Sweet Recipe: పిల్లలకు నచ్చేలా పాలబూరెలు, చిటికెలో చేసేయండిలా
ఇంట్లో చేసుకునే సింపుల్ స్వీట్ రెసిపీ పాల బూరెలు.
ఇంట్లో పిల్లలు తినడానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. నిత్యం కొని పెట్టడమంటే కష్టం కాబట్టి ఇలా పాలబూరెలు చేసి పెడితే రుచికి రుచి పైగా ఆరోగ్యం కూడా. వీటిని ఒక్కసారి చేస్తే వారం రోజులు తాజాగా ఉంటాయి. వీటిని తయారుచేయడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.
కావాల్సిన పదార్థాలు
బియ్యం పిండి - ఒక కప్పు
బెల్లం తురుము - ఒక కప్పు
కాచి చల్లార్చిన పాలు - ఒక కప్పు
పచ్చి కొబ్బరి - పావు కప్పు
నూనె - డీప్ ఫ్రైకు సరిపడా
ఉప్పు - అర స్పూను
తయారీ ఇలా
1. పొడి బియ్యం పిండితోనే పాల బూరెలు చేసుకోవచ్చు. అరిసెల్లా కనిపిస్తున్నాయి కాబట్టి తడి బియ్యం పిండేమో అనుకుంటారు చాలా మంది.
2. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి బెల్లాన్ని కరిగించాలి. కాస్త నీళ్లు పోస్తే బాగా కరుగుతుంది.
3. బెల్లం కరిగి మరీ చిక్కగా కాకుండా, అలాగే నీళ్లలా కాకుండా మధ్యస్థంగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేయాలి.
4. ఇప్పుడు గిన్నెలో బియ్యం పిండిని, పచ్చి కొబ్బరిని , ఉప్పును వేసి బాగా కలపాలి.
5. కాచి చల్లార్చిన పాలను వేస్తూ బాగా కలపాలి.
6. తరువాత బెల్లం పాకాన్ని పిండిలో వేసి బాగా కలపాలి.
7. పిండి ఉండల్లేకుండా కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా, అలాగని జారుగా కాకుండా కలుపుకోవాలి.
8. పదినిమిషాల పాటూ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
9. ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి.
10. నూనె వేడెక్కాక గరిటెతో పిండి తీసుకుని ఒక చోట వేయాలి. అది గుండ్రంగా పొంగడంలా తయారవుతుంది.
11. వేయించాక తీసి పక్కన పెట్టుకుంటే పాలబూరెలు రెడీ అయినట్టే.
ఇవి తీయగా ఉంటాయి కాబట్టి పిల్లలకు బాగా నచ్చుతాయి.
ఇందులో మనం వాడినవన్నీ బలవర్ధకమైన పోషకాలను అందించే పదార్థాలే. ముఖ్యంగా బెల్లం, పాల గురించే చెప్పుకోవాలి. బెల్లం తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. రోజుకో చిన్న బెల్లం ముక్క చప్పరిస్తే చాలు కొన్ని రోజులకే మలబద్ధకం సమస్య తీరిపోతుంది. అలాగే రక్తహీనత సమస్య కూడా పోతుంది. అంతేకాదు కాలేయం సమస్యలకు కూడా బెల్లంలోని పోషకాలు చెక్ పెడతాయి. విష పదార్థాలను బయటికి పంపిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం పోషకాలు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది.
బెల్లాన్ని తినడం వల్ల మహిళలకు నెలసరి సమయంలో వచ్చే చాలా సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే బెల్లం తినడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇది హ్యాపీ హార్మోన్. శరీరాన్ని, మనసును ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉంచుతుంది. దీనిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. పేగులకు ఎంతో బలాన్ని అందిస్తుంది. దీన్ని శరీరాన్ని చల్లబరిచే గుణం బెల్లానికి ఉంటుంది. హైబీపీ సమస్య ఉన్నవారికి కూడా ఇది ఎంతో మంచిది.
ఇక పాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పిల్లలకు శక్తినిచ్చే ఆహారాల్లో పాలు ముందుంటాయి. దంతాలకు, ఎముకల బలానికి పాలు చాలా అవసరం. దీనిలో ఫాస్పరస్, విటమిన్ డి వంటివి అందుతాయి.
Also read: గర్భం ధరించాక శృంగారం సురక్షితమేనా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Also read: మెరిసే చర్మం కోసం రోజూ వీటిని తాగండి చాలు, మెరిసే రంగు రూపం సొంతమైపోతుంది