Stealth Omicron:స్టెల్త్ ఒమిక్రాన్ భారతదేశంలో మరొక వేవ్‌కు కారణం కావచ్చు, చెబుతున్న ఏపీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్
కరోనా ఇంకా వదిలిపోలేదు. స్టెల్త్ ఒమిక్రాన్ రూపంలో చెలరేగిపోవడానికి సిద్ధంగా ఉంది.
మొన్నటి వరకు ఒమిక్రాన్ చెలరేగిపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. మళ్లీ పిల్లలు స్కూలుకి వెళుతున్నారు, త్వరలో ఐటీ ఆఫీసులు కూడా పూర్తిస్థాయిలో మొదలవ్వబోతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ కోవిడ్ నాలుగో వేవ్ రాబోతోందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.విజవాడలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎమ్ఏ) దేశ ప్రజలనుద్దేశించి ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అందులో ఒమిక్రాన్ కంటే స్టెల్త్ ఒమిక్రాన్ జోరుగా వ్యాపిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుతోందని చెప్పింది. ప్రస్తుతం తగ్గిన కేసులను చూసి కరోనా వైరస్‌ను తక్కువ అంచనా వేయొద్దని, అజాగ్రత్తగా ఉండొద్దని ప్రజలను కోరింది. మాస్కులు ధరించడం మానివేయొద్దని, శానిటైజర్లు వాడమని దేశప్రజలకు సూచిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ఏ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ‘ఒమిక్రాన్ కు చెందిన సబ్ వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్. ఇది ప్రత్యేకమైన సొంత మ్యుటేషన్లను కలిగి ఉంది. సాధారణమైన మ్యుటేషన్ BA.1. ఇది ప్రపంచమంతటా త్వరగా వ్యాపించింది. థర్డ్ వేవ్ కు ఇదే కారణమని చెప్పుకోవచ్చు. ఇప్పుడు BA.2 కూడా అంతకన్నా ఎక్కువ స్థాయిలో రెచ్చిపోయేస అవకాశాలు ఉన్నాయి. ఎపిడెమియాలజిస్టులు BA.2 భారీ స్థాయిలో వ్యాపించవచ్చని అనుమానిస్తున్నారు. అయితే కాస్త ఊరటినిచ్చే అంశం ఏంటంటే... BA.1తో పోలిస్తే BA.2 వల్ల ఆసుపత్రిలో చేరే అవకాశం తక్కువే కలుగుతుంది’ అని వివరించారు. BA.2గా పిలుస్తున్న స్టెల్త్ ఒమిక్రాన్ కొత్తగా కరోనా సోకిన వారిలో అధికంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి అప్పుడే ఈ వైరస్ తన వ్యాప్తిని మొదలుపెట్టేసింది.
చైనాపై దాడి
ప్రస్తుతం స్టెల్త్ ఒమిక్రాన్ చైనాను అల్లాడిస్తోంది. రూపం మార్చుకున్న ఒమిక్రాన్, స్టెల్త్ గా మారి డ్రాగన్ దేశానికి చుక్కలు చూపిస్తోంది. ఒక్కొక్కటిగా చైనా నగరాలు లాక్ డౌన్ బాట పట్టాయి. ప్రస్తుతం 13 ప్రధాన నగరాల్లో పూర్తిగా ఆంక్షలు విధించారు. దక్షిణ కొరియాలో సైతం కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. రోజుకు నాలుగు లక్షల కేసుల వరకు అక్కడ నమోదవుతున్నాయి. దీంతో మిగతాదేశాలు కూడా స్టెల్త్ ఒమిక్రాన్ ను చూసి భయపడుతున్నాయి. ఇండియాలో జూన్ సమయానికి నాలుగో వేవ్ వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. అందుకే మళ్లీ మాస్కులు, శానిటైజర్లతో ప్రజలు సిద్ధంగా ఉండాలి. పరిస్థితి ఇలాగే ఉంటే ఐటీ కంపెనీలు తెరుచుకునే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.
Also read: ముఖం కాలిపోయింది, గుండె జబ్బు వేధిస్తోంది, అయినా మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచి గెలిచింది
Also read: హోలీ రంగులు ముఖం, జుట్టుకు పట్టేశాయా? ఇలా చేస్తే ఇట్టే పోతాయి