Chinta Chiguru: కిలో చికెన్ కన్నా కిలో చింతచిగురు ధరే ఎక్కువ, ఈ సీజన్లో దానికెందుకంత క్రేజ్
చింతచిగురు వంటలు ఇప్పుడు గ్రామాల్లోని వంటల్లో గుప్పుమంటాయి.
చింత చెట్లు ఎక్కడపడితే అక్కడే కనిపిస్తాయి. కానీ చింతచిగురు మాత్రం సీజనల్‌గా దొరుకుతుంది. ఎండాకాలం ఇలా ముగిసిందో లేదో వానలకు స్వాగతం పలుకినట్టు చింతచిగురు పూస్తుంది. చెట్టు నిండా లేతాకు నోరూరిస్తుంది. వాటిని తెంపి మూటలు కట్టి మార్కెట్లో విక్రయిస్తారు. గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు కూడా చింత చిగురు చేరుకుంటుంది. ప్రస్తుతం చాలా చోట్ల దీని ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కిలో రూ.500 నుంచి 600 దాకా పలుకుతోంది. అయినా సరే కనీసం గుప్పెడు చింతాకైనా కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రజలు. గుప్పెడు ఆకు పాతిక రూపాయల నుంచి ముప్పె రూపాయలకు వస్తుంది. కిలో చికెన్ ధరే రూ.300 దాకా ఉంది, అదే రొయ్యలు కిలో రూ. 400 నుంచి దొరుకుతున్నాయి. చేపల ధరలు అలాగే ఉన్నాయి. అంటే వీటన్నింటి కన్నా చింత చిగురు ధరే అధికంగా ఉన్నట్టు లెక్క.
ఎందుకంత ధర?
సాధారణంగా చింత చిగురు ధర కిలో వంద రూపాయలు ఉండేది. కానీ చెట్లు తరిగి బిల్డింగులు పెరుగుతున్న కొద్దీ చింత చిగురు దొరకడం కష్టమైపోయింది. గ్రామాల నుంచి చింత చిగురును మోసుకొస్తున్నారు. తినడానికి ఎక్కువ మంది మొగ్గు చూపడంతో ధర పెంచి అమ్మాల్సి వస్తుంది. పప్పు చింతచిగురు, చింత చిగురు పచ్చడి, రొయ్యలు చింత చిగురు కూర, చికెన్ చికెన్ చింతచిగురు, మటన్ చింత చిగురు, చింత చిగురు పులిహోర... ఇవి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తాయి.
తినడం అవసరమా?
చాలా మందికి వచ్చే సందేహం ఇది... చింతచిగురు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. ఈ ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. పైల్స్ ఉన్నవారికి చింతచిగురు చాలా మేలు చేస్తుంది. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల గుండె జబ్బులు వంటి ఇతర ప్రమాదకరమైన అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.డయాబెటిస్ ఉన్న వారికి చింతచిగురు చాలా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పిల్లలకు తినిపించడం వల్ల వారికి ఆరోగ్యానికి మంచిది. థైరాయిడ్ సమస్య ఉన్న వారు చింత చిగురుతో చేసిన వంటకాలు తినడం వల్ల వారికి తగ్గే అవకాశం ఉంది. నెలసరి సమయంలో ఆడవారిలో కనిపించే సమస్యలకు ఇందులో ఉండే పోషకాలు చెక్ పెడతాయి.
Also read: సగ్గుబియ్యంతో టేస్టీ దోశెలు, కొబ్బరి చట్నీతో తింటే ఆ మజానే వేరు
Also read: చర్మం, గోళ్లు ఇలా మారాయా? అవి గుండె జబ్బు సంకేతాలు కావచ్చు, జాగ్రత్త పడండి