(Source: ECI/ABP News/ABP Majha)
Mysore Bonda Recipe : మైసూర్ బోండా, కొబ్బరి చట్నీ డెడ్లీ కాంబినేషన్.. మీరు ట్రై చేశారా?
Tasty Breakfast : ఉదయాన్నే టేస్టీగా ఏమైనా తినాలనుకుంటే మైసూర్ బోండాలను కొబ్బరి చట్నీతో తినండి. దీని కాంబినేషన్ మీకు నెక్స్ట్ లెవెల్ టేస్ట్‌ని అందిస్తుంది. వీటిని తయారు చేసుకోవడం కూడా సులభమే.
Mysore Bonda Coconut Chutney Recipes : మైసూర్ బోండాను సరిగ్గా చేయకుంటే వాటిని నిజమైన రుచిని ఆస్వాదించలేము. కాబట్టి వాటిని తయారు చేసేప్పుడు కచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. పిండిని కలిపే విధానంపైనే బొండాల టేస్ట్ ఆధారపడి ఉంటుంది. అయితే మైసూర్ బోండాలు టేస్టీగా రావాలంటే ఏ రెసిపీని ఫాలో అయితే మంచిదో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
పెరుగు - 1 గ్లాస్
నీళ్లు - 1 గ్లాస్
మైదా పిండి - గ్లాస్న్నర
జీలకర్ర - 1 స్పూన్
ఉప్పు - తగినంత
వంట సోడా - 1 చెంచా
నూనె - వంటకి తగినంత
తయారీ విధానం
ముందు మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మట్టికుండ తీసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు దానిలో ఓ గ్లాస్ పెరుగు.. మరో గ్లాస్ నీళ్లు వేసి బాగా కలపండి. దానిలో జీలకర్ర, ఉప్పు, మూడు స్పూన్ల నూనె వేయండి. అనంతరం మైదా పిండిని దానిలో వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. పైన మరో స్పూన్ నూనె వేసి.. పిండిని కలపకుండా మూత వేసి పక్కన పెట్టేయండి. రెండు లేదా మూడు గంటలు పిండిని అలా నాననిస్తే బోండాలు చాలా రుచిగా వస్తాయి. పిండిని నానిన తర్వాత దానిలో వంట సోడా వేసి బాగా కలపాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి.. డీప్ ఫ్రైకి తగినంత నూనెను వేయాలి. నూనె వేడిఅయ్యాక స్టౌవ్ మంటను చిన్నగా చేసుకుని దానిలో బోండాలు వేయాలి. పిండిని ముద్దలుగా తీసుకుని.. బొటనవేలు.. చూపుడు వేలు మధ్యలోనుంచి పిండిని నూనెలో వేస్తే బోండాలు మంచి షేప్‌లో వస్తాయి. పిండి వేసే ముందు నూనె కచ్చితంగా వేడిగా ఉండాలి. లేదంటే బోండాలు నూనెను పీల్చుకుంటాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు బోండాలను ముదురు గోధుమరంగులో.. స్టౌవ్ చిన్న మంట మీద ఉంచి వేయించుకోవాలి. అప్పుడే బోండాలు లోపల కూడా ఉడుకుతాయి. వేగిన బోండాలను బయటకు తీసుకుని కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది.
కొబ్బరి చట్నీ తయారీ కోసం
కొబ్బరి - 1 కాయ
పచ్చిమిర్చి - 15
కరివేపాకు - 4 రెబ్బలు
జీలకర్ర - 1 స్పూన్
నూనె - 3 స్పూన్లు
పోపు గింజలు - 1 స్పూన్
ఎండు మిర్చి - 2
కరివేపాకు - 1 రెబ్బ
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో 2 స్పూన్ల నూనె వేయండి. అది వేడి అయ్యాక దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. అవి కాస్త రోస్ట్ అయ్యాక జీలకర్ర వేయండి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి.. కొబ్బరి కాయను పగల గొట్టి కొబ్బరిని బయటకు తీయండి. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని.. ఆ ముక్కలను మిక్సీ చేయండి. ఇప్పుడు దానిలో ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు మిశ్రమాన్ని వేసి.. మిక్సీ చేయండి. చట్నీ మాదిరిగా వచ్చేందుకు కొంచెం నీటిని కూడా వేసుకోండి. మిక్సీ చేసుకున్న కొబ్బరి పచ్చడిలో తాళింపు పోపు వేసి బాగా కలిపేయండి. అంతే టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ. బోండాలు, కొబ్బరి చట్నీ కలిపి తింటే దాని రుచే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది.
Also Read : బరువు తగ్గడంలో హెల్ప్ చేసే వోట్మీల్ డ్రింక్.. రెండు నెలల్లో 20 కిలోలు తగ్గవచ్చట!