మైగ్రేన్ తలనొప్పి వేదిస్తోందా? ఈ లక్షణాలను ముందే తెలుసుకుంటే ఉపశమనం సాధ్యమే!
కొంత మంది నొప్పి వల్ల నెలలో ఎనిమిది రోజులు నొప్పి వల్ల పని మిస్ అవుతోంది. అది మరేదో కాదు మైగ్రేన్. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
మైగ్రేన్.. తల పగిలిపోతుందా అన్నట్లుగా వచ్చే ఈ నొప్పిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ప్రతి ఏడుగురిలో ఒకరు ఈ మైగ్నేన్ సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో కొంత మంది నొప్పి వల్ల చాలామంది పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. మైగ్రేన్ సమస్యపై యూకేకు నేషనల్ మైగ్రేన్ సెంటర్ నిపుణులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మైగ్రేన్ అటాక్ కావడం వల్ల నెలలో దాదాపు ఎనిమిది రోజుల పాటు పనులు చేసుకోలేక పోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇవి కాకుండా నెలలో 15 రోజులు తలనొప్పి కూడా ఉంటోందట. ఈ సమస్య వల్ల చాలామంది ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని సర్వేలు తెలుపుతున్నాయి. అయితే మైగ్రేన్ అటాక్ ను ముందే తెలుసుకోవచ్చు అని నిపుణులు తెలిపారు.
- చాలా మందికి మైగ్రేన్ చిన్న తలనొప్పి లాగే మొదలవుతుంది. ఈ నొప్పి పెరిగే కొద్ది శరీరం బలహీన పడడం మొదలవుతుంది. నెమ్మదిగా నీరసించి పోతారు. తలలో ఏదో నాడీ కొట్టుకుంటున్నట్టు, చిన్నగా గుచ్చుకుంటున్నట్టు నొప్పి వస్తుంది. ఈ నొప్పి తక్కువ మోతాదులోనూ ఉండొచ్చు తీవ్రంగానూ ఉండొచ్చు. చాలా తరచుగా రోజు వారీ పనులను మైగ్రేన్ ఆటంకం కలిగిస్తుంది. కదులుతున్నపుడు, నడుస్తున్నపుడు ఈ నొప్పి ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది.
- మైగ్రేన్ నొప్పి పెరుగుతున్న కొద్దీ ట్రైజెమినల్ నాడీ వ్యవస్థ ఆక్టివేట్ అవుతుంది. ఇవి సెంట్రల్ నర్వస్ సిస్టంలో బయటి వైపు ఉండే నాడులు. అందువల్ల నొప్పికి సంబంధించిన సంకేతాలు మెదడులో కింది నుంచి పైకి కదులుతాయి. మెడ, భుజాల వరకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. మెడలోని కండరాలు బిగుసుకున్న భావన కలిగి మెడ, భుజాల భాగం సెన్సిటివ్ గా అనిపిస్తుంది. ముందుగా మెడ దగ్గర నొప్పి ప్రారంభం కావచ్చు.
- అలసటగా అనిపించడం మైగ్రేన్ లో చాలా సాధారణ లక్షణం. మైగ్రేన్ అటాక్ కు ముందు నుంచే అలసటగా ఉంటుంది. శక్తి హీనంగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక పోవడం వల్ల ఆవలింతలు వస్తుంటాయి. సరిపడినంత నిద్ర లేనపుడు, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ లో తేడా వచ్చినపుడు, డీహైడ్రేట్ అయినపుడు మైగ్రన్ అటాక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- మైగ్రేన్ అటాక్ అయినపుడు జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. అందువల్ల వికారంగా ఉంటుంది. కొన్ని సార్లు వాంతులు కూడా కావచ్చు. జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం వల్ల తీసుకున్న పెయిన్ కిల్లర్లను కూడా శరీరం గ్రహించక పోవచ్చు. ఫలితంగా పెయిన్ కిల్లర్లు సరిగా పనిచెయ్యవు. కొంతమందిలో ముఖ్యంగా పిల్లల్లో కడుపు నొప్పి కూడా రావచ్చు.
- మైగ్రేన్ తో బాధపడుతున్నపుడు మెదడులోని విద్యుత్ చాలక శక్తి కూడా నెమ్మదిస్తుంది. కొంత మందిలో కొన్ని సార్లు ఆరా అని పిలిచే ఒక వెలుతురు లేదా చీకటి కళ్ల ముందు కదలాడుతుంది. ఇది తలనొప్పి ప్రారంభం కావడానికి కొద్ది ముందు ఈ లక్షణం కనిపిస్తుంది. ఇది మైగ్రేన్ తో బాధపడే వారిలో 25 శాతం వ్యక్తుల్లో మాత్రమే ఈ లక్షణం కనిపిస్తుంది.
- ఈ ఆరా జిగ్జాగ్ లు రకరకాల రంగుల్లో మెరుపులు, కాంతి, బ్లైండ్ స్పాట్ లాగా అనిపిస్తుంది. కొంత మందిలో మాట్లాడడం లో ఇబ్బంది కూడా ఏర్పడవచ్చు.
- ఇంకొందరిలో చిన్న చిన్న వాసనలు కూడా తీవ్రంగా అనిపించవచ్చు. లేదా ఒక వైపు చెయ్యి లేదా ముఖంలో జలదరింపు లాంటి భావన కలగవచ్చు. ఇలాంటి వారు మైగ్రేన్ అటాక్ కు ముందు పెర్ఫ్యూమ్ వంటి ఘాటైన వాసనలు, చిన్న శబ్ధాలకు కూడ చాలా ఇరిటేట్ అవుతారు. మైగ్రేన్ ఎటాక్ అయినపుడు నిశ్శబ్ధంగా ఉండే చీకటి గదిలో ఉండాలని కోరుకుంటారు.
- మైగ్రేన్ పురుషుల కంటే స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు కారణం ఈస్ట్రోజెన్ హార్మోన్ మార్పులు, అందుకే నెలసరికి ముందు లేదా గర్భవతుల్లో మైగ్రేన్ తో బాధపడేవారికి అటాక్స్ ఎక్కువగా ఉంటాయి. మెనోపాజ్ వయసుకు వచ్చిన వారిలో కూడా హాట్ ఫ్లషెస్, రాత్రి పూట చెమటలు, మూడ్ స్వంగ్స్, మతిమరుపు వంటి వాటితో పాటు మైగ్రేన్ అటాక్స్ కూడా పెరుగుతాయి.
- నాడీ వ్యవస్థ పనితీరులో మార్పు వల్ల మెదడు పనితీరులో మార్పు వస్తుంది. మైగ్రేన్ కు ముందు కొంత మందిలో డిప్రెషన్ లేదా విసుగు ఎక్కువ అవుతుంది.
- ఆరా కనిపించే వారిలో కొంత మందిలో కళ్లు కూడా తిరుగుతాయి. కొంత మంది స్పృహ కూడా కోల్పోవచ్చు. వెస్టిబ్యూలార్ మైగ్రేన్ అనే ఒక రకమైన మైగ్రేన్ లో తలనొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాస్త తలనొప్పితో, అసౌకర్యంగా, అస్థిమితంగా ఉంటారు. కొంచెం వికారం లేదా వాంతులు ఉండొచ్చు.
- కొంత మందిలో శరీరం ఒక వైపు బలహీన పడినట్టు ఫీల్ అవుతారు. అయితే ఇది చాలా మందిలో ఒక గంటలోపు సర్దుకుంటుంది. కొంత మందికి మాటలు త్వరగా గుర్తురావు. మాట్లాడడంలో కూడా ఇబ్బంది పడుతుంటారు.
- చాలా సార్లు మైగ్రేన్ ను గుర్తించడం కష్టం సాధారణ తలనొప్పిగా కొట్టిపారేస్తుంటారు. అయితే మైగ్రేన్ సాధారణ తలనొప్పి కాదు. దీనితో పెద్ద నష్టం లేకపోయినా క్వాలిటీ ఆఫ్ లైప్ ను ఎఫెక్ట్ చేస్తుంది. వారి సామాజిక, కుటుంబ సంబంధాల మీద ప్రభావం చూపుతుంది.
చికిత్స ఎలా?: చికిత్స విషయానికి వస్తే చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతారు. కానీ ఇప్పుడు మంచి చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. Anti-CGRP monoclonal యాంటీబాడీ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మైగ్రేన్ తీవ్రతను బట్టి నెల రోజులకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చు. వీటిని డాక్టర్ సలహా మేరకు వాడాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఏ కారణంతో మైగ్రేన్ ఎటాక్ అవుతోందో తెలుసుకుని జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉదాహారణకు కొన్ని రకాల ఆహార పదార్థాలు, పర్ఫ్యూమ్స్, ఒత్తిడి, నిద్ర లేమి ఇలా ఏదైనా కారణం వల్ల నొప్పి వస్తున్నట్లయితే వాటికి దూరంగా ఉండాలి. లక్షణాలు అందరిలో ఒకే మాదిరిగా ఉండకపోవచ్చు. కానీ కచ్చితంగా ఏదో ఒక లక్షణాన్ని ముందుగా గుర్తించేందుకు వీలుంటుంది.
Also read: ఈ సమస్యలు ఉన్నవాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకపోవడమే బెటర్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.