Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా కనిపిస్తున్నాయా? ఈ కెచప్‌తో తోమారంటే అద్దాల్లా మెరిసిపోతాయ్!
ఇంట్లో వెండి, రాగి, ఇత్తడి పాత్రలకు కొత్త రూపం ఇవ్వాలని అనుకుంటున్నారా? ఇలా శుభ్రం చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు.
ఇంట్లో రాగి, ఇత్తడి, తుప్పు పట్టిన పాత్రలు తోమాలంటే మామూలు డిష్ వాష్ బార్ సరిపోదు. దానితో కడగటం వల్ల అసలు వాటి మీద ఉన్న మురికి కాస్త కూడా పోదు. కానీ టొమాటో కెచప్ వేసి కడిగి చూడండి మీ ప్రతిబింబం చూపించేలా అద్దాల్లా మెరిసిపోతాయి. అదేంటి టొమాటో కెచప్ బ్రెడ్, శాండ్ విచ్, ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి కదా. మరి అంట్లు తోమడానికి ఉపయోగించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? కానీ మీరు విన్నది నిజమే. మసిపట్టిన గిన్నెలు, నల్లగా మారిన ఆభరణాలు, వంటగది కుళాయిల దగ్గర నుంచి తుప్పు పట్టిన పాత్రలు వరకు అన్ని మరకలు తొలగించేస్తుంది.
రాగి పాత్రలు
భారతీయుల గృహాల్లో చాలా మంది రాగి పాత్రలు వాడుతూ ఉంటారు. కానీ వాటిని శుభ్రం చేయడం శ్రమతో కూడుకున్న పని. అటువంటి వాటికి పాత రూపం ఇచ్చేందుకు టమాటో కెచప్ చక్కని పరిష్కారం. రాత్రిపూట లేదా ఉదయం అయినా వాటిని తోమడానికి ముందు వాటి మీద టమాటో కెచప్ వేసి 3-4 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత నిమ్మరసం, గోరువెచ్చని నీటితో తుడిచి డిష్ వాష్ లిక్విడ్ తో కడగాలి. అలా చేస్తే మీ పాత్రలు కొత్తగా కనిపిస్తాయి.
తుప్పు పట్టిన కుళాయిలు
తుప్పు లేదా నల్లగా మురికిపేరుకుపోయిన కుళాయిలు చూసేందుకు కూడా అసహ్యంగా అనిపిస్తాయి. వాటిని మీద కొద్దిగా ఈ సాస్ వేయండి. ఒక గంట పాటు దాన్ని కదిలించకుండా నానబెట్టాలి. తర్వాత వెనిగర్, నిమ్మకాయ, బేకింగ్ సోడా, ఉప్పు కలిపిన ద్రావణంలో స్క్రబ్ ముంచి రుద్ది చూడండి. చక్కగా మెరిసిపోతాయి.
ఇనుము పాత్రలు
ఐరన్ పాన్ లు తుప్పు త్వరగా పడతాయి. వాటిని వదిలించుకోవడానికి టమాటో కెచప్ చక్కగా పని చేస్తుంది. వేడి పాన్ మీద టమాటో కెచప్ వేసి 3-4 గంటల పాటు అలాగే ఉంచాలి. ఉప్పులో ముంచిన నిమ్మకాయతో దాన్ని స్క్రబ్ చేసేయండి. తళతలాడుతూ ఉంటాయి.
వెండి ఆభరణాలు
వెండి ఆభరణాలు బయట పెడితే నల్లగా మారిపోతాయి. వాటి మెరుపు మళ్ళీ తిరిగి తీసుకు రావడానికి టొమాటో కెచప్ ఉపయోగించి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. టొమాటో కెచప్ వాటి మీద వేసి కాసేపు పక్కన పెట్టాలి తర్వాత టూత్ బ్రష్ లేదా సాధారణ బ్రష్ వేసి రుద్దేస్తే సరి. కొత్తవాటిలా కనిపిస్తాయి.
ఇత్తడి కత్తి పీటలు
ఇప్పుడంటే చాకు, కూరగాయలు కట్ చేసుకునే మిషన్ వచ్చాయి కానీ పూర్వం అయితే ఇత్తడి కత్తి పీటలే ఉపయోగించే వాళ్ళు. వాటిని శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. మీ ఇంట్లో కూడా ఇత్తడి కత్తి పీట ఉండి మురికిగా కనిపిస్తుందా? జస్ట్ సింపుల్ టొమాటో కెచప్ కొద్దిగా దాని మీద వేసి నానబెట్టాలి. తర్వాత ఉప్పు వేసి స్క్రబ్ చేస్తే సరిపోతుంది. నల్లటి జిడ్డు మరకలు అన్ని తొలగిపోయి శుభ్రంగా కనిపిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.