Kandi Pachadi Recipe : టేస్టీ, హెల్తీ ఆంధ్రా స్టైల్ కందిపచ్చడి.. నెయ్యి వేసుకుని తింటే ప్లేట్మీల్స్ ఈజీగా లాగించేస్తారు
Kandi Pachadi : భోజనానికి ముందు కొందరు కందిపొడి వేసుకుని తమ భోజనం స్టార్ట్ చేస్తారు. అయితే నోటికి రుచిగా ఉండే కందిపచ్చడి గురించి ఎప్పుడైనా తిన్నారా? టేస్టీగా కావాలంటే ఈ రెసిపీని ఫాలో అయిపోవాలి.
Andhra Kandi Pachadi : దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన వంట ఆంధ్రా స్టైల్ కంది పచ్చడి అని తెలిపారు. సాధారణంగా కందిపొడి ఎక్కువగా చేసుకుంటారు. కానీ కందిపచ్చడి కూడా మీకు మంచి రుచిని, ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రా స్టైల్లో చేసుకునే కందిపచ్చడి మీకు మంచి రుచిని ఇస్తుంది. దీనిని మీరు అన్నంలో, వివిధ అల్పాహారాల్లో కలిపి తీసుకోవచ్చు. మరి ఈ టేస్టీ, హెల్తీ కందిపచ్చడిని ఏవిధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
కందిపప్పు - అర కప్పు
జీలకర్ర - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 4
వెల్లుల్లి రెబ్బలు - 4
ఉల్లిపాయ - 1 పెద్దది
కరివేపాకు - 1 రెబ్బ
ధనియాలు - 1 టీస్పూన్
టమోటా - 1
చింతపండు - 10 గ్రాములు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
తాళింపు కోసం..
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - 1 స్పూన్
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
నూనె - 1 స్పూన్
తయారీ విధానం
ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు తురిమి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను తీసి రెడీ చేసుకోండి. ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టండి. దానిలో కాస్త నూనె వేసి.. వేడికానివ్వండి. దానిలో కందిపప్పు వేసి వేయిచండి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో ఎండుమిర్చి వేయండి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో మినపప్పు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగితే దానిని నుంచి మంచి అరోమా వస్తుంది. వేగిన కందిపప్పును చల్లారనివ్వాలి. ఇప్పుడు దానిని మిక్సీ జార్లోకి తీసుకుని.. పొడి చేసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. కాస్త నూనె వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగిన అనంతరం దానిలో టోమాటో ముక్కలు వేసి.. ఫ్రై చేసుకోవాలి. టోమాటోలు మగ్గిన తర్వాత దానిలో చింతపండు వేసుకోవాలి. వాటిని కూడా చల్లార్చి మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలి. దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న కంది పొడి వేసుకుని మరోసారి మిక్సీ చేసుకోవాలి. అయితే దీనిని ఇప్పుడు చిన్నకడాయి పెట్టుకుని తాళింపు కోసం నూనె వేసుకోవాలి. దానిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశెనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
ఈ తాళింపును కందిపచ్చడిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తాళింపులో మినపపప్పు, పచ్చిశెనగపప్పు ఫ్రై చేసుకుని అవి కరకరలాడేలా ఫ్రై చేసుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా మంచిది. రుచిలో కూడా కందిపచ్చడి మించినదేది లేదు అనే రేంజ్లో దీని టేస్ట్ ఉంటుంది. దీనిని మీరు దోశలు, ఇడ్లీలలో కూడా వేసుకుని హాయిగా లాగించేసుకోవచ్చు. ఈ పచ్చడిని బాగా మెత్తగా కాకుండా.. బరకగా ఉండేలా చేసుకోవాలి. అప్పుడే దీనిని మీరు రుచిని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.
కందిపచ్చడితో కేవలం రుచిమాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అందుకే దీనిని చాలామంది ఇష్టంగా తింటారు. అలాంటివారిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఒకరు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఆయన తనకి కందిపచ్చడి అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రా స్టైల్లో చేసే కందిపచ్చడి ఉంటే చాలని ఇష్టమని.. దానిలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉందంటూ తెలిపారు. మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయ్యి.. ఆంధ్రా స్టైల్లో కందిపచ్చడి చేసుకుని ఇంటిల్లిపాదీ లాగించేయండి. మధుమేహమున్నవారు కూడా దీనిని హాయిగా లాగించేయవచ్చు.
Also Read : తెలంగాణ స్టైల్ బగారా రైస్.. ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ.. ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అంతే