Saggubiyyam Punugulu : టేస్టీ, క్రిస్పీ పునుగుల రెసిపీ.. సగ్గుబియ్యంతో ఇలా చేస్తే రుచిగా ఉంటాయి
Tasty Food Recipe : సగ్గుబియ్యంతో పాయాసం, జావానే కాకుండా.. టేస్టీగా పునుగులు కూడా చేసుకోవచ్చు. ఇవి బయట దొరకవు కాబట్టి.. ఇంట్లోనే వీటిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Saggubiyyam Punugulu Recipe : మీకు సగ్గుబియ్యంతో ఏదైనా టేస్టీగా, కాస్త స్పైసీగా, క్రిస్పీగా ఉండే వంట చేయాలనుకుంటే మీరు సగ్గుబియ్యం పునుగుల చేసేయొచ్చు. దీనిని నానబెట్టడానికి కొంత సమయం పడుతుంది కానీ.. తయారీ విధానం చాలా సింపుల్. దీనిలోని పులుపు, కారం, క్రంచీనెస్ మీకు రుచిని మరింత ఎక్కువ చేస్తాయి. అయితే ఈ డిష్ చేస్తున్నప్పుడు కొన్ని చిట్కాలు కచ్చితంగా ఫాలో అవ్వాలి. లేదంటే వాటి రుచిలో మార్పు వచ్చేస్తుంది. ఇంతకీ ఈ పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? వాటిని ఎలా తయారు చేయాలి? ఎలా చేస్తే రుచిగా వస్తాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
సగ్గు బియ్యం - ముప్పావు కప్పు
పెరుగు - 1 కప్పు
నీరు - అరకప్పు
ఉప్పు - రుచికి తగినంత
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 3
జీలకర్ర - అర టేబుల్ స్పూన్
అల్లం - అంగుళం
కొత్తిమీర - 1 కట్ట
తయారీ విధానం
ముందుగా సగ్గుబియ్యంని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. దానిలో పెరుగు, అరకప్పు నీళ్లు వేసి బాగా కలపి ఓ 5 గంటలు నాననివ్వండి. సగ్గుబియ్యం సైజు పెద్దగా ఉంటే పునుగులు బాగా వస్తాయి. అయితే పెరుగు పుల్లనిది అయితే రుచి చాలా బాగుంటుంది. పెరుగు పుల్లగా లేకపోతే.. సగ్గుబియ్యం, పెరుగు వేసినప్పుడు ఓ రెండు చెంచాల నిమ్మరసం కూడా వేసి బాగా కలిపి.. ఓ 5 గంటలు పక్కన పెట్టండి. దీనివల్ల సగ్గుబియ్యం మృదువుగా మారుతుంది. 5 గంటల తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరను బాగా కడిగి.. సన్నగా తురిమి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో కొత్తమీర తరుగు, ఉప్పు, పచ్చిమిర్చి తరగు, ఉల్లిపాయల ముక్కలు, జీలకర్ర, బియ్యం పిండి, అల్లం తరుగు వేసి వాటిని బాగా కలపాలి. దీనిలో ముందే నీరు వేసి కలపకూడదు. దీనివల్ల మిశ్రమంలో నీరు ఎక్కువయ్యే ప్రమాదముంది. నీరు ఎక్కువైతే.. పునుగులు నూనెను ఎక్కువ లాగేస్తాయి. నానబెట్టిన సగ్గుబియ్యంలో కాస్త నీరు ఉంటుంది కాబట్టి.. ముందుగా నీరు లేకుండానే పిండిని కలుపుకోవాలి.
అనంతరం కొద్దిగా కొద్దిగా నీరు వేస్తూ పిండిని పునుగుల వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. అయితే నీరు ఎక్కువైనా పర్లేదు బియ్యం పిండి వేసి కలిపేద్దాం అనుకుంటే మంచి రుచి రాదు. ఈ కొలతలకు ఇలా చేస్తే రుచి బాగుంటుంది. అలా అని పిండిని లూజ్‌గా ఉంచి వేయించుకుంటే.. నూనెను ఎక్కువ పీల్చేస్తాయి. కాబట్టి పునుగుల రుచి అంతా మీరు పిండిని కలుపుకోవడంపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయండి.
సగ్గుబియ్యం పునుగులు వేసేప్పుడు ముందు నూనెను బాగా వేడికానివ్వాలి. ఇప్పుడు మంటను తగ్గించి.. దానిలో పునుగులు వేయాలి. వేసిన అనంతరం.. దానిని మీడియం మంటగా మార్చాలి. అప్పుడే పునుగులు బాగా ఉడుకుతాయి. సగ్గుబియ్యం కాస్త ఉబ్బి క్రిస్పీగా, గోధుమరంగులో కనిపిస్తున్నప్పుడు నూనె నుంచి బయటకు తీసేయాలి. సగ్గుబియ్యం క్రిస్పీగా కనిపిస్తే.. పునుగులు బాగా వచ్చాయని అర్థం. వీటిని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా వీటిని బాగా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా, లోపల స్మూత్‌గా ఉండే ఈ టేస్టీ పునుగులను మీరు నచ్చిన చట్నీతో లేదా వేడి వేడి ఛాయ్‌తో లాగించేయవచ్చు.
Also Read : దాల్చిన చెక్క టీని ఇలా తాగితే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది.. మరెన్నో బెనిఫిట్స్ కూడా