Hyderabadi Food: హైదరాబాద్‌లో కచ్చితంగా రుచి చూడాల్సిన ఫుడ్ ఐటెమ్స్ ఇవే, తింటే మైమరచిపోవడం ఖాయం
హైదరాబాద్ లో ఫేమస్ వంటకాలు ఇవన్నీ. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన వాళ్లకి ఇక్కడ ప్రత్యేక వంటకాల గురించి చెప్పక్కర్లేదు. కానీ ఎక్కడో పుట్టి పెరిగి, ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చిన వారు హైదరాబాద్‌లోని రుచులను ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అలాగే ఎక్కడ్నించో ట్రావెలింగ్ చేస్తూ ఇక్కడికి వచ్చినవారు, హైదరాబాద్ చారిత్రక ప్రదేశాలను, పర్యాటక ప్రదేశాలను వీక్షించడానికి వచ్చే వారి కోసమే ఈ కథనం. హైదరాబాద్ వస్తే కచ్చితంగా ఈ స్పెషల్ ఫుడ్ ఐటెమ్స్ ని రుచి చూడండి. అదిరిపోవడం ఖాయం.
హైదరాబాదీ మటన్ బిర్యాని
చికెన్ బిర్యానీ ఎప్పుడైనా తినొచ్చు కానీ కచ్చితంగా తినాల్సింది మాత్రం హైదరాబాదీ మటన్ బిర్యాని. లేత గొర్రె మాంసంతో చేసే ఈ బిర్యానీ సువాసన నోరూరించేస్తుంది. మసాలాదినసులు, నెయ్యి, పుదీనా ఆకులకు జతగా బాస్మతి బియ్యాన్ని కలిపి వండుతారు. ఒక్కసారి తిన్నారో మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది దీని రుచి. ఈ బిర్యానీ ఎక్కడైనా చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది కానీ, హైదరాబాద్‌లో వండింది తింటనే అసలు రుచి తెలిసేది.
మరాక్
ఇది సోమాలియాలో పుట్టిన వంటకం అని చెప్పుకుంటారు. నిజాం సైనికుల్లో ఎక్కువ శాతం మంది సూడాన్, అరబ్ దేశాలకు చెందిన వారే ఉండేవారు. వారి ప్రభావం హైదరాబాదీ ఆహారంపైనే కాదు, ఇక్కడి ఆహార సంస్కృతిపై కూడా పడింది. అలా వారి నుంచి భాగ్యనగరానికి చేరిందే మరాక్ లేదా మార్క్ అనే ఈ వంటకం. లేత మటన్ తో చేసే సూప్ ఇది. జ్యూసీగా ఉండే ఈ సూప్ రుచిలో చాలా గొప్పగా ఉంటుంది. నాన్ తో కలిపి తింటే అదిరిపోతుంది.
కట్టి దాల్
కందిపప్పుతో వండే వంటకం ఇది. హైదరాబాద్ మాంసాహార వంటకాలకే కాదు శాఖాహార వంటలకు కూడా ప్రసిద్ధే. కందిపప్పు, చింతపండు, మసాలాలు కలిపి దీన్ని వండుతారు. రోటీతో తిన్నా బావుంటుంది లేదా అన్నం, మాంసం వంటకాలతో పాటూ ఈ పప్పును తింటే చాలా రుచిగా ఉంటుంది.
కీమా సమోసా
మటన్ కీమా లేదా చికెన్ కీమాతో చేసే సమోసాలు. ఆకలేసినప్పుడు తక్షణం పొట్ట నింపే చిరుతిళ్లు. వీటిని తింటే మైమరిచిపోవడం ఖాయం. హైదరాబాద్ వచ్చినప్పుడు కచ్చితంగా వీటిని రుచి చూడాల్సిందే.
బాదం హల్వా
ప్రపంచంలో ఎక్కడైనా బాదం హల్వా దొరుకుతుంది నిజమే, కానీ హైదరాబాద్ లో దొరికేది వెరీ స్పెషల్. నెయ్యి, పంచదార, కేసరి, రోజ్ వాటర్, పాలు, బాదం పొడి కలిపి వండుతారు. దీని వాసన తినాలన్న కోరికను పెంచేస్తుంది.
హలీమ్
దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. శక్తివంతమైన ఆహారాలలో ఇదీ ఒకటి. పవిత్ర రంజాన్ మాసంలో హైదరాబాద్ లోని రెస్టారెంట్లన్నీ హలీమ్ వాసనతో ఘుమఘుమలాడేస్తాయి. గోధుమలు, నెయ్యి, లేత గొర్రె మాంసం, రకరకాల మసాలాలు వేసి దీన్ని వండుతారు.దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంత డిమాండో. కాకపోతే
బగారే భైంగన్
శాఖాహార కూరల్లో ఇదో ప్రత్యేకమైన వంటకం. వేరుశెనగలు, ఎండు కొబ్బరి, చింతపండు పేస్టు, మసాలా దినుసులు వంటివి కలిపి ఈ కూరను వండుతారు. అన్నంతో దీన్ని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. చపాతీకి మంచి జోడీ.
పత్తర్ కా ఘోష్
ఇది ప్రసిద్ధ హైదరాబాదీ వంటకం. లేత గొర్రెమాంసంతో తయారుచేస్తారు. సాంప్రదాయక సుగంధ ద్రవ్యాలలో ఇదీ ఒకటి. ఈ వంటను వేడి రాయి మీద వండుతారు. అందుకే దీనికి పతర్ కా ఘోష్ అని పేరు. పత్తర్ అంటే హిందీలో రాయి అని అర్థం. దీని రుచి చాలా విభిన్నంగా ఉంటుంది.
Also read: లస్సీ అంటే ఇష్టమా? అధికంగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు గురించి తెలుసుకోండి మరి