పెళ్లికాని ప్రసాద్‌లు ‘బ్యాచిలర్ ట్యాక్స్’ కట్టాలట.. అమ్మాయిలకు డబ్బే డబ్బు!
‘‘వద్దురా సోదరా... అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా..’’ అంటే ఆ దేశాల్లో అస్సలు అంగీకరించరు. పెళ్లి చేసుకోండి.. లేకపోతే ట్యాక్స్ లేదా జరిమానా కట్టాల్సిందే.
ఒకప్పుడు.. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు రాగానే పెళ్లి చేసి చేతులు దులుపుకొనేవారు. కానీ, ఇప్పుడు 21 కాదుగదా.. 31 ఏళ్లు దాటినా.. ‘‘నాకా.. పెళ్లా.. ఇప్పుడా’’ అంటూ నోరెళ్లబెట్టే అబ్బాయిలు చాలామందే ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు దొరక్క పెళ్లికి దూరమవుతుంటే.. మరికొందరు కెరీర్‌లో సెటిల్ అయ్యే వరకు పెళ్లి ఊసు ఎత్తుకూడదనే లక్ష్యంతో పెళ్లికాని ప్రసాదుల్లా మిగిలిపోయేందుకు ప్రాధాన్యం ఇస్తు్న్నారు. కొందరైతే.. పెళ్లి.. ఆ తర్వాత భార్యతో లొల్లి.. ఈ కష్టాలు మనకెందుకులే అని తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కారణాలు ఏమైనా.. ‘సింగిల్’ లైఫ్‌ను ఇష్టపడేవారి సంఖ్య క్రమేనా పెరుగుతోంది. అయితే.. కొన్ని దేశాలు అబ్బాయిలు ‘సింగిల్’గా మిగిలిపోవడాన్ని అస్సలు ఇష్టపడవు. అందుకే.. వారికి బ్రహ్మచారి ట్యాక్స్(బ్యాచిలర్ పన్ను) విధించేవి. మరి ఆ దేశాలేంటీ.. బ్యాచిలర్ ట్యా్క్స్ అమలు చేయడానికి కారణాలేమిటో చూసేద్దామా.
1821 సంవత్సరంలో అమెరికన్లు తమ జనాభాను పెంచుకొనేందుకు పెళ్లిని తప్పనిసరిగా భావించేవారు. అక్కడికి వెళ్లి స్థిరపడే పరదేశీయుల కంటే అత్యధిక జనాభా తమదే కావాలనే తపన ఉండేది. దీంతో అమెరికన్లను పెళ్లికి ప్రేరేపించేందుకు సింగిల్స్ లేదా బ్రహ్మచారులకు బ్యాచిలర్స్ ట్యాక్స్ విధించడం మొదలుపెట్టారు. దీనివల్ల ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం లభిస్తుందనే కారణంతో.. చాలా ఏళ్లు ఈ పన్ను కొనసాగించారు. అప్పట్లోనే ఈ పన్ను ఒక ఏడాదికి డాలర్ ఉండేది.
అయితే, ఉద్యోగాలు చేయని సింగిల్స్‌కు ఈ పన్ను కట్టడం చాలా కష్టంగా ఉండేది. కలక్రమేనా జనాభా పెరగడం, ఉద్యోగ అవకాశాలు తగ్గడంతో ఈ పన్నుపై వ్యతిరేకత పెరిగింది. ఈ బ్యాచిలర్ పన్ను విధానానికి మొట్టమొదట శ్రీకారం చుట్టింది మిస్సోరి. ఆ తర్వాత ఈ విధానాన్ని అమెరికా మొత్తం అమలు చేశారు. 21 నుంచి 50 ఏళ్లు లోపు వయస్సు గల వ్యక్తులు పెళ్లి చేసుకోకపోతే ఈ పన్ను చెల్లించాలి. ఈ విధానం 20వ శతాబ్దం వరకు కొనసాగింది. అయితే, 1939లో ఈ పన్నుకు ముగింపు పలికారు.
రోమన్లోతో మొదలు: కేవలం అమెరికాలో మాత్రమే కాదు.. వివిధ దేశాల్లో కూడా ఈ బ్యాచిలర్ ట్యాక్స్ విధించేవారు. ప్రాచీన రోమ్ నగరంలో అగస్టస్ చక్రవర్తి కూడా బ్రహ్మచారి పన్ను విధించేవాడు. 25 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని బ్యాచిలర్స్‌కు జరిమానాలు విధించేవాడు. కేవలం పురుషులకే కాకుండా స్త్రీలు సైతం జరిమానా చెల్లించేవారు. పిల్లలు లేనివారి నుంచి కూడా రోమన్ చక్రవర్తులు పన్నులు వసూళ్లు చేయించేవారు.
⦿ 1919లో దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుల కంటే ఎక్కువగా జనాభా ఉండాలనే కారణంతో.. శ్వేతజాతీయులకు బ్యాచిలర్ ట్యాక్స్ అమలు చేసేవారు.
⦿ 1923లో జర్మనీలోని రిపెలెన్ టౌన్‌లో కూడా బ్యాచిలర్ ట్యాక్స్ వసూలు చేయాలని ఆదేశించారు. అయితే, నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది.
⦿ 1927లో ఇటలీలో ముస్సోలినీ పతనం వరకు బ్యాచిలర్ ట్యాక్స్ అమలు జరిగింది. అక్కడి బ్యాచిలర్స్ తమ ఆదాయపన్ను కంటే రెండింతలు ఎక్కువగా బ్రహ్మచారి పన్ను చెల్లించాల్సి వచ్చింది.
⦿ 1999లో ఇటలీలోని వస్తోగిరార్డి మేయర్ స్థానికంగా బ్యాచిలర్ ట్యాక్స్‌ని పునఃప్రారంభించాలని ప్రతిపాదించారు. అయితే, అది ఇంకా అమల్లోకి రాలేదు.
⦿ 1946లో పొలాండ్ కూడా బ్యాచిలర్ పన్ను విధించింది. దేశంలో జనాభా పెంచాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోకుండా, పిల్లలు కనకుండా ఉన్న జంటల నుంచి ఈ ట్యాక్స్ వసూలు చేసేది.
⦿ 1941-1992 మధ్య కాలంలో సోవియెట్ యూనియన్ సైతం.. ఈ ట్యాక్స్‌ను వసూలు చేసింది. 25 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సు గల బ్యాచిలర్స్‌కు ఈ ట్యాక్స్ విధించేవారు. పెళ్లి చేసుకుని, పిల్లలు కనేలా చేయడమే ఈ ట్యాక్స్ ముఖ్య ఉద్దేశం.
⦿ 1900 సంవత్సరంలో అర్జెంటీనాలో కూడా ‘బ్యాచిలర్ ట్యాక్స్’ అమల్లో ఉండేది. అయితే, పెళ్లి చేసుకోడానికి సిద్ధమైనా.. స్త్రీలు తమని పెళ్లి చేసుకోకుండా తిరస్కరించారని నిరూపిస్తే.. ఈ పన్ను నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో అక్కడ కొంతమంది దీన్ని వృత్తిగా మలుచుకున్నారు. పెళ్లికి తిరస్కరించామని అధికారులకు చెప్పేందుకు ఆ మహిళలు.. పురుషుల నుంచి డబ్బులు వసూళ్లు చేసేవారు. ఆ రూల్ వల్ల అమ్మాయిలు భారీగానే సంపాదించారట అప్పట్లో.
Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ కింద చర్యలు తీసుకోబడతాయి.
Also Read: 70 రోజులు.. స్నేహితుల శవాలను తిని ఆకలి తీర్చుకున్న రగ్బీ టీమ్