Menopause: మెనోపాజ్ తర్వాత మహిళల్లో కలిగే మార్పులు ఇవే
మహిళలకు వయసు పెరుగుతున్న కొద్దీ మెనోపాజ్ వస్తుంది.
మహిళల జీవితంలో మెనోపాజ్ ఒక ముఖ్యమైన దశ. ఇది ఋతుక్రమం ఆగిపోయే దశ. పన్నేండేళ్ల వయసులో మొదలైన రుతుక్రమం నలభై ఏళ్లు దాటాక ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. ఇలా మెనోపాజ్ దశకు వచ్చిన మహిళల్లో చాలా రకాల మార్పులు జరుగుతాయి. వారి హార్మోన్లలో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయి. అందుకే మూడ్ స్వింగ్స్ అధికంగా వస్తాయి. చిన్న చిన్న వాటికే చిరాకు పడుతూ ఉంటారు. తీవ్రంగా అలసటగా ఫీల్ అవుతూ ఉంటారు. వారిని కీళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఏ విషయాల పైనా ఆసక్తి ఉండదు. ఒళ్లంతా వేడి సెగలు వస్తున్నట్లు అనిపిస్తుంది.
మెనోపాజ్ దశ శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులకు లోను చేస్తుంది. ఎముక క్షీణిస్తుంది. జీవక్రియ కూడా మందగిస్తుంది. కండరాల ద్రవ్యరాశి తగ్గుతుంది. దీనివల్లే నీరసంగా అనిపిస్తారు. మెనోపాజ్ దశకు చేరుకున్నవారు రోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం. అలాగే చిన్న చిన్న బరువులు ఎత్తుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వారికి కండరాలు, ఎముకలు బలంగా మారుతాయి. మెనోపాజ్ వచ్చిన మహిళల్లో బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే తరచూ వ్యాయామం చేస్తూ ఉండాలి.
మెనోపాజ్ వచ్చిన మహిళలు చిన్న చిన్న దెబ్బలు కూడా తట్టుకోలేరు. చిన్న గాయమైనా కూడా అది పెద్దగా మారిపోతుంది. అందుకే ఈ స్త్రీలు స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఏరోబిక్ వ్యాయామాలు అంటే రన్నింగ్ లేదా వాకింగ్ వంటివి తప్పకుండా చేస్తూ ఉండాలి. హార్మోన్లలో అధిక మార్పులు రాకుండా ఉండడానికి ఇవన్నీ సహాయపడతాయి. ఈ దశలో ఉన్న మహిళలు త్వరగా డిప్రెషన్, మానసిక ఆందోళన వంటి సమస్యల ద్వారా పడుతుంటారు. అలాంటి వారు రోజూ వ్యాయామం చేస్తే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
మహిళలు వెయిట్ లిఫ్టింగ్ చేయడానికి ఇష్టపడరు. కానీ మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు ఖచ్చితంగా వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలను చేస్తూ ఉండాలి. ఇవి వారి జీవితంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. నిద్రా సమస్యలు శరీరం నుంచి వేడి సెగలు రావడం వంటివి తగ్గుతాయి. మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. బరువులు ఎత్తడం వల్ల మానసిక స్థితిపై అధిక ప్రభావాన్ని చూపే ఎండార్పిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరంలో నొప్పిని తగ్గిస్తాయి. మానసికంగా ఒత్తిడిని తగ్గించి సంతోషాన్ని కలిగిస్తాయి. వెయిట్ లిఫ్టింగ్ అనగానే పెద్ద పెద్ద బరువులు ఎత్తాలని లేదు, చిన్న చిన్న బరువులు ఎత్తితే చాలు. ముందుగా అలవాటయ్యే వరకు తక్కువ బరువులతోనే ప్రారంభించండి.
Also read: ఈ టీ కప్పు ఖరీదుతో జీవితాంతం ఏ లోటు లేకుండా బతికేయొచ్చు
Also read: ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రక్తదానం చేయకూడదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.