ఈ సింపుల్ స్ట్రెచ్స్ మీ నడుము నొప్పిని దూరం చేసేస్తాయి
మిమ్మల్ని నడుంనొప్పి ఇబ్బంది పెడుతుందా? అయితే రోజూ ఈ సింపుల్ స్ట్రెచ్స్ చేసేయండి.
వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య వెన్నునొప్పి. ఇది కలిగితే ఓ పట్టాన కూర్చోలేము. పడుకోలేము. నిలబడినా ఇబ్బందే అన్నట్లు ఉంటుంది. ఈ సమస్య మీకు మాత్రమే ఉంది అనుకోకండి. ఇది ప్రతి వ్యక్తిని ప్రభావితం చేసే ఒక సాధారణమైన సమస్యగా చెప్పవచ్చు. దీర్ఘకాలికంగా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేదు సాధారణంగానే వస్తుంది అనుకుంటే మీరు ఇంట్లోనే కొన్ని యోగాసనాలు వేసి దీనిని దూరం చేసుకోవచ్చు.
కొన్ని లోయర్ బ్యాక్ స్ట్రెచ్‌లు మీకు వెన్ను నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి. అసౌకర్యాన్ని తగ్గించి.. నడుమును దృఢంగా మారుస్తాయి. అంతేకాకుండా కండరాల బిగుతును తగ్గించి.. దిగువ వెనుక భాగంలో కండరాలలో సండలింపును ప్రోత్సాహిస్తాయి. ఈ స్ట్రెచ్‌లు కేవలం వెన్నునొప్పిని మాత్రమే తగ్గిస్తాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీటివల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీ సిట్టింగ్ పోస్టర్‌ను కరెక్ట్ చేస్తాయి. కాబట్టి మెరుగైన భంగిమ మీ సొంతమవుతుంది. నడుము ప్రాంతంలోని గాయాలను తగ్గిస్తాయి. మెరుగైన రక్తప్రవహాం ఉంటుంది. కేవలం ఫిజికల్‌గానే కాదు మెంటల్‌గా ఈ స్ట్రెచ్స్ చేయవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఒత్తిడి, ఉద్రిక్తతలు తగ్గిస్తాయి. క్రీడాకారులు తమ వార్మప్ రొటీన్లలో ఈ స్ట్రెచ్స్ ఎక్కువగా చేస్తారు. పనిలో భాగంగా ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులకు చాలా ప్రయోజనాలు ఉంటాయి.
బేబి పోజ్..
సున్నితమైన, ఉత్తమమైన లోయర్ బ్యాక్ స్ట్రెచ్‌లలో బేబి పోజ్ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా తేలికగా చేయగలిగే ఆసనం. ఈ స్ట్రెచ్ చేయడానికి మీరు ముందుగా మోకాళ్లపై ఉండాలి. అనంతరం మీ పిరదులను కాళ్లపై ఉండేలా కూర్చోవాలి. అనంతరం ముందుకు వంగుతూ.. చేతులను వీలైనంత పొడవుగా చాస్తూ ముందుకు వెళ్లాలి. ఇప్పుడు మీ వీపును సున్నితంగా సాగదీసి లోతుగా ఊపిరి పీల్చుకుంటూ వదలండి. ఈ ఆసనంలో 20 నుంచి 30 సెకన్లు ఉండవచ్చు. కొంచెం విరామం తీసుకుని మరోసారి ఈ భంగిమను వేయాలి.
పవన ముక్తాసనం
ఈ ఆసనం నడుము నొప్పిని తగ్గించి ఉపశమనం అందిస్తుంది. దీనిని చేయడం కోసం వెనుకభాగంలో చాపపై పడుకుని.. కాళ్లు విస్తరించాలి. ఇప్పుడు ఒక కాలిని వంచి.. ఛాతీ వద్దకు తీసుకురావాలి. దానిని మీ రెండు చేతులతో పట్టుకుని.. సున్నితంగా స్ట్రెచ్ చేయాలి. ఇలా 20 నుంచి 30 సెకన్లు ఉండాలి. అనంతరం మరో కాలితో ఇలాగే రిపీట్ చేయండి.
పశ్చిమోత్తనాసనం..
మీ కాళ్లు చాచి.. నేలపై కూర్చోండి. నెమ్మదిగా ముందుకు వంగి.. మీ కాలి వేళ్లను పట్టుకోండి. నడుము మీద ప్రెజర్ లేకుండా.. మీ మోకాళ్లను కాస్త వంచి స్ట్రెచ్ చేయవచ్చు. ఈ ఆసనంలో 20 నుంచి 30 సెకన్లు ఉండాలి. కనీసం మూడుసార్లు ఈ ఆసనం చేయాలి.
పాదహస్తాసనం
ముందుగా నిటారుగా నిల్చోండి. అనంతరం శ్వాస పీల్చుకుంటూ.. నడుమును ముందుకు స్ట్రెచ్ చేయండి. వంగుతూ మీ కాలి వేళ్లను తాకేందుకు ప్రయత్నించండి. ముందుకు వంగే సమయంలో నడుము మీద ఒత్తిడి అనిపిస్తే మోకాళ్లను కాస్త వంచండి. దీనిని కూడా 20 నుంచి 30 సెకన్లు చేయాలి.
శవాసనం చేస్తూ ట్విస్ట్ ఇవ్వండి..
శవాసనంలో పడుకుని.. మీ మోకాళ్లను ఒకవైపు స్ట్రెచ్ చేసి 20 నుంచి 30 సెకన్లు ఉండండి. ఇది మీ నడుము నొప్పిని తగ్గించడంలో కీలకమైన ఆసనంగా చెప్పవచ్చు. అనంతరం మరోవైపు స్ట్రెచ్ చేయండి.
ఈ ఆసనాల్లో దేనిని చేసినా శ్వాస తీసుకోవడంలో జాగ్రత్త వహించండి. నొప్పి లేదా అసౌకర్యానికి గురయ్యేలా మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయకూడదు. రెగ్యూలర్‌గా ఈ స్ట్రెచ్స్ చేస్తూ ఉంటే.. మీకు తెలియకుండానే మీలో పర్ఫెక్షన్ వస్తుంది. కుదిరితో యోగా నిపుణులను సంప్రదించి ఈ ఆసనాలకు ట్రైన్ తీసుకోండి.
Also Read : రాత్రి వండిన అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి