Sperm Quality : పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
Sperm Quality and Male Fertility : పిల్లలు కలగడం ఆలస్యమవుతుంటే మహిళల్లోనే సమస్య ఉంటుందని అనుకోవడం పొరపాటు. పురుషుల స్పెర్మ్ నాణ్యత కూడా సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది.

- సంతానోత్పత్తికి స్పెర్మ్ నాణ్యత ముఖ్యం, అలవాట్లు ప్రభావితం చేస్తాయి.
- ధూమపానం, మద్యం, అధిక బరువు, ఒత్తిడి వీర్యం నాణ్యతను తగ్గిస్తాయి.
- శారీరక శ్రమ లేమి, అధిక వేడి, రసాయనాలు ప్రతికూల ప్రభావం చూపుతాయి.
- సంతానం కలగకపోతే వైద్యులను సంప్రదించి వీర్య పరీక్ష చేయించాలి.
Lifestyle Habits Affect Sperm Health : పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం కేవలం స్పెర్మ్ కౌంట్‌పై మాత్రమే ఆధారపడి ఉండదు. వీర్యకణాల కదలిక, ఆకారం, డీఎన్ఏ నాణ్యత కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ధూమపానం, మద్యం, అధిక బరువు, సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి వంటి రోజువారీ అలవాట్లు స్పెర్మ్ నాణ్యతపై ప్రభావం చూపవచ్చని వైద్యులు చెప్తున్నారు. మరి ఏయే అలవాట్లు పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయో? వాటిని ఎలా మార్చుకోవాలో.. వైద్యులు ఇచ్చే సూచనలు ఏంటో తెలుసుకుందాం.
హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, మినిమల్లీ ఇన్వేసివ్ యూరాలజిస్ట్, ఆంకాలజిస్ట్, లేజర్, లాపరోస్కోపిక్ అండ్ రోబోటిక్ యూరాలజిస్ట్గా చేస్తోన్న డాక్టర్ ఎం. గోపిచంద్ స్పెర్మ్ నాణ్యత గురించి మగవారు తెలుసుకోవాల్సిన విషయాలపై పలు విషయాలు చర్చించారు.
Also Read : ప్రపంచవ్యాప్తంగా మగవారిలో వేగంగా తగ్గుతోన్న స్పెర్మ్ కౌంట్.. ఈ అపోహలే ప్రధాన కారణమంటోన్న నిపుణులు
స్పెర్మ్ నాణ్యతను ఎలా అంచనా వేస్తారు?
పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి స్పెర్మ్ కౌంట్‌తో పాటు మరికొన్ని అంశాలను పరిశీలిస్తామని డాక్టర్ గోపిచంద్ తెలిపారు. వీర్యంలో ఉండే స్పెర్మ్ సంఖ్యను స్పెర్మ్ కౌంట్ అంటారు. అవి ఎంత చురుగ్గా కదులుతున్నాయో తెలిపేది మోటిలిటీ. స్పెర్మ్ ఆకారం, నిర్మాణాన్ని మోర్ఫాలజీ అంటారు. వీటితో పాటు స్పెర్మ్ డీఎన్ఏ నాణ్యతను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. అయితే స్పెర్మ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేసే అలవాట్లు ఏంటో చూసేద్దాం.

ధూమపానం
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల్లో ఉండే హానికర రసాయనాలు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతాయి. దీనివల్ల స్పెర్మ్ డీఎన్ఏ దెబ్బతినే అవకాశం ఉంటుంది. స్పెర్మ్ సంఖ్య, కదలిక, నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు ధూమపానానికి దూరంగా ఉండాలి.
Also Read : రైస్ తింటే షుగర్ రావడంతో పాటు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందా? మిల్లెట్స్ బెటరా? నిపుణులు ఏమంటున్నారంటే
అధికంగా మద్యం
తరచుగా ఎక్కువ మొత్తంలో మద్యం తాగడం వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయులు ప్రభావితమవుతాయి. అంతేకాదు వీర్య నాణ్యత, స్పెర్మ్ ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలంగా అధికంగా మద్యం తీసుకునే అలవాటు ఉంటే దాన్ని తగ్గించడం లేదా మానేయడం మంచిది.
అధిక బరువు, అన్‌హెల్తీ ఫుడ్
అధిక బరువు, ఊబకాయం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినవచ్చు. ఇన్‌ఫ్లమేషన్ కూడా పెరిగి స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరోవైపు పోషకాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా పునరుత్పత్తి ఆరోగ్యానికి మంచిది కాదు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్, విత్తనాలు, తగినంత ప్రోటీన్ ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి.
Also Read : మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి జిమ్ కూడా ఓ కారణమేనా? అధ్యయనంలోని షాకింగ్ విషయాలు ఇవే
శారీరక శ్రమ లేకపోవడం
వ్యాయామం చేయకపోవడం వల్ల బరువు పెరగడం, జీవక్రియ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపవచ్చు. క్రమం తప్పకుండా మితమైన వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరమైన బరువును కొనసాగించవచ్చు. అయితే సరైన ఆహారం, విశ్రాంతి లేకుండా అతిగా వ్యాయామం చేయడం కూడా మంచిది కాదు. ఇది పునరుత్పత్తి హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

ఒత్తిడి, నిద్రలేమి
ఎక్కువకాలం ఒత్తిడికి గురవడం వల్ల పునరుత్పత్తి హార్మోన్ల పనితీరు ప్రభావితమవుతుంది. అలాగే సరైన నిద్ర లేకపోవడం కూడా హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీయవచ్చు. దీనివల్ల స్పెర్మ్ నాణ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకునే అలవాట్లు పెంచుకోవడం ముఖ్యం.
Also Read : తేనెను ఇలా తీసుకుంటే హెల్త్‌కి ఎన్నో బెనిఫిట్స్.. స్పెర్మ్ కౌంట్, అంగస్తంభన సమస్యలుంటే మగవారు అలా తీసుకోవాలి
అధిక వేడి, కెమికల్స్ ఎఫెక్ట్
వృషణాల ఉష్ణోగ్రత సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది. స్పెర్మ్ ఉత్పత్తికి ఇది అవసరం. తరచుగా అధిక వేడికి గురికావడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి, నాణ్యత ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని పరిశ్రమల్లో పనిచేసేవారు పురుగుమందులు, పారిశ్రామిక రసాయనాలు, భారీ లోహాల వంటి వాటికి గురికావచ్చు. ఇవి కూడా స్పెర్మ్ కదలిక, డీఎన్ఏ నాణ్యతపై ప్రభావం చూపవచ్చు. ఇలాంటి వృత్తుల్లో పనిచేసేవారు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి.
Also Read : బీపీ ఎక్కువ, తక్కువ ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా.. లైంగిక కోరికను పెంచే ట్యాబ్లెట్స్ వాడకూడదా?
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలంటే..
డాక్టర్ గోపిచంద్ ప్రకారం జీవనశైలి మార్పులు స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. అయితే వాటి ఫలితాలు వెంటనే కనిపించవు. స్పెర్మ్ ఉత్పత్తి ప్రక్రియకు సుమారు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. అందువల్ల ఆహారం, వ్యాయామం, నిద్ర వంటి అలవాట్లలో మార్పులు చేసినా వాటి ప్రభావం కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు.
అలాగే పురుషుల్లో సంతానలేమికి జీవనశైలి అలవాట్లే కారణం కావని.. హార్మోన్ల సమస్యలు, ఇన్ఫెక్షన్లు, వరికోసీల్, జన్యుపరమైన సమస్యలు కూడా స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తాయని తెలిపారు. అందువల్ల గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకపోతే కేవలం జీవనశైలి మార్పులపైనే ఆధారపడకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. అవసరమైతే వీర్య పరీక్ష చేయించుకోవాలని తెలిపారు.
Also Read : యువకుల్లో ఒత్తిడి పెరిగితే స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుందా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























