Saggubiyyam kichidi : సగ్గుబియ్యం కిచిడీ రెసిపీ.. దీనిని నైవేద్యంగా కూడా పెట్టొచ్చు
Healthy Breakfast : సగ్గుబియ్యంతో పాయసం చేసుకుంటారు లేదంటే సగ్గుబియ్యం జావా చేసుకుంటారు. కానీ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కిచిడీ చేసుకుంటారని మీకు తెలుసా?
Sabudana Kichidi Recipe : సగ్గుబియ్యం పాయసాన్ని చాలామంది నైవేద్యంగా పెడతారు. అయితే సగ్గుబియ్యంతో చేసే స్పైసీ కిచిడీని కూడా నైవేద్యంగా పెడతారని మీకు తెలుసా? దక్షిణాది ప్రాంతాల్లో దీనిని తక్కువగా చేస్తారు కానీ.. నార్త్ సైడ్ కచ్చితంగా దీనిని నైవేద్యంగా చేస్తారు. ముఖ్యంగా ఉపవాసం సమయంలో చాలామంది ఈ రెసిపీని తీసుకుంటారు. ఇది ఆరోగ్యాని మంచి చేస్తుంది కాబట్టి చిన్న నుంచి పెద్దవరకు అందరూ దీనిని తినొచ్చు. పైగా దీని రుచి కూడా అద్బుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఏవిధంగా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
సగ్గు బియ్యం - 1 కప్పు
పల్లీలు - అరకప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర - 1 టీస్పూన్
ఎండు మిర్చి - 4
కరివేపాకు - 1 రెబ్బ
ఉప్పు - రుచికి తగినంత
కారం - 1 టీస్పూన్
కొత్తిమీర - 1 కట్ట (చిన్నది)
పచ్చిమిర్చి - 2
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
ఈ రెసిపీని తయారు చేసే ముందుగా సగ్గుబియ్యాన్ని బాగా కడగాలి. దానిని నీటిలో గంటన్నర సేపు నాననివ్వాలి. కచ్చితంగా గంటన్నర నాననివ్వాలి. దానికన్నా ఎక్కువైనా పర్లేదు. ఇలా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని నీటి నుంచి వేరు చేసి.. ఓ క్లాత్లో వేసి ఓ గంట ఆరనివ్వండి. సగ్గుబియ్యంలోని నీరు పూర్తిగా వెళ్లిపోవాలి. ఇది కచ్చితంగా చేయాల్సిందే. లేకుంటే కిచిడి అతుక్కుపోయే ప్రమాదముంది. మీకు పొడిపొడిగా రావాలంటే నానిన సగ్గుబియ్యాన్ని కచ్చితంగా ఆరబెట్టాలి.
పల్లీలను డ్రై రోస్ట్ చేసి.. వాటిపై పొట్టు తీసి సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకును కడిగి చిన్నగా తురుముకోవాలి. సగ్గుబియ్యం ఆరిన తర్వాత ఓ గిన్నె తీసుకుని దానిలో సగ్గుబియ్యం, పల్లీలు, ఉప్పు, కారం బాగా కలపాలి. ఇది సగ్గుబియ్యానికి ఓ కోట్లా పనిచేస్తుంది. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో నెయ్యి వేయండి. అది కాగిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేయండి. ఎండుమిర్చి వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసేయండి. తాళింపు బాగా కలిసేలా తిప్పండి.
స్టౌవ్ మంటను తగ్గించి.. లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. మధ్యలో ఓ సారి గరిటతో తిప్పి.. మళ్లీ మూత వేసి మరికొన్ని నిమిషాలు మగ్గనివ్వండి. అనంతరం స్టౌవ్ ఆపేసి దానిలో నిమ్మరసం వేసి బాగా కలపండి. కింద నుంచి పైకి కలుపుతూ ఉండండి. అలా చేస్తేనే నిమ్మరసం బాగా మిక్స్ అవుతుంది. దీనిని కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ చేసి వేడి వేడిగా లాగించేయడమే. దీనిని పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్నిప్రాంతాల్లో ఈ రెసిపీని దేవుడికి నైవేద్యంగా పెడతారు. అంతేకాకుండా ఈ రెసిపీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి పిల్లల నుంచి పెద్దలవరకు.. దీనిని హాయిగా లాగించేయవచ్చు. మధుమేహం ఉన్నవారు కూడా ఈ టేస్టీ రెసిపీని ఆస్వాదించవచ్చు.
Also Read : రవ్వతో టేస్టీ, క్రంచీ గారెలు.. ఈ రెసిపీకి మినపప్పు అవసరమే లేదు
గమనిక: ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.