Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
Andhra : ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజీనామా చేసిన ముగ్గురు మళ్లీ అధికార పార్టీల తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు.
Andhra New Rajyasabha Members: ఆంద్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఏపీతోపాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్ హర్యానాలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇవన్నీ ఉపఎన్నికలే. కొంత మంది పదవులు వదులుకున్నారు.. మరికొంత మంది లోక్ సభ ఎంపీలుగా ఎన్నికయి రాజీనామాలు చేశారు. ఏపీ నుంచి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ , బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. వీరందరూ వైసీపీకి చెందిన వారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. మరో ఇద్దరు ఇంకా ఏ పార్టీలో చేరలేదు. అంటే ఈ ముగ్గురూ మళ్లీ రాజ్యసభ పదవులకు పోటీ చేసే అవకాశాలు లేనట్లే.
ఒక సీటు జనసేనకు ఖాయం !
ఎన్నికలు జరగనున్న మూడు రాజ్యసభ సీట్లలో కూటమి పార్టీల్లో ఒకటి అయిన జనసేనకు ఇవ్వడం ఖాయమని అనుకోవచ్చు. జనసేన పార్టీ తరపున నాగేంద్రబాబును ఎంపీగా పంపిస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో త్యాగం చేశారు. పొత్తుల్లో సీట్లు త్యాగం చేసిన వారికి అవకాశాలు కల్పిస్తున్నందున నాగబాబుకు ఎంపీ సీటు కాయమని జనసేన వర్గాలు కూడా భావిస్తున్నాయి.
Also Read: ఢిల్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను దించుతున్న బీజేపీ! కేజ్రీని ఢీకొట్టేందుకు క్రేజీ ప్లాన్
రెండు సీట్లు టీడీపీ నేతలకు !
మిగిలిన రెండు రాజ్యసభ సీట్లు టీడీపీ నేతలకే కేటాయించే అవకాశం ఉంది. వైసీపీకి ఒక్క స్థానంలో పోటీ చేసే బలం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. దేవినేని ఉమ, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడుతో పాటు పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు కూడా వినిపిస్తోంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా మరికొంత మంది సీనియర్లు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. చంద్రబాబు మనసులో ఏముందో స్పష్టత లేదు. రాజీనామా చేసిన వారు మళ్లీ పదవులకు ఎంపికయ్యే అవకాశాలు లేవు. మోపిదేవి టీడీపీలో చేరారు కానీ..తనకు ఢిల్లీకి వెళ్లే ఆసక్తి లేదని చెప్పారు. బీద మస్తాన్ రావు ఇంకా ఏ పార్టీలో చేరలేదు. ఆర్ కృష్ణయ్య కూడా అంతే.
మూడూ పూర్తి స్థాయి పదవి కాలం ఉన్న పదవులు కావు !
ఎన్నికలు జరుగుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు పూర్తి కాలం పదవి లేదు. ఒక రాజ్యసభ పదవికి కేవలం రెండేళ్లే చాన్స్ ఉంది . ఒక సభ్యుడి పదవి 2026, మరో ఇద్దరి పదవులు 2028కి పూర్తవుతాయి. అయితే ఇప్పుడు ఎన్నికయ్యే వారికి ద్వైవార్షిక ఎన్నికల సమయంలో టీడీపీ హైకమాండ్ మరో అవకాశం ఇచ్చే చాన్స్ ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు ఎంపీలు అయ్యేవారు తరవాత కూడా మరో చాన్స్ దక్కించుకుంటారని పోటీ ఎక్కువగా ఉంది. ఎన్నికలకు డిసెంబర్ 3న నోటిఫికేషన్ వస్తుంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకుడిసెంబర్ పదో తేదీ వరకూ టైం ఉంది కాబట్టి చంద్రబాబు ఎనిమిది, తొమ్మిదో తేదీల్లో పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది.