Smart Phone Effect: ఫోన్ అతిగా చూస్తే ఆయుష్షు ఫట్! 34 ఏళ్లు వృథా చేస్తున్నారట: తాజా స్టడీ వెల్లడి
స్మార్ట్ ఫోన్లను అతిగా చూడటం ఆరోగ్యానికి మంచిది కాదని ఎన్నో అధ్యయనాలు ఇప్పటికే చెప్పాయి. తాజా స్టడీ దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి మరిన్ని షాకింగ్ విషయాలు చెప్పింది.
ఈ రోజుల్లో మనం కుటుంబంతో కంటే స్మార్ట్‌ఫోన్‌తోనే ఎక్కువ సేపు గడిపేస్తున్నాం. కుటుంబం లేదా ఫ్రెండ్స్‌తో నేరుగా చర్చించాల్సిన విషయాలను కూడా ఫోన్లేనే కానిస్తున్నాం. తిన్నప్పుడు ఫోన్, పడుకున్నప్పుడు ఫోన్, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫోన్, చివరికి.. టాయిలెట్‌లో కూడా ఫోన్. ఇలా ఫోన్లతోనే సగం జీవితాన్ని గడిపేస్తే.. చివరికి ఎన్నేళ్లు బతుకుతామో కూడా చెప్పలేమని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేసున్నారు.
ఓ తాజా స్టడీ ప్రకారం.. మీరు ఫోన్‌తో గడిపే సమయం.. మీరు ఎంత కాలం జీవిస్తారనే దానిపై ప్రభావం చూపుతుందని తెలిపింది. మీ ఫోన్‌లో ఎక్కువ సమయం స్క్రోలింగ్ చేయడం వల్ల మీ జీవితకాలం క్రమేనా తగ్గిపోతుందని అంటున్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో 34 సంవత్సరాలకు సమానమైన సమయాన్ని ఫోన్ స్క్రీన్‌ల వైపు చూస్తూ గడిపేస్తారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంటే, మీరు ఫోన్ చూసే సమయాన్ని మీ జీవితం కాలంతో లెక్కిస్తే.. 34 ఏళ్లు మీరు మిస్ అవుతున్నట్లు లెక్క. అయితే, ఇది టెక్నికల్‌గా మాత్రమే. వాస్తవానికి ఫోన్‌ను చూడటం ఇంకా చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ ఫోన్ మీ ఆయుష్సును స్లో పాయిజన్‌లా హరిస్తుంది.
బక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ (Buck Institute for Research) నిర్వహించిన అధ్యయనంలో ఒక వ్యక్తి కళ్లపై ఫోన్ నుంచి లేదా టీవీల నుంచి పడే కాంతి.. వారి జీవితంపై ఎంత ప్రభావం చూపుతుందనేది తెలుసుకున్నారు. ఇందుకు శాస్త్రవేత్తలు ఫ్రూట్ ఫ్లైస్‌ను ఉపయోగించారు. ఎందుకంటే ఇవి.. మానవులకు సమానమైన జీవ ప్రక్రియలను కలిగి ఉంటుంది. ఈ అధ్యయంలో పాల్గొన్న డాక్టర్ బ్రియాన్ హాట్జ్ మాట్లాడుతూ.. ‘‘ఫోన్ల నుంచి వెలువడే కాంతి.. కంటి జీవిత కాలాన్ని నేరుగా నియంత్రిస్తుంది.
మన శీరరం 24 గంటలపాటు ‘కనెక్షన్ సిర్కాడియన్ రిథమ్’లపై ఆధారపడి ఉంటుంది. సిర్కాడియన్ రిథమ్‌లు సూర్యోదయం, అస్తమయం సమయంలోని కాంతి, ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఒక రోజులో శారీరక విధులను నియంత్రిస్తాయి. పగటి వెలుతురుపై ఆధారపడి మనకు నిద్ర, ఆకలి లేదా మేల్కొలపడానికి ఉపయోగపడే హార్మోన్లను నియంత్రిస్తాయి. టీవీ చూడటం లేదా షిఫ్టులలో పని చేయడం ద్వారా రాత్రి సమయంలో కాంతికి గురికావడం వంటి కారణాల వల్ల ఈ ‘రిథమ్స్’ అదుపు తప్పుతాయి.
పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. కళ్లకు ఎక్కువ కాంతి బహిర్గతం కావడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సీనియర్ రచయిత ప్రొఫెసర్ పంకజ్ కపాహి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. “కంప్యూటర్, ఫోన్ స్క్రీన్‌ల వైపు చూడటం, రాత్రిపూట కాంతి కాలుష్యానికి గురికావడం సిర్కాడియన్ రిథమ్‌లను చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితులు. ఇది కంటి రక్షణ వ్యవస్థను పాడు చేస్తుంది. అది కేవలం దృష్టి మీదే కాదు.. మిగిలిన శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. మెదడును దెబ్బతీస్తుంది’’ అని తెలిపారు.
ప్రయోగంలో భాగంగా పరిశోధకులు ఫ్రూట్ ఫ్లైకు ఆహారాన్ని పరిమితం చేశారు. ఈ సందర్భంగా వాటి సిర్కాడియన్ రిథమ్‌లలో గణనీయమైన మార్పులను చూశారు. సిర్కాడియన్ రిథమ్‌లపై ఏ జన్యువులు పనిచేస్తాయోనని పరిశీలించారు. అవన్నీ కంటి నుంచి వస్తున్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా కాంతికి ప్రతిస్పందించే కంటి రెటీనాలోని ప్రత్యేక న్యూరాన్లు ఫోటోరిసెప్టర్ల నుంచి కాంతికి స్పందిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కంటిలోని జన్యువులు జీవితకాలాన్ని ప్రభావితం చేస్తాయా? లేదా అని పరిశోధించారు.
కాంతి దానంతట అదే ఫోటోరిసెప్టర్ క్షీణతకు కారణమవుతుందని తెలుసుకుని పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఇది కంటి వాపుకు కారణమవుతుందని తెలుసుకున్నారు. కంటిపైనే కాకుండా ఇతర కణజాలాల్లో కూడా సమస్యలను కలిగిస్తుందని తెలుసుకున్నారు. వివిధ సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులను ఇది తీవ్రతరం చేస్తుందని పేర్కొన్నారు. అయితే, దీన్ని మానవులకు సమానమైన జీవ ప్రక్రియలను కలిగిన ఈగలపై ప్రయోగించారు. ఇది మనుషులకు ఎంతవరకు వర్తిస్తుందనేది నేరుగా తెలుసుకోలేదు. అయితే, మానవుల్లో వృద్ధాప్యంలో ఏర్పడే సమస్యలకు సిర్కాడియన్ రిథమ్ కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అంటే, ఫోన్లు, టీవీ స్క్రీన్స్ ఎక్కువ సేపు చూసేవారు.. రాత్రివేళల్లో ఎక్కువ కాంతికి గురయ్యేవారిలో సిర్కాడియన్ రిథమ్ సమస్య ఏర్పడవచ్చని స్పష్టమవుతుంది. వృద్ధాప్య వయస్సు రాకముందే.. ఫోన్ల వల్ల ఆ లక్షణాలు కనిపించే అవకాశాలున్నాయి. కాబట్టి, ఇప్పటికైనా ఫోన్, టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండండి. ఎక్కువ సమయం వాటితో గడపకండి.
Also Read: కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు సెక్స్ చేయాలట! నిపుణులు ఏం చెప్పారో చూడండి
Also Read: తగ్గేదేలే, కొత్త పెళ్లికొడుకు అత్యాశ ఫలితం, 20 రోజులుగా అంగస్తంభన, ఇక జీవితాంతం అంతేనట!
గమనిక: మీ అవగాహన కోసం అధ్యయనంలోని అంశాలను యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.