Khichdi Recipe: సజ్జలతో మసాలా కిచిడీ, డయాబెటిక్ రోగులకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్
Kichidi Recipe: సజ్జలతో చేసే రెసిపీలు చాలా తక్కువ. అందులో టేస్టీ వంటకం ఇది.
Kichdi Recipe: సజ్జలు తినే వాళ్లు చాలా తక్కువ. నిజానికి ఇవి చాలా ఆరోగ్యకరం. పూర్వం ఇవే ప్రధాన ఆహారంగా ఉండేవి. కానీ ఎప్పుడైతే తెల్లన్నం అధికంగా తినడం మొదలుపెట్టామో అప్పట్నించి చిరు ధాన్యాలు పక్కన పెట్టాము. రాగులు, సామలు కొందరైనా ఇంకా వాడుతున్నారు కానీ సజ్జలను పట్టించుకోవడమే మానేశారు. కానీ ఇవి శరీరానికి కావాల్సినంత శక్తిని పుష్కలంగా ఇస్తాయి. దీనితో చేసుకునే టేస్టీ వంటకం సజ్జల మసాలా కిచిడీ.
కావాల్సిన పదార్థాలు
సజ్జలు - ఒకటిన్నర కప్పు
బంగాళాదుంపలు - రెండు
ఉల్లిపాయ - ఒకటి
టమాటో - ఒకటి
పచ్చి మిర్చి - రెండు
నెయ్యి - రెండు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - తగినంత
లవంగాలు - రెండు
పసుపు - అర స్పూను
కారం - అర స్పూను
కరివేపాకులు - గుప్పెడు
బిర్యాని ఆకు - రెండు
ఇంగువ - చిటికెడు
తయారీ ఇలా
1. సజ్జలు నీటిలో నానబెట్టి కాసేపు ఉడికించాలి. తరువాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
2. బంగాళాదుంపలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక ఇంగువ, లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు, లవంగాలు వేసి వేయించాలి.
4. నిలువుగా ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. కారం, పసుపు కూడా వేయాలి. బంగాళాదుంపలను మెత్తగా నొక్కి వేసి కలపాలి. అన్నీ బాగా కలుపుకోవాలి.
5.ఇప్పుడు టమోటాలు వేసి మగ్గించాలి.
6. ఉడికించిన సజ్జలను వేసి కలపాలి. ఉప్పు వేయాలి.
7. నీరు వేసి మూత పెట్టి కాసేపు ఉడికించాలి.
8. నీరు తగ్గి కిచిడీ రెడీ అయినట్టు అనిపిస్తే స్టవ్ కట్టేయాలి.
9. అంటే టేస్టీ మసాలా కిచిడీ రెడీ అయింది.
సజ్జలు చిరుధాన్యాల జాబితాలోకి వస్తాయి. దీన్ని ఆంగ్లంలో ‘పెర్ల్ మిల్లెట్స్’ అంటారు. ఇది మనకు, ఆఫ్రికన్లకు బాగా తెలిసిన పంట. దీన్ని అధికంగా తినేవారు ఈ దేశస్థులే. కానీ మనదేశంలో చాలా ఏళ్లుగా తెల్లన్నం తినడం అలవాటై సజ్జలను పక్కన పెట్టారు. రుచి కూడా అంతగా ఉండకపోవడం వల్లే వీటిని పక్కన పెట్టారు. నిజానికి వీటిని తినడం వల్ల ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. డయాబెటిక్ రోగులకు ఇది ఉత్తమ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కాబట్టి ప్రతి రెండు రోజులకోసారి తింటే ఎంతో మంచిది. పిల్లలకు పెట్టినా వారికి ఎంతో శక్తినిస్తుంది. సజ్జలలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది. అలసట, నీరసం వంటివి సజ్జలు తినడం వల్ల పోతాయి. రక్తహీనత సమస్య రాకుండా అడ్డుకుంటాయి సజ్జలు. మతిమరుపు రాకుండా అడ్డుకోవడంలో ఇది ముందుంటుంది. సజ్జలతో ఈ కిచిడీ రెసిపీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
Also read: ఈ సమయాల్లో తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ, ముందు జాగ్రత్తలు తీసుకోక తప్పదు