Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Spine Surgery : వెన్నెముకకు సర్జరీ చేయించుకుంటే రోగి మొత్తానికి బెడ్‌కే పరిమితం అవుతాడని చాలామంది అనుకుంటారు. దీనిలో నిజమెంత? వైద్యులు ఇస్తోన్న సూచనలు ఏంటో తెలుసుకుందాం.

- వెన్నెముక శస్త్రచికిత్స అనంతర రికవరీ భయాలపై డాక్టర్ నాగరాజు స్పష్టం చేశారు.
- రోగి వయసు, ఆరోగ్యం, శస్త్రచికిత్స రకం రికవరీని ప్రభావితం చేస్తాయి.
- దీర్ఘకాల బెడ్‌రెస్ట్ అనవసరం; ఫిజియోథెరపీ అత్యవసరమని వైద్యులు చెప్పారు.
- వైద్యుల సలహాతో క్రమంగా సాధారణ జీవనశైలికి తిరిగి రావచ్చు.
Spine Surgery and Bed Rest : వెన్నెముకకు సంబంధించిన సమస్యలు తీవ్రమైనప్పుడు కొంతమందికి వైద్యుల సర్జరీని సిఫార్సు చేస్తారు. ఈ సర్జరీ పేరు వినగానే చాలామంది రోగుల్లో, వారి బంధువుల్లో కూడా ఒకరకమైన భయం మొదలవుతుంది. అదేంటంటే.. సర్జరీ తర్వాత పూర్తిగా బెడ్‌కే పరిమితం కావాలా? మళ్లీ సాధారణంగా నడవగలమా? అనే డౌట్ చాలామందికి వస్తుంది. అయితే స్పైన్ సర్జరీ తర్వాత రికవరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకుందాం.
సర్జరీ తర్వాత రోగి ఎంత త్వరగా సాధారణ జీవనశైలికి తిరిగి వస్తారనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ నాగరాజు తెలిపారు. హైదరాబాద్‌లోని అగస్త్య హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ స్పైన్ సర్జన్‌గా చేస్తోన్న డాక్టర్ నాగరాజు స్పైన్ సర్జరీ గురించిన పలు అపోహలకు చెక్ పెట్టారు. స్పైన్ సర్జరీ తర్వాత రికవరీ అనేది కేవలం రోగి వయసుపై మాత్రమే ఆధారపడి ఉండదని.. రోగి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వయసు, ఏ రకమైన స్పైన్ సర్జరీ చేశారు, సర్జరీని ఏ టెక్నిక్‌తో చేశారు అనే వివిధ అంశాలు రికవరీలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
Also Read : బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తోందా? శ్రద్ధ చూపించకుంటే ప్రమాదమే అంటోన్న నిపుణులు, ఎందుకంటే
రికవరీ ఎప్పుడు మొదలవుతుందంటే..
రోగి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వయసు, ఏ రకమైన సర్జరీ చేశారు? ఉపయోగించిన సర్జికల్ టెక్నిక్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. స్పైన్ సర్జరీని మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నిక్‌తో చేశారా? లేదా ఓపెన్ సర్జరీ చేశారా? అనేది కూడా రికవరీ వేగాన్ని ప్రభావితం చేయవచ్చని డాక్టర్ నాగరాజు తెలిపారు.
సర్జరీ తర్వాత బెడ్ రెస్ట్ అవసరమా?
ప్రతి స్పైన్ సర్జరీ తర్వాత రోగి చాలా రోజుల పాటు కదలకుండా బెడ్‌పై ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చని డాక్టర్ నాగరాజు తెలిపారు. సర్జరీ రకం, రోగి పరిస్థితిని బట్టి వైద్యులు కదలికలను ప్రారంభించే సమయాన్ని నిర్ణయిస్తారు. చాలా సందర్భాల్లో సర్జరీ పూర్తయిన అదే రోజు లేదా మరుసటి రోజు నుంచే రోగిని కదిలించే ప్రయత్నం చేస్తామన్నారు.
అయితే దీని అర్థం ప్రతి రోగి సర్జరీ జరిగిన వెంటనే నడవాలని కాదు. రోగి పరిస్థితిని పరిశీలించిన తర్వాతే వైద్యులు, ఫిజియోథెరపిస్టులు సూచించే విధంగానే కదలికలు ప్రారంభించాల్సి ఉంటుంది.
Also Read : బ్యాక్ పెయిన్ అంటూ లీవ్ అడిగాడు, పదినిమిషాల్లోనే చనిపోయాడు.. ఉద్యోగులు జాగ్రత్త
సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అవసరమా?
స్పైన్ సర్జరీ తర్వాత కేవలం ఆపరేషన్ విజయవంతం కావడం మాత్రమే కాకుండా.. తదుపరి రికవరీ కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ అవసరం కావచ్చు. వైద్యుల సూచనల మేరకు క్రమంగా వ్యాయామాలు, కదలికలు ప్రారంభించడం వల్ల రోగి తన సాధారణ కార్యకలాపాలకు తిరిగి రావడం జరుగుతుంది. రోగి పరిస్థితిని బట్టి ఫిజియోథెరపీ ప్రణాళిక కూడా మారుతుంది.
ఎప్పుడు కోలుకుంటారంటే..
స్పైన్ సర్జరీ చేయించుకున్న ప్రతి రోగి ఒకే సమయంలో సాధారణ స్థితికి వస్తారని చెప్పలేం. కొంతమంది త్వరగా కోలుకోవచ్చు. మరికొందరికి ఎక్కువ సమయం పట్టవచ్చని డాక్టర్ నాగరాజు వెల్లడించారు. వయసు, సర్జరీకి ముందు ఉన్న ఆరోగ్య పరిస్థితి, వెన్నెముక సమస్య తీవ్రత, సర్జరీ రకం, సర్జరీ తర్వాత రిహాబిలిటేషన్, ఇతర ఆరోగ్య సమస్యలు వంటివి కోలుకోవడంలో హెల్ప్ చేస్తాయి.
Also Read : 40 ఏళ్ల తర్వాత మహిళల్లో నడుము నొప్పి ఎందుకు పెరుగుతుంది.. ఈ నివారణ చిట్కాలు ట్రై చేయండి
సర్జరీ తర్వాత చేయాల్సిన పనులు..
స్పైన్ సర్జరీ తర్వాత రోగులు సొంతంగా వ్యాయామాలు చేయడం లేదా ఇంటర్నెట్‌లో చూసిన ఎక్సర్‌సైజ్‌లను ప్రయత్నించడం మంచిది కాదు. సర్జరీ చేసిన స్పైన్ సర్జన్, ఫిజియోథెరపిస్ట్ సూచనలను పాటించాలి. అలాగే సర్జరీ తర్వాత ఎంతకాలం విశ్రాంతి తీసుకోవాలి, ఎప్పుడు నడవాలి, ఏ వ్యాయామాలు చేయాలి, ఎప్పుడు పనులకు తిరిగి వెళ్లాలి వంటి విషయాలను వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు నిర్ణయిస్తారు.
స్పైన్ సర్జరీ అంటే జీవితాంతం బెడ్‌పైనే ఉండాల్సిందే అనే అపోహతో చాలామంది ఉంటారు కానీ.. సరైన చికిత్స, తగిన సర్జికల్ టెక్నిక్, వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ ఉంటే రోగులు క్రమంగా సాధారణ జీవనశైలికి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సర్జరీ ముందు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా డాక్టర్ని అడిగి వాటిని క్లియర్ చేసుకోండి.
Also Read : పిల్లల స్కూల్ బ్యాగులు మరీ బరువుగా ఉన్నాయా? వెన్నెముక ఆరోగ్యంపై పడే ప్రభావం ఇదే.. వైద్యుల హెచ్చరికలు
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















