతర ఆరోగ్యసమస్యలేవీ రాకుండా ఉంటాయి. చిన్న చిన్న లక్షణాల ద్వారా ఇది ఉందేమోనని అనుమానించవచ్చు.
1. ఉదయాన నిద్రపోయి లేచిన తరువాత కొందరిలో తలనొప్పి వస్తుంది. ఇది కొన్ని సార్లు నిద్రలేమి వల్ల కూడా కలగవచ్చు. అయితే తరచూ తెల్లవారుజామున తలనొప్పితో బాధపడుతుంటే అది అధిక రక్తపోటుకు సంకేతం కావచ్చు.
2. ముక్కు నుంచి ఒక్కోసారి కాస్త రక్తస్రావం కనిపించవచ్చు. వేడి చేయడం వల్ల ఇలా జరుగుతుందని చాలా మంది భావన. అధికరక్తపోటు కారణంగా కూడా ఇలా జరగవచ్చు.
3. శ్వాస తీసుకోవడంలో తరచూ ఇబ్బందిగా అనిపిస్తుంది. ఊపిరి సరిగా ఆడకపోవడం కూడా అధికరక్తపోటు లక్షణమే. మరీ తీవ్రంగా మారితే ఇది ఛాతీ నొప్పికి కూడా కారణం అవుతంది.
4. గుండెకొట్టుకునే వేగంలో తేడా వస్తుంది. హార్ట్ బీట్ క్రమరహితంగా అనిపిస్తుంది. దీన్ని అరిథ్మియా అంటారు. ధమని గోడలపై రక్తం క్రాష్ అయ్యే అనియంత్రిత ఒత్తిడి కారణంగా ఇది జరుగుతుంది.
5.అధికరక్తపోటుకు సంబంధించి అతి తీవ్రమైన లక్షణాలలో ఒకటి మూత్రంలో రక్తం కనిపించడం. ఇది క్యాన్సర్ లక్షణం కూడా కావచ్చు. అందుకే మీరు మూత్రంలో ముదురు ఎరుపు రంగు లేదా గులాబీ రంగులో ఉన్న రక్తాన్ని గమనించినట్లయితే వెంటనే వైద్యుని వద్దకు వెళ్లండి.
Also read: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడాయన, ఇతడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది
Also read: గర్భంతో ఉన్నప్పుడు ఈ మందులు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా? వీలైనంత వరకు వాడకపోతేనే మంచిది