Hair Fall: సిగరెట్లు కాలుస్తున్నారా? జుట్టు రాలిపోగలదు జాగ్రత్త
ధూమపానం అధికంగా చేసేవారిలో వెంట్రుకలు రాలిపోయే సమస్య వస్తుంది.
Hair Fall: ఆధునిక కాలంలో జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువ మందిలోనే ఉంది. అయితే ధూమపానం, మద్యపానం చేసేవారిలో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నాయి అధ్యయనాలు. ధూమపానం, మద్యపానం రెండూ కూడా జుట్టు ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. సిగరెట్లు కాల్చడం వల్ల మొత్తం ఆరోగ్యం పైనే ప్రతికూల ప్రభావం ఉంటుంది. అలాగే జుట్టు కుదుళ్ళు కూడా బలహీనంగా మారుతాయి. సిగరెట్లలో ఉండే టాక్సిన్స్ తలమీద రక్తప్రసరణను తగ్గిస్తాయి. దీనివల్ల ఎయిర్ ఫోలికల్స్ అంటే వెంట్రుకల కుదుళ్ళకు ముఖ్యమైన పోషకాలు, ఆక్సిజన్ అందవు. దీనివల్ల వెంట్రుకలు బలహీన పడతాయి. దువ్వుతున్నా కొద్దీ రాలిపోతూ ఉంటాయి. ధూమపానం శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కూడా పెంచుతుంది. అందుకే ధూమపానం చేసేవారిలో జుట్టు పలుచగా ఉండే అవకాశం ఎక్కువ. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ధూమపానానికి దూరంగా ఉండాలి.
మద్యపానం అధికంగా చేసే వారిలో కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. మద్యపానం శారీరక వ్యవస్థలపై ఎంతో హానికరమైన ప్రభావాలను చూపిస్తుంది. ఆల్కహాల్ శరీరాన్ని నిర్జలీకరణం చేస్తుంది. శరీరం డిహైడ్రేషన్ బారిన పడడం వల్ల జుట్టు పెరుగుదల కూడా తగ్గిపోతుంది. జుట్టుకు కావలసిన పోషకాలు అందవు. హార్మోన్ అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. కాలేయ పనితీరు దెబ్బతింటుంది. దీనివల్ల పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుంది. ఇవన్నీ కూడా జుట్టు కుదుళ్ళపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఆల్కహాల్ తాగే వారిలో కూడా జుట్టు పెరుగుదల తక్కువగా ఉంటుంది. వెంట్రుకలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు వంటివి సరిగా అందవు. దీనివల్ల పోషకాహార లోపం తలెత్తుతుంది. జుట్టు రాలడం అధికమవుతుంది.
జుట్టు రాలడానికి జన్యు లోపాలు, హార్మోన్ల లోపాలు, పర్యావరణ కారకాలు కూడా కారణం కావచ్చు. జుట్టును కాపాడుకోవాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.
ధూమపానాన్ని పూర్తిగా మానేయాలి. ధూమపానం మానేయడం వల్ల మొత్తం ఆరోగ్యం చక్కగా మారుతుంది. అలాగే అధిక ఆల్కహాల్ వినియోగాన్ని కూడా తగ్గించాలి. నిజానికి మద్యపానం పూర్తిగా మానేస్తేనే ఎంతో ఆరోగ్యం. మీకు ధూమపానం, మద్యపానం మానేసిన నెల రోజుల తర్వాత జుట్టు పెరుగుదలలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. శరీరంలో నీటి నిల్వలు ఉండేలా చూసుకోవాలి. తగిన మొత్తంలో నీరు తాగాలి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు నీరు చాలా అవసరం. ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలే అవకాశం ఉంది, కాబట్టి ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతుక్కోవాలి. వ్యాయామం, ధ్యానం, యోగా వంటివి చేయాలి. మీకు ఆనందాన్ని ఇచ్చే అలవాట్లను రోజు పాటించాలి. తగినంత నిద్రపోవాలి. పోషకాహారాన్ని తినాలి. జుట్టు మరీ ఎక్కువగా రాలుతుంటే వెంటనే డెర్మటాలజిస్టును కలవడం చాలా ముఖ్యం.
Also read: ఆ రాష్ట్రంలో పెరుగుతున్న ర్యాట్ ఫీవర్ కేసులు, ఈ జ్వరం ఎవరికైనా రావచ్చు - లక్షణాలు ఇవే
Also read: వానాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయ కాంటోలా, అదేనండి ఆకాకరకాయ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.