Mango: మామిడి పండ్లను తినేముందు కాసేపు నీళ్లలో నానబెట్టాలా? అలా చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి?
మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. వాటిని తినే ముందు నీళ్లలో నానబెట్టమని చెబుతారు.
వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్లు మార్కెట్లలో దర్శనమిస్తాయి. వాటిని తినేందుకు ప్రజలు వేసవి కాలం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ పండ్లు ప్రపంచంలో ప్రసిద్ధమైనవి, రుచికరమైనవి. మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టాలని చెబుతారు పోషకాహార నిపుణులు. అలా ఎందుకు నానబెట్టాలో చాలామందికి తెలియదు. పూర్వం సాంప్రదాయపరంగా కూడా మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టేవాళ్ళు.
ఎందుకు నానబెట్టాలి?
మామిడి పండ్లను తినేముందు వాటిని కనీసం ఒక గంట పాటు నీటిలో నానబెట్టాలని పూర్వకాలం నాటి అమ్మమ్మలు, నానమ్మలు సలహా ఇస్తూ ఉంటారు. అలా చేయడానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. మామిడిపండ్లలో ఉత్పత్తి అయ్యే అదనపు ఫైటిక్ ఆమ్లం తొలగించడానికి నీళ్లలో నానబెట్టాలి. వివిధ కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటి వాటిలో ఈ ఫైటికి యాసిడ్ ఉంటుంది. ఇలా నానబెట్టడం వల్ల అవి విచ్ఛిన్నమైపోతుంది.ఈ ఫైటిక్ యాసిడ్లు అదనపు వేడిని కూడా ఉత్పత్తి చేస్తాయి. నీటిలో నానడం వల్ల ఈ అదనపు వేడి కూడా తగ్గిపోతుంది.
టాక్సిన్లను తొలగిస్తుంది
పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం మామిడి పండ్లను తినడానికి కొన్ని నిమిషాలు లేదా గంట పాటు నీళ్లలో నానబెట్టడం వల్ల వాటి తొక్కపై ఉండే కనిపించని నూనె తొలగిపోతుంది. అది కొందరిలో ఎలర్జీలు కలిగించే అవకాశం ఉంది. అలాగే పాలీఫెనాల్స్, టానిన్లు వంటి సూక్ష్మ పదార్థాల మిశ్రమం తొక్క పైన ఉండే అవకాశం ఉంది. అవి శరీరంలో చేరితే దురద, బొబ్బలు రావడానికి కారణం అవుతుంది. ఇలా మామిడిపండ్లు నానబెట్టడం వల్ల అవన్నీ బయటికి పోతాయి. పండు తినడానికి సురక్షితంగా మారుతుంది.
మామిడి పండ్లను ఇలా నీటిలో నానబెట్టడం వల్ల వాటి రుచి కూడా బాగుంటుంది. ప్రత్యేకించి ఆ పండ్లను ఫ్రిడ్జ్ లో ఎక్కువ కాలం ఉంచినట్లయితే వాటిని కచ్చితంగా నీళ్ళల్లో నానబెట్టాలి. ఆ పండులో ఉండే కొన్ని సమ్మేళనాలు వాసనను, రుచిని మార్చేస్తాయి. కాబట్టి మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టడం వల్ల మీరు వాటి సహజమైన తీపి, సువాసనను తిరిగి పొందవచ్చు. అలాగే పండ్లను తిరిగి హైడ్రేటింగ్‌గా మారుస్తాయి.
సీజనల్ ఫ్రూట్ అయిన మామిడి పండ్లు కచ్చితంగా తినాల్సిందే. ఇవి వేసవిలో వచ్చే రోగాల నుంచి కాపాడే రోగినిరోధక శక్తిని అందిస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో ఇవి సహాయపడతాయి. మహిళలు, పిల్లలు మామిడి పండ్లను తినడం వల్ల రక్త హీనత తగ్గుతుంది. ఇది సులువుగా జీర్ణమవుతుంది.
Also read: మీరు తెలివైన వారైతే 15 సెకండ్లలో ఈ బొమ్మలో ఉన్న గ్రహాంతరవాసిని గుర్తించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.